రష్దీ జీవించి ఉండడం ఆశ్చర్యమే

19 Aug, 2022 05:28 IST|Sakshi

నిందితుడు హదీ మతార్‌

తనంతట తానుగా పొడిచానని వెల్లడి

న్యూయార్క్‌: అమెరికాలోని న్యూయార్క్‌లో భారత రచయిత సల్మాన్‌ రష్దీని కత్తితో పొడిచాడని ఆరోపణలు ఎదుర్కొంటున్న నిందితుడు హదీ మతార్‌ తన దాడి వెనుక ఎవరి ప్రమేయం లేదని చెప్పాడు. ఇరాన్‌ రివల్యూషనరీ గార్డ్‌ కార్ప్స్‌తో తనకు ఎలాంటి సంబంధాలు లేవని తెలిపాడు. రష్దీ చిత్తశుద్ధి లేని వ్యక్తి  అని అందుకే అతనంటే తనకి నచ్చడని చెప్పాడు. తనంతట తానుగానే రష్దీని పొడిచానని వెల్లడించాడు. జైలు నుంచే న్యూయార్క్‌ పోస్ట్‌ వార్తాసంస్థకు వీడియో ద్వారా ఇంటర్వ్యూ ఇచ్చాడు.

రష్దీ ఇంకా ప్రాణాలతో ఉన్నారన్న విషయం తెలియగానే తాను చాలా ఆశ్చర్యపోయానని చెప్పాడు.  రష్డీకి మెడపై 3 కత్తి పోట్లు, కడుపులో నాలుగుసార్లు, కుడి కన్ను, ఛాతీ, కుడి తొడపై కత్తి పోట్లు ఉన్నాయని ఆయనకి చికిత్స చేస్తున్న వైద్యులు వెల్లడించారు. రష్దీ రాసిన నవల ‘ది సటానిక్‌ వెర్సస్‌’లో తాను కొన్ని పేజీలే చదివానని, అంతా చదవలేదన్నారు. రష్దీపై ఫత్వా జారీ చేసిన ఇరాన్‌ సుప్రీం లీడర్‌ అయతొల్లా ఖొమైనీ ఆదేశంతో ఈ దారుణానికి పాల్పడ్డావా? అన్న ప్రశ్నకు మతార్‌ సమాధానం ఇవ్వలేదు. అయతొల్లా అంటే తనకు గౌరవం ఉందని చెప్పాడు.

మరిన్ని వార్తలు