Vladimir Sungorkin: పుతిన్‌ మిత్రుడు గుండెపోటుతో ఆకస్మిక మృతి

16 Sep, 2022 10:20 IST|Sakshi
( ఫైల్‌ ఫోటో )

రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్‌ పుతిన్‌ అత్యంత సన్నిహిత మిత్రుడు వ్లాదిమిర్‌ సుంగోర్కిన్‌ నికోలెవిచ్‌ గుండెపోటుతో ఆకస్మికంగా మృతి చెందారు. ఆయన ఖబరోవ్స్క్‌ పర్యటనలో ఉండగా ఈ ఘటన చోటు చేసుకుంది. అతను మృతి చెందే సమయంలో తన సహచరుడు లియోనిడ్‌ జఖారోవ్‌తో కలిసి ఉన్నట్లు సమాచారం.

రష్యన్‌ అన్వేషకుడు, ఫార్‌ ఈస్ట్‌ పుస్తక రచయిత అయిన వ్లాదిమిర్‌ అర్సెనీవ్‌కి సంబంధించిన ఒక పుస్తకాన్ని సేకరించడం కోసం ఖబరోవ్స్క్‌ పర్యటిస్తున్న సమయంలో ఈ విషాదకర సంఘటన చోటు చేసకుంది. సుంగోర్కిన్‌ రష్యన్‌ ప్రభుత్వ పత్రిక ప్రావ్దా ఎడిటర్‌ ఇన్‌ చీఫ్‌. ఈ మేరకు సుంగోర్కిన్‌ మిత్రుడు జఖారోవ్‌ మాట్లాడుతూ...ఆ రోజు భోజనం చేద్దాం అనుకుంటున్న సమయంలో అకస్మాత్తుగా సుంగోర్కిన్‌ అస్వస్థతకు గురయ్యాడు. ఊపిరి పీల్చుకోవడానికి ఇబ్బందిపడుతుంటే...గాలిలోకి తీసువెళ్లాం.

కానీ కొద్దిసేపటికే అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయాడు. దీంతో తాము హుటాహుటిన ఆస్పత్రికి తరలించాం. ఐతే డాక్టర్లు సుంగోర్కిన్‌ గుండెపోటుతో మరణించినట్లు తెలిపారు. ఆయన మరణం రష్యన్‌ జర్నలిజానికి తీరని లోటు అని అన్నారు. సంగోర్కిన్‌ తన వృత్తిపరమైన నీతికి, విధేయతకు కట్టుబడి ఉన్న గొప్ప వ్యక్తి అని కన్నీటి పర్యంతమయ్యారు.

సుంగోర్కిన్‌1997 నుంచి ఎడిటర్‌ ఇన్‌ చీఫ్‌ డైరెక్టర్‌ జనరల్‌గా పనిచేశారు. ఇటీవలే రష్యన్‌ వ్యాపరవేత్త, ఎనర్జీ ఎగ్జిక్యూటివ్‌ ఇవాన్‌ పెచోరిన్‌ అనుమానస్పద స్థితిలో మరణించిన  కొద్దిరోజులకే ఈ విషాద ఘటన చోటుచేసుకోవడం గమనార్హం. పుతిన్‌ పై హత్య ప్రయోగం జరిగిందంటూ వార్తలు వచ్చిన కొద్ది రోజులకే ఇలా ప్రముఖులు వరుసగా హఠాత్తుగా మృతి చెందడం బాధాకరం. 
 

మరిన్ని వార్తలు