కరోనాతో కూలినట్టు నటన..రెండేళ్ల జైలు విధించిన కోర్టు

5 Aug, 2021 12:49 IST|Sakshi

మాస్కో: స్మార్ట్‌ఫోన్‌ల వినియోగం పెరగడంతో సామాజిక మాధ్యమాల వాడకం బాగా పెరిగింది. ఈ సమయంలో ఫోన్‌ వినియోగదారులకు వినోదం అందించేందుకు తమకు తోచినట్టు కొందరు ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ క్రమంలో వారికి ప్రాంక్‌ (నటన) వీడియోలు ఒక ఆదాయ పెట్టుబడిగా మారాయి. చిత్రవిచిత్ర ప్రాంక్‌ వీడియోలు తీసి నెటిజన్ల ఆదరణ పొందేందుకు ప్రయత్నిస్తున్నారు. ఈ క్రమంలోనే ఓ యువకుడు కరోనా బాధితుడి మాదిరి దగ్గుతూ.. తుమ్ముతూ ఒక్కసారిగా రైలులో కింద పడిపోయాడు. 

ఈ ఘటనతో రైలులోని ప్రయాణికులు ఒక్కసారిగా షాకయ్యారు. ముందే కరోనా భయంతో వణుకుతుంటే ఆ యువకుడు దగ్గుతూ.. తూలుతూ పడిపోవడంతో భయాందోళనకు గురయిన ప్రయాణికులు రైలును ఆపేసి పరుగులు పెట్టారు. కొద్దిసేపటికి ఆ యువకుడు లేచి ‘ఇది ప్రాంక్‌ వీడియో.. ప్రాంక్‌ వీడియో’ అనడంతో ప్రయాణికులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ వీడియో సీక్రెట్‌ కెమెరా (సీసీ)లో రికార్డవడంతో పరిశీలించిన అధికారులు అతడిపై చర్యలు తీసుకున్నారు. నిబంధనలు ఉల్లంఘించడంతో అతడికి రెండేళ్లు జైలు శిక్ష పడింది. ఈ సంఘటన రష్యాలోని మాస్కోలో జరిగింది.

మాస్కోలో మెట్రో రైలును ప్రాంక్‌స్టార్‌గా గుర్తింపు పొందిన కరమతుల్లో డిహబోరోవ్‌ ఎక్కాడు. రైలు మొదలైన కొద్దిసేపటికి ఓ బోగిలోకి వెళ్లి పై విధంగా చేశాడు. 2020 ఫిబ్రవరిలో ఈ ఘటన చేయగా జనాలను భయబ్రాంతులకు గురి చేయడంపై ఆ దేశ పోలీసులు డిహబోరోవ్‌పై కేసు నమోదు చేశారు. తాజాగా ఈ కేసుపై కోర్టు తీర్పు ఇచ్చింది. డిహబోరోవ్‌కు రెండేళ్లు జైలు శిక్ష విధిస్తూ తీర్పు వెలువరించింది. అతడితో పాటు మరో ఇద్దరు కూడా ఉన్నారు. వారిద్దరికీ న్యాయస్థానం శిక్ష విధించింది.
 

Read latest International News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు