అమెరికా డ్రోన్‌ను ఢీ కొట్టి.. బుకాయించిన మాస్కో.. వీడియో సాక్ష్యం వదిలిన అమెరికా

16 Mar, 2023 17:37 IST|Sakshi

రిచ్‌మాండ్‌: తమ నిఘా డ్రోన్‌ను రష్యా కూల్చేయడంపై విమర్శలు గుప్పిస్తున్న అమెరికా.. తాజాగా అందుకు సంబంధించిన సాక్ష్యాన్ని బయటపెట్టింది. దాదాపు నిమిషం నిడివి ఉన్న వీడియోను విడుదల చేసి రష్యా నిర్లక్ష్య ధోరణిని తప్పుబట్టింది. 

మార్చి 14వ తేదీన.. రష్యా యుద్ధ విమానం నల్ల సముద్రంపై అమెరికా నిఘా డ్రోన్‌ను ఢీకొట్టింది. అయితే.. చాకచక్యంగా వ్యవహరించిన అమెరికా సైన్యం..  తమ డ్రోన్‌ను కిందకు దించింది. ఆపై యూఎస్‌ యూరోపియన్‌ కమాండ్‌ ఒక ప్రకటన విడుదల చేసింది. ‘‘నల్ల సముద్రంపై అంతర్జాతీయ ఎయిర్‌స్పేస్‌లో రష్యాకు చెందిన రెండు ఎస్‌యూ–27 ఫైటర్‌ జెట్లు ఎలాంటి రక్షణ లేకుండా విన్యాసాలు చేపట్టాయి.  అందులో ఒకటి యూఎస్‌కు చెందిన ఎంక్యూ–9 డ్రోన్‌ను ఢీకొట్టింది’’ అని సదరు ప్రకటనలో వెల్లడించింది.

ఇప్పుడు అందుకు సంబంధించిన వీడియోను విడుదల చేసింది. సెకండ్ల వ్యవధిలోనే రెండుసార్లు డ్రోన్‌కు దగ్గరగా వెళ్లింది రష్యా ఫైటర్‌ జెట్‌. అంతేకాదు.. ఫ్లూయెల్‌ను అమెరికన్‌ డ్రోన్‌పై గుప్పించే యత్నం చేసిందని యూఎస్‌ మిలిటరీ ఆరోపిస్తోంది. ఢీ కొట్టడానికి ముందు ఎస్‌యూ-27 ఫ్యూయెల్‌ను కుమ్మరించింది. ఇది పూర్తిగా నిరక్ష్యం.. అన్‌ప్రొఫెషనల్‌మ్యానర్‌ అంటూ విమర్శించింది. 

ఇక అమెరికా విమర్శలపై రష్యా స్పందించింది. తప్పిదం ఎంక్యూ-9 డ్రోన్‌ తరపు నుంచే ఉందని పేర్కొంటూ రష్యా రక్షణ శాఖ ఒక ప్రకటన విడుదల చేసింది. అయితే తాజా వీడియో నేపథ్యంలో మాస్కో​ వర్గాలు ఎలా స్పందిస్తాయనే ఆసక్తి నెలకొంది.

మరిన్ని వార్తలు