భారత్‌ సహా నాలుగు దేశాలపై నిషేధం ఎత్తివేత

26 Jan, 2021 13:27 IST|Sakshi

మాస్కో: మహమ్మారి కరోనా ప్రవేశంతో అంతర్జాతీయ ప్రయాణాలు ఆగిపోయిన విషయం తెలిసిందే. ఇప్పుడు పరిస్థితులు సద్దుమణగడం.. వ్యాక్సిన్‌ కూడా రావడంతో క్రమేణా ప్రపంచ దేశాలు ఇతర దేశాలకు రాకపోకలు కొనసాగించేందుకు సిద్ధమవుతున్నాయి. ఇప్పటికే భారతదేశం షరతులతో రాకపోకలకు అనుమతిచ్చిన విషయం తెలిసిందే. తాజాగా రష్యా ఇప్పుడు పలు దేశాలకు విధించిన రాకపోకల నిషేధాన్ని ఎత్తివేసింది. 

భారతదేశంతో పాటు ఫిన్‌ల్యాండ్‌, వియత్నాం, ఖతార్‌ దేశాలకు అంతర్జాతీయ ప్రయాణాలు కొనసాగించవచ్చని రష్యా నిన్న ప్రకటించింది. ఈ మేరకు నిషేధాన్ని ఎత్తివేస్తున్నట్లు తెలిపింది. మార్చి 16, 2020లో విధించిన నిషేధం దాదాపు పది నెలల తర్వాత జనవరి 25న ఎత్తివేశారు. దీంతో ఈ దేశాల మధ్య రాకపోకలు పునరుద్ధరిస్తున్నట్లు రష్యా తెలిపింది. రష్యాలో 36, 79, 247 కరోనా కేసులు నమోదవగా, 68, 397 మంది మృత్యువాత పడ్డారు. ఆ దేశంలో తాజాగా సోమవారం 19,290 కేసులు నమోదవగా.. 456 మృతులు నమోదయ్యాయి.

మరిన్ని వార్తలు