మిస్‌ప్రాంక్‌.. లైవ్‌లోనే మరణించిన యువతి

9 Dec, 2020 09:38 IST|Sakshi

1300 డాలర్ల కోసం యూట్యూబర్‌ దారుణం

మాస్కో: ఇంటర్నెట్‌ వినియోగం పెరిగిన తర్వాత మనుషుల్లో అసాధరణ ధోరణులు కూడా ఎక్కువయ్యాయి. రాత్రికి రాత్రే సోషల్‌ మీడియాలో స్టార్‌ అవ్వాలని భావించి చేసే పనులు ప్రాణాల మీదకు తేస్తున్నాయి. తాజాగా ఇలాంటి సంఘటన ఒకటి రష్యాలో చోటు చేసుకుంది. య్యూట్యూబర్‌ ఒకరు 1300 డాలర్లకు ఆశపడి చేసిన బుర్రతక్కువ పని‌ వల్ల గర్భవతి అయిన అతడి గర్ల్‌ఫ్రెండ్‌ మరణించింది. వివరాలు.. ఒక యూజర్‌ ప్రాంక్‌ వీడియో చేస్తే 1300 డాలర్లు ఇస్తాననడంతో స్టాస్‌ రిఫ్లే(30) అనే యూట్యూబర్‌ లైవ్‌ స్ట్రీమ్‌లో భాగంగా తన గర్ల్‌ఫ్రెండ్‌ వాలెంటినా గ్రిగోరీవా మీద ప్రాంక్‌ వీడియో చేయాలని భావించాడు. ఇక దానిలో భాగంగా స్టాస్‌‌, గర్భవతి అయిన వాలెంటినాను బాల్కనీలో ఉంచి తాళం వేశాడు. బయట విపరీతమైన చలి... మంచు కురుస్తుంది. దారుణం ఏంటంటే ప్రాంక్‌ వీడియో కోసం వాలెంటినా బికినీ వేసుకుని బాల్కనీలో నిల్చుని ఉంది. దాదాపు 15 నిమిషాల పాటు గట్టకట్టుకుపోయే చలిలో ఉండటంతో వాలెంటినా మరణించింది. చలికి తట్టుకోలేక మధ్యలో డోర్‌ కొట్టింది కానీ స్టాస్‌ తలుపు తీయలేదు. దాంతో ఆమె రక్తం గడ్డకట్టుపోయి.. శ్వాస తీసుకోవడానికి కుదరక.. కడుపులో బిడ్డతో సహా మరణించింది. (గుడ్డు ప‌గిలింది: రివేంజ్ అదిరింది)

15 నిమిషాల తర్వాత స్టాస్‌ ఆమెని ఇంటి లోపలికి తీసుకెళ్లి బ్లాంకెట్‌ కప్పాడు. కానీ అప్పటికే ఆమె మరణించింది. వాలెంటీనాను లోపలకి తీసుకువచ్చిన స్టాస్‌ ఆ‌మెను లేపేందుకు ప్రయత్నించాడు. ‘వాల్య నీకు ఏమైంది.. ఎందుకు ఇలా చలనం లేకుండా పడి ఉన్నావ్‌.. దేవుడా నువ్వు మరణించావా ఏంటీ.. గైస్‌ ఆమె నాడి కోట్టుకోవడం లేదు.. శ్వాస తీసుకోవడం లేదు.. శరీరం పాలిపోయింది’ అంటూ అరవడం వీడియోలో వినిపించింది. స్టాస్‌ ఆమెని ఆస్పత్రికి తీసుకెళ్లాడు కానీ అప్పటికే వాలెంటినా మరణించినట్లు వైద్యులు నిర్థారించారు. ఈ మొత్తం తతంగం లైవ్‌ స్ట్రీమ్‌ కావడంతో పోలీసులు స్టాస్‌ని అదుపులోకి తీసుకున్నారు. ప్రస్తుతం ఈ వీడియోని యూట్యూబ్‌ డిలీట్‌ చేయడమే కాక ఇలాంటి దారుణాలకు పాల్పడటం నేరం అంటూ హెచ్చరించింది.

మరిన్ని వార్తలు