Russia-Ukraine: ఉక్రెయిన్‌లోని రష్యా సైనికులపై విష ప్రయోగం.. కెమికల్‌ టెర్రరిజంపై మాస్కో ఫైర్‌!

21 Aug, 2022 18:50 IST|Sakshi

మాస్కో: గత ఏడు నెలలుగా ఉక్రెయిన్‌పై బాంబులతో విరుచుకుపడుతున్నాయి రష్యా బలగాలు. ఒక్కో నగరాన్ని చేజిక్కించుకుంటూ ముందుకు వెళ్తున్నాయి. ఈ క్రమంలో రసాయన విష ప్రయోగం జరగటం వల్ల ఉక్రెయిన్‌లోని తమ సైనికులు ఆసుపత్రుల పాలైనట్లు ఆరోపించింది రష్యా రక్షణ శాఖ. ‘బోటులినమ్‌ టాక్సిన్‌ టైప్‌ బీ’ అనే సేంద్రియ విషం నమూనాలను సైనికుల్లో గుర్తించినట్లు పేర్కొంది. కీవ్‌ కెమికల్‌ టెర్రరిజానికి పాల్పడుతోందని ఆరోపించింది. ‘జులై 31న జపోరోఝీ ప్రాంతంలోని వసిలియేవ్కా గ్రామం సమీపంలోని రష్యా సైనికులు తీవ్ర విష ప్రయోగంతో ఆసుపత్రుల పాలయ్యారు. రష్యా సైనికులు, పౌరులపై జెలెన్‌స్కీ ప్రభుత్వ ఆధ్వర్యంలోని టెర్రరిస్టులు విషంతో నిండిన వాటితో దాడులకు పాల్పడుతున్నారు.’ అని పేర్కొంది రష్యా రక్షణ శాఖ. 

సైనికులు తీవ్ర అనారోగ్యంతో ఆసుపత్రుల పాలైన క్రమంలో వారి నుంచి సేకరించిన విష నమూనాలను అంతర్జాతీయ ‘రసాయన ఆయుధాల నిషేధ సంస్థ’(ఓపీసీడబ్ల్యూ)కు పంపించేందుకు సిద్ధమవుతోంది రష్యా. బోటులినమ్‌ టాక్సిన్‌ అనేది సైన్స్‌లో అత్యంత విషపూరితమైనదిగా గుర్తింపు పొందినట్లు పేర్కొంది మాస్కో. దీనిని క్లోస్ట్రిడియమ్‌ బోటులినియమ్‌ బ్యాక్టీరియా నుంచి ఉత్పత్తి చేస్తారని, ఇది ఎసిటైల్కోలిన్‌ న్యూరోట్రాన్స‍్మిటర్‌ విడుదలను అడ్డుకుంటుందని తెలిపింది. దాని ద్వారా కండరాల పక్షవాతం వస్తుందని స్పష్టం చేసింది. 

‘బోటులినమ్‌ టాక్సిన్‌ టైప్‌ ఏ’ను కొన్నేళ్ల క్రితం కండరాల సమస్యల చికిత్స ఔషధాల్లో ఉపయోగించేవారు. దీనిని కాస్మెటోలజీలో బొటాక్స్‌గా పిలిచేవారు. అయితే, బోటులినమ్‌ టాక్సిన్‌ సులభంగా ఉత్పత్తి చేయటం, సరఫరా చేయటం వల్ల దానిని జీవ ఆయుధంగా ఉపయోగించే ప్రమాదం అధికంగా ఉంది. దీనిని ప్రయోగిస్తే మరణాల సంఖ్య అధికంగా ఉంటుంది. ఈ విష ప్రయోగం బారినపడిన వారు దీర్ఘకాలం పాటు ఐసీయూలో చికిత్స తీసుకుంటేనే ప్రాణాలతో బయటపడే అవకాశాలు ఉంటాయి.

ఇదీ చదవండి: పుతిన్‌కు షాక్‌.. బాంబు దాడిలో ఉక్రెయిన్‌ యుద్ధ వ్యూహకర్త కుమార్తె దుర్మరణం!

మరిన్ని వార్తలు