ఉక్రెయిన్‌పై రష్యా దాడులు: 22 మంది దుర్మరణం

29 Apr, 2023 06:01 IST|Sakshi

కీవ్‌: రష్యా దాడుల్లో శుక్రవారం 22 మంది ఉక్రేనియన్లు దుర్మరణం పాలయ్యారు. ఉమాన్‌లో 9 అంతస్తుల నివాస భవనంపై క్షిపణి దాడిలో ముగ్గురు చిన్నారులతో పాటు 20 మంది చనిపోయారు. ఇప్పటిదాకా యుద్ధ చాయలు కనిపించని ఈ నగరంపై రష్యా తొలిసారి లాంగ్‌రేంజ్‌ క్షిపణులను ప్రయోగించింది. మరోవైపు 2 నెలల తర్వాత రాజధాని కీవ్‌లోని ఓ నివాస భవనంపై క్షిపణి దాడి జరిగింది.

తమ గగనతలంలోకి ప్రవేశించిన 21 క్రూయిజ్‌ మిస్సైళ్లను, రెండు డ్రోన్లను కూల్చివేసినట్లు ఉక్రెయిన్‌ అధికారులు ప్రకటించారు. నీప్రో నగరంలోని నివాస ప్రాంతాలపై రష్యా బలగాల దాడిలో రెండేళ్ల చిన్నారి, ఆమె తల్లి చనిపోగా మరో నలుగురు గాయపడినట్లు గవర్నర్‌ చెప్పారు. ఈ దాడులతో ఉద్దేశపూర్వకంగా బెదిరించేందుకు రష్యా ప్రయత్నిస్తోందని ఉక్రెయిన్‌ అంటుండగా తమ దీర్ఘ శ్రేణి క్షిపణులు లక్ష్యాలను ఛేదించినట్లు రష్యా చెబుతోంది. రష్యా ఆక్రమిత డొనెట్‌స్క్‌పై ఉక్రెయిన్‌ బలగాల రాకెట్‌ దాడిలో ఏడుగురు పౌరులు దుర్మరణం చెందినట్లు నగర మేయర్‌ చెప్పారు.

మరిన్ని వార్తలు