Hypersonic Missile Kinjal: ఉక్రెయిన్‌పై రష్యా ‘కింజల్‌’ ప్రయోగం.. అమెరికా ఏం చెప్పిందో చూడండి!

22 Mar, 2022 11:33 IST|Sakshi

ఉక్రెయిన్‌పై యుద్ధం మొదలు పెట్టి 27 రోజులైనప్పటికీ ఫలితం కనిపించకపోవడంతో రష్యా తన దాడులను తీవ్రతరం చేసింది. ఈక్రమంలో భారీ ఎత్తున బాంబులు కూడా రష్యన్‌ బలగాలు ప్రయోగిస్తున్నాయి. ఇటీవల అత్యంత కచ్చితత్వంతో లక్ష్యాన్ని ఛేదించే అత్యాధునిక హైపర్‌ సోనిక్‌ క్షిపణి ‘కింజల్‌’ను కూడా ప్రయోగించినట్లు రష్యా ప్రకటించిన సంగతి తెలిసిందే. అణ్వాయుధాలనూ మోసుకుపోగల కింజల్‌ను రష్యా యుద్ధంలో ప్రయోగించడం ఇదే తొలిసారి అని కూడా చెప్పింది. దీంతో రష్యా అణు బాంబు ప్రయోగించే సాహసం చేస్తుందా అన్న అంశంపై రకరకాల విశ్లేషణలు విన్పిస్తున్నాయి. 
(చదవండి: ప్రత్యర్థుల గుండెల్లో ‘పిడిబాకు’.. కింజల్‌ ప్రత్యేకతలివే!)

అయితే తాజాగా ఆ ప్రకటనలను అగ్రరాజ్యం అమెరికా తోసిపుచ్చింది. దీనిపై అమెరికా రక్షణశాఖ అధికారి మాట్లాడుతూ.. సైనికులు అలాంటి ఆయుధాన్ని ఉపయోగించడం అంత సులువు కాదని, చాలా అరుదైన సందర్భాల్లో మాత్రమే ఆ తరహా ఆయుధాల్ని ఉపయోగిస్తారని పేర్కొన్నారు. అయితే రష్యా ఇటువంటి ప్రకటనల ద్వారా పశ్చిమ దేశాలకు హెచ్చరిక సందేశాలు పంపేందుకు ప్రయత్నిస్తోందని చెప్పారు. కింజల్‌ ప్రయోగించడంపై అసలు స్పష్టతే లేదని ఆయన అన్నారు.

కాగా రష్యా మిలిటరీ అధికారుల ప్రకారం.. ఉక్రెయిన్‌ సైనిక ఆయుధాగారంపై శుక్రవారం అర్ధరాత్రి కింజల్‌ను ప్రయోగించారు. పశ్చిమ ఉక్రెయిన్‌లో రొమేనియా సరిహద్దు సమీపంలోని ఇవనో–ఫ్రాంకివ్స్‌క్‌ ప్రాంతంలో క్షిపణులు, వైమానిక ఆయుధాలను నిల్వ చేసే భారీ భూగర్భ ఆయుధాగారాన్ని కింజల్‌ పూర్తిగా ధ్వంసం చేసిందని రష్యా రక్షణ శాఖ
అధికార ప్రతినిధి ఇగోర్‌ కొనషెంకోవ్‌ ప్రకటించిన సంగతి తెలిసిందే.
(చదవండి: Ukraine Russia War: ఉక్రెయిన్‌ ఓ శిథిల చిత్రం.. ఎవరిని కదిలించినా కన్నీటి కథలే )

మరిన్ని వార్తలు