అమ్మకానికి సద్దాం హుస్సేన్‌ ఫోటో

28 Aug, 2020 13:36 IST|Sakshi

కేవలం 20 డాలర్లే అంటూ ప్రకటన.. వైరలవుతోన్న యాడ్‌

వాషింగ్టన్‌: ఇరాక్‌ మాజీ అధ్యక్షుడు, నియంత సద్దాం హుస్సేన్‌ గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. ప్రపంచాన్ని గడగడలాడించిన ఈ ఇరాకీ నేత ఫోటోను ఓ అమెరికన్‌ ఈ కామర్స్‌ సైట్‌ అమ్మకానికి పెట్టింది. పైగా డిస్కౌంట్‌ కూడా ఆఫర్‌ చేస్తోంది. వివరాలు.. అమెరికాకు చెందిన ఈ కామర్స్‌ సైట్‌ ‘విష్’‌లో  సద్దాం ఫోటోను అమ్మకానికి ఉంచింది. ధరను 20 డాలర్లుగా నిర్ణయించింది. పైగా డిస్కౌంట్‌ను కూడా ప్రకటించింది. ‘అన్ని ప్రొడక్ట్స్‌పై 60-80శాతం డిస్కౌంట్‌ లభించనుంది’ అంటూ విష్‌ ప్రమోట్‌ చేసిన యాడ్‌లో సద్దాం హుస్సేన్‌ ఫోటో కూడా ఉంది. దానిపై రేటు 20 డాలర్లుగా నిర్ణయించబడింది. ఇది చూసిన నెటిజనులు ఆశ్చర్యానికి గురవుతున్నారు. ‘సద్దాం హుస్సేన్‌ను ఎవరు కొనాలనుకుంటున్నారు.. అది కూడా కేవలం 20 డాలర్లకే’ అంటూ కామెంట్‌ చేస్తున్నారు. వాస్తవానికి ఇది సద్దాం ఫోటో కాపీ. అమెరికా సేనలకు పట్టుబడిన తర్వాత తీసిన సద్దాం ఫోటోను ప్రీమియం హెవీ స్టాక్ పేపర్‌లో రీప్రింట్‌ చేశారు. పైగా ‘దీన్ని ఉరి తీయవచ్చు లేదా ప్రేమ్‌ కట్టించుకోవచ్చు’ అంటూ ప్రకటన ఇచ్చారు. ప్రస్తుతం ఇది తెగ ట్రెండ్ అ‌వుతోది. 

1979 జూలై 16 నుంచి 2003 ఏప్రిల్ 9 వరకు ఇరాక్‌ను అప్రతిహతంగా పాలించిన సద్దామ్, 2003 లో అమెరికా ఆధ్వర్యంలో జరిగిన ఇరాక్ ఆక్రమణలో పదవి కోల్పోయాడు. యుద్ధానంతరం అమెరికా సేనలకు బందీగా పట్టుబడి, ఇరాక్ న్యాయస్థానంలో విచారణ తరువాత 2006 డిసెంబర్ 30 న ఉరితీయబడిన సంగతి తెలిసిందే.

మరిన్ని వార్తలు