విరక్తిలో రష్యన్లు.. బెడిసికొట్టిన పుతిన్‌ ప్లాన్‌.. వీడియో వైరల్‌

24 May, 2022 13:39 IST|Sakshi

రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్‌ పుతిన్‌కు స్వదేశంలో చేదు అనుభవం ఎదురవుతోంది. ఉక్రెయిన్‌పై రష్యా దాడులను రష్యన్లు తీవ్రంగా వ‍్యతిరేకిస్తున్నారు. పుతిన్‌ తీరును తప్పుబడుతూ వీధులు, రోడ్ల మీదకు వచ్చి నిరసనలు వ్యక్తం చేస్తున్నారు. రష్యాకు చెందిన సెలబ్రేటీలు, మీడియా ప్రముఖులు బహిరంగంగానే పుతిన్‌ చర్యలను ఖండిస్తున్నారు. ఈ క్రమంలోనే యుద్ధానికి నిరసనగా వేల సంఖ్యలో రష్యన్లు బహిరంగ లేఖలు రాస్తున్నారు. దీంతో, అక్కడి పోలీసులు.. నిరసనకారులను అరెస్ట్‌ చేస్తున్నారు. ఈ క్రమంలో ఎంత మందిని అరెస్ట్‌ చేస్తారంటూ అసభ్యకర పదజాలంతో​ నిరసనలు తెలిపారు.

మరోవైపు.. రష్యాలోని సెయింట్‌ పీటర్స్‌బర్గ్‌ ప్రాంతంలో రష్యన్‌ భారీ సంఖ్యలో బయటకు వచ్చారు. యుద్దంపై విరక్తితో వెంటనే దాడులను నిలిపివేయాలంటూ నినాదాలు చేశారు. కాగా, ఉక్రెయిన్‌పై దాడుల నేపథ్యంలో రష్యాపై అనేక దేశాలు ఆంక్షలు విధిస్తున్నాయి. ఈ నేపథ్యంలో రష్యన్లు చాలా వరకు సేవలను కోల్పోతున్నారు. ఇక ఇటీవలే.. అమెరికా ఫాస్ట్‌ ఫుడ్‌ దిగ్గజం మెక్‌డొనాల్డ్స్‌ కీలక ప్రకటన చేసింది. రష్యా మార్కెట్‌ నుంచి పూర్తిస్థాయిలో శాశ్వతంగా నిష్క్రమిస్తున్నట్లు సోమవారం ప్రకటించేసింది. ముప్ఫై ఏళ్ల బంధానికి ముగింపు పలుకుతున్నట్లు ఓ ప్రకటనలో మెక్‌డొనాల్డ్స్‌ కార్పొరేషన్‌ వెల్లడించింది. అంతకుముందు అమెరికన్‌ పేమెంట్‌ సంస్థలైన వీసా, మాస్టర్​కార్డ్ సంస్థలు​.. రష్యాలో తమ కార్యకలాపాలను నిలిపివేస్తున్నట్లు ప్రకటించాయి. ఉక్రెయిన్‌పై రష్యా దాడిని ఖండిస్తున్నామని వీసా సీఈవో అల్‌ కెల్లీ ఓ ప్రకటనలో పేర్కొన్నారు. 

ఇదిలా ఉండగా.. ఉక్రెయిన్‌లో రష్యా బలగాల ఆక్రమణ దాడులు ఇంకా కొనసాగుతున్నాయి. ఫిబ్రవరి 24వ తేదీన ప్రారంభమైన దాడులకు ఈరోజుతో మూడు నెలలు గడిచింది. రష్యా దాడుల్లో ఉక్రెయిన్‌ భారీగా ఆస్తి నష్టం, ప్రాణ నష్టాన్ని చవిచూసింది. దాడుల్లో భాగంగా ఉక్రెయిన్‌లోని పలు నగరాలను రష్యా తమ ఆధీనంలోకి తీసుకుంది. ఇటీవల ఉక్రెయిన్‌లోనే పెద్దదైన అజోస్తోవ్‌ స్టీట్‌ ప్లాంట్‌ తమ ఆధీనంలోకి తీసుకున్నామని రష్యా ప్రకటించింది. దీంతో, అక్కడ(మరియుపోల్‌లో) యుద్ధం ముగిసిందని రష్యా సైన్యం వెల్లడించింది.

ఇది కూడా చదవండి: భారత్‌కు మాత్రమే అది సాధ్యమైంది.. వెల్‌డన్‌ మోదీ జీ
 

మరిన్ని వార్తలు