టికెట్ ధర ఎంతైనా తగ్గేదేలే.. రూ.లక్షలు పెట్టి దేశం వీడుతున్న రష్యన్లు

27 Sep, 2022 14:08 IST|Sakshi

మాస్కో: యుద్ధానికి సిద్ధం కావాలని రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ఇటీవల అధికారిక ఆదేశాలు జారీ చేసిన విషయం తెలిసిందే. ఆ మరునాటి నుంచే చాలా మంది రష్యన్లు దేశం వీడి పారిపోతున్నారు. కొద్ది రోజుల్లో దేశ సరిహద్దులు మూసివేస్తారని తెలిసి రూ.లక్షలు ఖర్చు చేసి మరీ విమాన టికెట్లు కొనుగోలు చేస్తున్నారు. ముఖ్యంగా సంపన్నులు ఎంత ఖర్చయినా లెక్క చేయకుండా ఇతర దేశాలకు వెళ్లిపోతున్నారు.

ఇదే అదనుగా భావించిన విమాన  సంస్థలు టికెట్ల ధరలు, ప్రైవేటు జెట్‌ల ఛార్జీలను భారీగా పెంచాయి. ఆర్మేనియా, టర్కీ, అజర్‌బైజన్ వంటి దేశాలకు రష్యా పౌరులు వీసా లేకుండానే వెళ్లవచ్చు. దీంతో ఆయా దేశాలకు ఛార్జీలను ఏకంగా 20వేల పౌండ్ల(రూ.17.5లక్షలు) నుంచి 25వేల పౌండ్ల(రూ.22లక్షలు) మధ్య నిర్ణయించాయి విమానయాన సంస్థలు. 8 సీట్ల ప్రైవేటు జెట్ విమానానికి ఏకంగా రూ.75 లక్షల నుంచి రూ.కోటి వరకు ఛార్జీలు వసూలు చేస్తున్నాయి. సాధారణ ఛార్జీలతో పోల్చితే ఇది చాలా రెట్లు అధికం.

ఛార్జీలు ఇంత అధికంగా ఉన్నా రష్యన్లు మాత్రం ఏమాత్రం వెనకడుగు వేయడం లేదు. యుద్ధంలో పాల్గొనకుండా హాయిగా బతికేందుకు డబ్బు గురించి ఆలోచించకుండా దేశం వీడి పారిపోతున్నారు. పుతిన్ ప్రకటన తర్వాత ఇప్పటికే 2.6లక్షల మంది రష్యన్లు దేశాన్ని వీడినట్లు కీవ్‌కు చెందిన వార్తా సంస్థ తెలిపింది.

ఇంతకుముందు తమకు రోజుకు 50 మంది నుంచి మాత్రమే విజ్ఞప్తులు వచ్చేవని, కానీ ఇప్పుడు రోజుకు 5వేల మంది టికెట్ల కోసం ఫోన్లు చేస్తున్నారని ఓ జెట్ కంపెనీ డైరెక్టర్ తెలిపాడు. తమ జెట్‌లలో అత్యంత చౌకైన టికెట్ ధర రూ.2.6లక్షలు అని చెప్పాడు. డిమాండ్ విపరీతంగా ఉందని, ప్రస్తుత పరిస్థితి క్రేజీగా అనిపిస్తోందని పేర్కొన్నాడు. ఐరోపా విమానయాన సంస్థలు ప్రస్తుతం సేవలు అందించడం లేదని, అందుకే డిమాండ్ ఇంతగా పెరిగిందని వివరించాడు.
చదవండి: 'గే' మ్యారేజెస్‌కు ఆ దేశంలో చట్టబద్దత

మరిన్ని వార్తలు