తాగుబోతు వీరంగం.. కాలిబూడిదైన 15 మంది! రష్యాలో ఘోర ప్రమాదం

5 Nov, 2022 16:47 IST|Sakshi

మద్యం మత్తులో ఓ వ్యక్తి చేసిన అతి.. రష్యాలో పదిహేను మంది నిండు ప్రాణాల్ని బలి తీసుకుంది. ప్రేయసితో నైట్‌క్లబ్‌కు వచ్చి తప్పతాగి.. ఆ జోష్‌లో వీరంగం సృష్టించాడతను. ఈ క్రమంలో డ్యాన్స్‌ ఫ్లోర్‌పై ఫ్లేర్‌ గన్‌ ప్రయోగించడంతో భారీ అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో పదిహేను మంది సజీవదహనం అయ్యారు.

మాస్కోకు 300 కిలోమీటర్ల దూరంలోని కోస్ట్రోమా నగరంలోని ఓ బార్‌ అండ్‌ కేఫ్‌లో ఈ దుర్ఘటన చోటు చేసుకుంది. పదిహేను మంది అక్కడికక్కడే కాలిబూడిదయ్యారు. మంటల్లో చిక్కుకుపోయిన మరో 250 మందిని సురక్షితంగా బయటకు తీసుకొచ్చారు సహాయక​ సిబ్బంది. గాయపడిన ఐదుగురికి చికిత్స అందుతోందని రష్యా న్యూస్‌ ఏజెన్సీ టీఏఎస్‌ఎస్‌ కథనం ప్రచురించింది. 

శుక్రవారం అర్ధరాత్రి దాటాక 2గంటల ప్రాంతంలో  పొలిగాన్‌ బార్‌లో అగ్ని రాజుకుంది. మొత్తం బిల్డింగ్‌ కూలే ప్రమాదం ఉండడంతో.. అతికష్టం మీద ఐదున్నర గంటలపాటు శ్రమించి మంటల్ని అదుపు చేశారు ఫైర్‌ సిబ్బంది. ప్రేయసితో పాటు బార్‌కు వచ్చిన సదరు వ్యక్తి.. ఆమెకు పూలు ఇచ్చి కాసేపు సరదాగా గడిపాడు. ఆపై మద్యం మత్తులో రెచ్చిపోయి.. విచిత్రంగా ప్రవర్తించాడు.

అక్కడే ఉన్న కొందరితో గొడవకు దిగారు. చివరకు డ్యాన్స్‌ ఫ్లోర్‌ ఎక్కి.. చేతిలో ఉన్న ఫ్లేర్‌ గన్‌తో కాల్పులు జరిపాడని ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. ఘటనకు కారణమైన వ్యక్తి అక్కడి నుంచి పారిపోయాడని తెలుస్తోంది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. అతన్ని పట్టుకునే ప్రయత్నంలో ఉన్నారు. మరోవైపు ఘటన సమయంలో ఎమర్జెన్సీ డోర్‌లు పని చేయలేదన్న విమర్శ సైతం వినిపిస్తోంది.

మరిన్ని వార్తలు