Saad Aljabri-Mohammed Bin Salman: సౌదీ యువరాజు మాములోడు కాదు.. వెలుగులోకి షాకింగ్‌ నిజాలు!

12 Jul, 2022 20:58 IST|Sakshi

అగ్ర రాజ్యం అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌.. మరికొద్ది రోజుల్లో సౌదీ అరేబియాకు వెళ్లనున్న నేపథ్యంలో సంచలన ఘటన చోటుచేసుకుంది. సౌదీ యువరాజు మహ్మద్ బిన్ సల్మాన్‌పై ఆ దేశ మాజీ ఇంటెలిజెన్స్‌ అధికారి షాకింగ్‌ ఆరోపణలు గుప్పించారు. సౌదీ యువరాజు ఓ సైకో అని వివాదాస్పద ‍వ్యాఖ్యలు చేశారు. ఆయన వ్యాఖ్యలు ప్రపంచవ్యాప్తంగా పెను దుమారానికి దారి తీశాయి. 

వివరాల ప్రకారం.. సౌదీ ఇంటెలిజెన్స్‌ మాజీ అధికారి సాద్ అల్ జాబ్రి తాజాగా ఓ చానల్‌ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. కిరాయి సైనికులతో 'టైగర్ స్క్వాడ్' అనే దళాన్ని కూడా నడుపుతున్నాడని తెలిపాడు. ఈ దళం ప్రత్యేకంగా కిడ్నాపులు, హత్యలు చేస్తుందని ఆరోపించాడు. ఏమాత్రం దయాదాక్షిణ్యాలు లేని ఓ ఉన్మాది అని మహ్మద్ బిన్ సల్మాన్ ను అభివర్ణించారు. భావోద్వేగాలు లేని కఠినాత్ముడు అని ఘాటు వ్యాఖ్యలు చేశాడు. యువరాజు మహ్మద్‌ బిన్‌ సల్మాన్‌ చేసిన హత్యలకు, నేరాలకు తామే సాక్షులమని అల్‌ జాబ్రి కుండబద్దలు కొట్టారు. ఇక యువరాజు బాగా ధనవంతుడు కావడంతో అమెరికాతో పాటు ఇతర దేశాలకు ఓ ముప్పులా పరిణమించాడని సంచలన ఆరోపణలు గుప్పించాడు.

అయితే, ఆ మాజీ అధికారి పేరు సాద్ అల్ జాబ్రి.. ఒకప్పుడు సౌదీ ఇంటెలిజెన్స్ విభాగంలో నంబర్ 2 స్ధానంలో విధులు నిర్వర్తించాడు.
అల్ జాబ్రి అప్పట్లో మహ్మద్ బిన్ నయేఫ్‌కు సలహాదారుడిగా కూడా ఉన్నాడు. కాగా, మహ్మద్ బిన్ నయేఫ్‌ను 2017లో సౌదీ యువరాజు పీఠం నుంచి దించివేశారు. ఇదిలా ఉండగా.. అల్ జాబ్రి వ్యాఖ్యలను అమెరికాలోని సౌదీ అరేబియా రాయబార కార్యాలయం కొట్టిపడేసింది. తన ఆర్థిక నేరాలను కప్పిపుచ్చుకోవడానికే ఇలాంటి కామెంట్స్‌ చేశాడని స్పష్టం చేసింది. 

మరిన్ని వార్తలు