చైనా బిగ్‌ ప్లాన్‌.. పుతిన్‌ మద్దతు

18 Oct, 2023 07:44 IST|Sakshi

తాయ్‌ పీ: రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్‌ పుతిన్‌ చైనా పర్యటనకు బయల్దేరారు. మంగళవారం చైనా రాజధాని బీజింగ్‌ చేరుకున్నారు. ఆయనకు గార్డ్‌ ఆఫ్‌ ఆనర్‌తో ఘన స్వాగతం లభించింది. ద్వైపాక్షిక విషయాలతో పాటు పలు ఇతర అంశాల్లో ఇరు దేశాల బంధం ఎంత పటిష్టంగా ఉందో చెప్పేందుకు ఈ పర్యటన తాజా నిదర్శనమని అంటున్నారు. 

అమెరికా, ఇతర పాశ్చాత్య దేశాలకు వ్యతిరేకంగా అవి ఇప్పటికే పరోక్షంగా జట్టు కట్టడం తెలిసిందే. అందులో భాగంగా ఉక్రెయిన్‌తో యుద్ధంలో రష్యాకు చైనా మద్దతు పలుకుతోంది. విదేశాల్లో ఆర్థిక, భౌగోళిక, దౌత్యపరమైన ఆధిపత్యం సాధించేందుకు చైనా ప్రదర్శిస్తున్న దూకుడుకు రష్యా దన్నుగా నిలుస్తూ వస్తోంది. ముఖ్యంగా చైనా అధ్యక్షుడు తలపెట్టిన బెల్ట్‌ అండ్‌ రోడ్‌ మౌలిక సదుపాయాల ప్రాజెక్టు (బీఆర్‌ఐ)కు కూడా రష్యా మద్దతు పలుకుతోంది. 

ఆ ప్రాజెక్టులో తనకేమీ తప్పుడు ఉద్దేశాలు కనిపించడం లేదని చైనా అధికార మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో పుతిన్‌ చెప్పారు కూడా. బీఆర్‌ఐ పదో వార్షికోత్సవానికి ఆయన హాజరవుతున్నారు. దీని ద్వారా మధ్య ఆసియాలోని మాజీ సోవియట్‌ యూనియన్‌ దేశాల మధ్య ఆర్థిక బంధం ఏర్పాటు చేయాలని ఆశాభావం వెలిబుచ్చారు. 2022 ఫిబ్రవరిలో ఉక్రెయిన్‌పై రష్యా యుద్ధానికి దిగేందుకు కొద్ది వారాల ముందు కూడా పుతిన్‌ చైనాలో పర్యటించారు. ఇక జిన్‌ పింగ్‌ కూడా మార్చిలో రష్యాలో పర్యటించారు. ఆ దేశంపై అమెరికా, పాశ్చాత్య దేశాల ఆంక్షలను దుయ్యబట్టారు.  

ఇది కూడా చదవండి: గాజా ఆస్పత్రిపై భీకర దాడి

మరిన్ని వార్తలు