ప్రజలకు అందుబాటులోకి వచ్చిన స్పుత్నిక్‌ వీ వ్యాక్సిన్‌

24 Sep, 2020 20:44 IST|Sakshi

వ్యాక్సిన్‌ సరఫరా ప్రారంభించిన రష్యా

మాస్కో : కరోనా వైరస్‌ నియంత్రణకు అభివృద్ధి చేసిన రష్యా వ్యాక్సిన్‌ స్పుత్నిక్‌ వీ రాజధాని మాస్కోలో ప్రజలకు సరఫరా చేసేందుకు మంగళవారం అందుబాటులోకి వచ్చిందని రష్యన్‌ మీడియా వెల్లడించింది. కరోనా వ్యాక్సిన్‌ సరఫరాలను త్వరలో ప్రారంభిస్తామని గత వారం రష్యా ఆరోగ్య మంత్రత్వి శాఖ స్పష్టం చేసింది. ప్రజా సరఫరాల కోసం కోవిడ్‌-19 వ్యాక్సిన్‌ బ్యాచ్‌లు సిద్ధమయ్యాయని, పలు ప్రాంతాలకు వాటిని త్వరలో తరలిస్తామని వెల్లడించింది. వైరస్‌ ముప్పు ఉన్న గ్రూపులు, ఉపాధ్యాయులు, వైద్యులకు ముందుగా వ్యాక్సినేషన్‌ చేపడతామని రష్యా ఆరోగ్య మంత్రి మైఖేల్‌ మురష్కో ఇప్పటికే వెల్లడించారు.

వీలైనంత త్వరగా కరోనా వ్యాక్సిన్‌ను ప్రజల ముందుకు తీసుకువస్తామని రష్యా ముందునుంచి చెబుతున్న విధంగానే స్పుత్నిక్‌ వీని మార్కెట్‌లోకి తీసుకువచ్చింది. అయితే కీలకమైన మూడో దశ పరీక్షలు జరుగుతుండగానే వ్యాక్సిన్‌పై రష్యా తొందరపాటుతో వ్యవహరిస్తోందని డబ్ల్యూహెచ్‌ఓ సహా పలు దేశాలు, వైద్య నిపుణులు వ్యాక్సిన్‌ భద్రత, సామర్ధ్యంపై సందేహాలు వ్యక్తం చేస్తున్నారు. రష్యా దేశీయ నిధి ఆర్‌డీఐఎఫ్‌ సహకారంతో గమలేయా ఇనిస్టిట్యూట్‌ అభివృద్ధి చేసిన స్పుత్నిక్‌ వీ కోవిడ్‌-19 నియంత్రణకు ప్రపంచంలోనే తొలి వ్యాక్సిన్‌గా ముందుకొచ్చింది. భారీ స్ధాయిలో మానవులపై పరీక్షలు చేపట్టకుండానే ప్రభుత్వ ఆమోదం​ పొందిన తొలి కోవిడ్‌-19 వ్యాక్సిన్‌ కూడా ఇదే కావడం గమనార్హం.

ఇక స్పుత్నిక్‌ వీ వ్యాక్సిన్‌పై రష్యాలో 40,000 మందిపై ప్రస్తుతం మూడో దశ పరీక్షలు కొనసాగుతున్నాయి. ఈ పరీక్షలకు సంబంధించి ప్రాథమిక ఫలితాలు అక్టోబర్‌ లేదా నవంబర్‌లో వెల్లడవుతాయని భావిస్తున్నామని వ్యాక్సిన్‌ అభివృద్ధికి నిధులు సమకూర్చిన రష్యన్‌ డైరెక్ట్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ ఫండ్‌ (ఆర్‌డీఐఎఫ్‌) చీఫ్‌ కిరిల్‌ దిమిత్రివ్‌ పేర్కొన్నారు.ఆర్‌డీఐఎఫ్‌ భారత్‌లోని డాక్టర్‌ రెడ్డీస్‌ లేబొరేటరీస్‌తో ఒప్పందం కుదుర్చుకున్న క్రమంలో రాబోయే వారాల్లో స్పుత్నిక్‌-వీ వ్యాక్సిన్‌ పరీక్షలు భారత్‌లో చేపట్టనున్నారు. ప్రపంచవ్యాప్తంగా కోవిడ్‌-19 కేసులు పెరుగుతున్న క్రమంలో రష్యన్‌ వ్యాక్సిన్‌ ప్రజల ముందుకు రావడం ఆశాకిరణంలా కనిపిస్తోంది. చదవండి : 60వేల మందిపై కరోనా వ్యాక్సిన్‌ ప్రయోగాలు

మరిన్ని వార్తలు