ఆ ప్రాంతాన్ని నల్లటి మంచు కమ్మేస్తోంది.. భయాందోళనలో స్థానికులు

30 Jan, 2022 19:54 IST|Sakshi

ప్రకృతికి సంబంధించిన ప్రతీది అందంగానూ, మనల్ని సంతోషపెట్టేలాగా ఉంటాయి. అయితే కొందరు స్వలాభం కోసం చేసే కొన్ని పనుల వల్ల ప్రకృతి ప్రకోపాన్ని గురికావాల్సి ఉంటుంది. ఇప్పటికే ప్రకృతి వైపరీత్యాలు పేరిట ప్రతి ఏటా మనం నష్టపోతూనే ఉన్నాం. కొందరు అంటుంటారు.. ప్రకృతితో ఆడుకుంటే అది మనతో ఆడుకుంటుందని. అలాంటి ఘటనే తాజాగా రష్యాలో వెలుగు చూసింది.

సైబీరియాలోని మగడాన్ ప్రాంతంలోని ఓంసుచన్‌లో ప్రకృతి కన్నేర్రకు నిదర్శనగా ఆ ప్రాంతమంతా నల్లటి దుప్పటి కప్పినట్లు మంచు కప్పేసింది. అదేంటి మంచు కురవడం సాధారణమే కదా అనిపిస్తుంది. కానీ అక్కడ కురిసే మంచు తెల్లగా కాకుండా నల్లగా కురుస్తూ ఆ ప్రాంత ప్రజలని భయపెడుతోంది. అయినా మంచు నల్లరంగులో కురవడం ఏంటి అనుకుంటున్నారా..?

ప్రకృతి ప్రకోపం.. నల్లటి మంచు
అసలు విషయమేంటంటే.. బొగ్గుతో పనిచేసే వేడి నీటి ప్లాంట్ ఓంసుచన్‌ ప్రాంతంలో ఉంది. ఈ ప్లాంట్ సహాయంతో ఆ ప్రాంతంలోని నాలుగు వేల మందికి అవసరమైన వేడిని అందిస్తున్నారు. బొగ్గ ఆధారిత ప్లాంట్‌ అంటే ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు.

దీని నుంచి వెలువడే దుమ్ము, మసి వాతావారణంలో కలిసి కాలుష్యంగా మారింది. దీంతో ఆకాశం నుంచి పడుతున్న మంచు భూమిపై పడకముందే నల్లగా కాలుష్యంతో నిండిపోయిన ఆ ఆవరణంలోకి రాగానే..  అది కూడా నల్లగా మారి కురుస్తుంది.  బూడిద, నల్లటి మంచుతో కప్పబడిన వీధుల్లోతమ పిల్లలు ఆటలాడుకోవల్సి వస్తుందని అక్కడి స్థానికులు వాపోతున్నారు. ప్రస్తుతం ఈ నల్లటి మంచుకు సంబంధించిన ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

>
మరిన్ని వార్తలు