ఉక్రెయిన్‌ కోర్టు తొలిసారి కీలక తీర్పు.. యుద్ధ నేరానికి పాల్పడిన రష్యా సైనికుడికి..

23 May, 2022 17:28 IST|Sakshi

ఉక్రెయిన్‌పై రష్యా దండయాత్ర ప్రారంభించి దాదాపు మూడు నెలలు కావొస్తుంది. గత 12 వారాల్లో రష్యా దళాలు ఉక్రెయిన్‌లో విధ్వంసం సృష్టించాయి. యుద్ధం ఫలితంగా భారీ స్థాయిలో ప్రాణ నష్టం, ఆస్తి నష్టం చోటుచేసుకుంటోంది. అయితే యుద్ధంలో ఇంత వరకు ఫలితం ఎటూ తేలలేదు. అయితే ఒక్క మరియూపోల్‌ నగరపై మాత్రం రష్యా ఆధిపత్యం సాధించింది. ఇక శత్రు బలగాలను ధీటుగా ఎదుర్కోవడమే కాకుండా రష్యాపై దాడులు కూడా చేస్తోంది ఉక్రెయిన్‌. కాగా తమ దేశంపై దండెత్తిన రష్యా సేనలపై ఉక్రెయిన్‌లో యుద్ధ నేరాల కింద విచారణ మొదలైన విషయం తెలిసిందే.

ఈ నేపథ్యంలో తమ దేశ పౌరుడిని కాల్చి చంపినందుకు ఉక్రెయిన్‌ కోర్టు రష్యా సైనికుడికి జీవితఖైదు విధించింది. నిరాయుధుడైన 62 ఏళ్ల ఉక్రెయిన్‌ పౌరుడిని కాల్చి చంపి యుద్ధ నేరానికి పాల్పడినందుకు  21 ఏళ్ల ట్యాంక్‌ కమాండర్‌ వాదిమ్‌ షిషిమారిన్‌కు జీవిత కారాగార శిక్ష విధించింది. రష్యా సైనికుడి యుద్ధ నేరంపై విచారణ జరిపిన కోర్టు సోమవారం ఈ మేరకు తీర్పు ఇచ్చింది. ఫిబ్రవరి 28న ఉక్రెయిన్‌లోని చుపాఖివ్కా గ్రామంలో వృద్ధుడిని రష్యా సైనిక అధికారి ఆదేశాల మేరకు కారులో నుంచి కాల్చి చంపినట్లు నేరాన్ని అంగీకరించాడు. ఇదిలా ఉండగా రష్యా యుద్ధ నేరాలకు సంబంధించి ఉక్రెయిన్‌ కోర్టు ఒక రష్యా సైనికుడికి ఇలా శిక్ష వేయడం తొలిసారి.
చదవండి: ‘బీ కేర్‌ఫుల్‌’.. చైనాకు జో బైడెన్‌ స్ట్రాంగ్‌ వార్నింగ్‌

మరిన్ని వార్తలు