వెంటిలేటర్‌పై రష్దీ.. తెగిపోయిన చేతుల్లోని నరాలు, దెబ్బతిన్న కాలేయం

14 Aug, 2022 04:31 IST|Sakshi
నిందితుడు హదీని పోలీసులు అదుపులోకి తీసుకుంటున్న దృశ్యం

20 సెకన్లలో 15 కత్తి పోట్లే కారణం

పోలీసుల అదుపులో నిందితుడు హదీ మతార్‌

న్యూయార్క్‌: భారత మూలాలున్న ప్రముఖ రచయిత, బుకర్‌ బహుమతి విజేత సల్మాన్‌ రష్దీ ఆరోగ్య పరిస్థితి ఇంకా విషమంగానే ఉంది. ది సతానిక్‌ వర్సెస్‌ రచన తర్వాత దశాబ్దాలుగా ఇస్లామిక్‌ బెదిరింపులను ఎదుర్కొంటున్న రష్దీపై ఓ ఆగంతకుడు అమెరికాలో చర్చావేదికపైనే కత్తితో విచక్షణారహితంగా దాడిచేసిన విషయం విదితమే.

రక్తసిక్తమైన రష్దీకి వాయవ్య పెన్సిల్వేనియాలోని యూపీఎంసీ హ్యమాట్‌ సర్జరీ సెంటర్‌ ఆస్పత్రి వెంటిలేటర్‌పై అత్యవసర చికిత్స అందిస్తున్నారు. 20 సెకన్ల వ్యవధిలో ఆగంతకుడు వెనుక 15 సార్లు కత్తితో పొడిచినట్లు తెలుస్తోంది. ‘గంటలపాటు ఆయనకు శస్త్రచికిత్స కొనసాగింది. మెడ భాగంలో కత్తిపోట్ల కారణంగా మెడ నుంచి చేతిలోకి వచ్చే నరాలు తెగిపోయాయి.

ఒక కన్ను కోల్పోయే ప్రమాదం ఉంది. పొత్తికడుపుపై కత్తిగాటుతో కాలేయం దెబ్బతింది’ అని సల్మాన్‌ రష్దీ ప్రతినిధి ఆండ్రూ విలే న్యూయార్క్‌ టైమ్స్‌ వార్తాసంస్థతో చెప్పారు. పశ్చిమ న్యూయార్క్‌లోని చౌటాకా ఇన్‌స్టిట్యూట్‌లో రష్దీపై దాడి చేసిన వ్యక్తిని 24 ఏళ్ల హదీ మతార్‌గా గుర్తించారు. అతడిపై హత్యాయత్నం, దాడి సెక్షన్ల కింద కేసు నమోదుచేశారు.

150 ఏళ్ల చరిత్రలో తొలి దారుణం
‘150 ఏళ్ల లాభాపేక్షలేని విద్యా సంస్థ చరిత్రలో ఇలా దాడి జరగడం ఇదే తొలిసారి’ అని చౌటౌకా ఇన్‌స్టిట్యూట్‌ అధ్యక్షుడు మైఖేల్‌ హిల్‌ తీవ్ర విచారం వ్యక్తంచేశారు. సంస్థలో జరిగే కార్యక్రమాలకు భద్రత పెంచాలంటూ గతంలోనే విజ్ఞప్తులు వచ్చాయన్న వార్తలను ఆయన కొట్టేపారేశారు. అయితే, కార్యక్రమ నిర్వాహకులు అక్కడ ఎలాంటి సెక్యూరిటీ సెర్చ్‌ చేయలేదని, మెటల్‌ డిటెక్టర్‌లు లేవని, బ్యాగుల తనిఖీ విధానం లేదని ఒక ప్రత్యక్ష సాక్షి చెప్పడం గమనార్హం.

‘ఇరాన్‌ నేత అయోతొల్లా హత్య ఆదేశాలిచ్చినా రష్దీ తన స్వేచ్ఛా గళాన్ని వినిపించారు. ఈ కష్టకాలంలో రష్దీ ధైర్యాన్ని, అంకిత భావాన్ని వేనోళ్లా పొగడాల్సిన సమయమిది’ అని కౌంటర్‌ ఎక్స్‌ట్రీమిజమ్‌ ప్రాజెక్ట్‌ సీఈవో మార్క్‌ వ్యాఖ్యానించారు. ఉగ్రసంస్థల ఆర్థికమూలాలను దెబ్బతీయాలంటూ కౌంటర్‌ ఎక్స్‌ట్రీమిజమ్‌ ప్రాజెక్ట్‌ అనే లాభాపేక్షలేని ప్రభుత్వేతర సంస్థ పనిచేస్తోంది.

దాడిపై ఇరాన్‌ మౌనం
రష్దీని చంపాలంటూ దాదాపు దశాబ్దం క్రితం దేశ సుప్రీం లీడర్‌ అయోతొల్లా ఇచ్చిన ఫత్వాను ఇన్నాళ్లకు ఓ ఆగంతకుడు అమలుకు యత్నించాడన్న వార్తలపై ఇరాన్‌ పెదవి విప్పలేదు. ‘ఫత్వాను అమలుచేసే ప్రయత్నం జరిగింది’ అంటూ పొడిపొడిగా ఒక ప్రకటనను మాత్రం శనివారం ఇరాన్‌ అధికారిక మీడియా వెలువరించింది. ‘ ఇలాంటి ఘటనలు ఇరాన్‌ను అంతర్జాతీయ సమాజం నుంచి దూరం చేస్తాయి’ అని ఇరాన్‌ మాజీ దౌత్యవేత్త మాషల్లా సెఫాజదీ అన్నారు.

దాడిపై వెల్లువెత్తిన నిరసనలు
ఘటనను భావ ప్రకటనా స్వేచ్ఛపై దాడిగా సాహిత్యలోకం అభివర్ణించింది. రచయితల గొంతు నొక్కే, హింసాత్మక, అణచివేత ధోరణులపై ముక్తకంఠంతో తమ తీవ్ర నిరసనను వ్యక్తంచేశారు. అత్యంత హేయమైన చర్యగా బుకర్‌ ప్రైజ్‌ విజేత, రచయిత్రి గీతాంజలి శ్రీ వ్యాఖ్యానించారు. నీల్‌ గైమన్, అమితవ్‌ ఘోష్, స్టీఫెన్‌ కింగ్, జీన్‌ గెరీరో తదితరులు దాడి ఘటనను తీవ్రంగా ఖండించారు. రష్దీ త్వగా కోలుకోవాలని కోరుకున్నారు. జాగర్‌నాట్‌ బుక్స్, పెంగ్విన్‌ రాండమ్‌ హౌస్‌ ఆఫ్‌ ఇండియా వంటి పలు పబ్లిషింగ్‌ సంస్థలూ ఘాటుగా స్పందించాయి.  

ఎవరీ హదీ మతార్‌?
న్యూజెర్సీలోని ఫెయిర్‌వ్యూ ప్రాంతంలో మతార్‌ నివసిస్తున్నాడు. మతార్‌ ఎందుకు దాడి చేశాడనే కారణాలను వెతికే పనిలో అమెరికా ఎఫ్‌బీఐ, స్థానిక దర్యాప్తు సంస్థలు నిమగ్నమయ్యాయి. ‘ఘటనాస్థలిలోని బ్యాక్‌ ప్యాక్, ఎలక్ట్రానిక్‌ వస్తువులు తదితరాలను క్షుణ్ణంగా పరిశీలించేందుకు సెర్చ్‌ వారెంట్‌ తీసుకునే పనిలో అధికారులు ఉన్నారు. దాడి ఘటన వెనుక ఎవరూ ఉండకపోవచ్చని, మతార్‌ ఒక్కడికే ఇందులో ప్రమేయముందని అధికారులు ప్రాథమికంగా విశ్వసిస్తున్నారు.

లెబనాన్‌ మూలాలున్న మతార్‌ నేర చరిత్రపై వివరాలు సేకరిస్తున్నాం’ అని పోలీస్‌ ట్రూప్‌ కమాండర్‌ మేజర్‌ ఎజీన్‌ జె. స్టాన్‌జ్యూస్కీ చెప్పారు. అయితే, అతని సామాజిక మాధ్యమాల ఖాతాలను పరిశీలించగా కొన్ని విషయాలపై స్పష్టత వచ్చింది.

షియా ఉగ్రవాదులకు ముఖ్యంగా ఇస్లామిక్‌ రెవల్యూషనరీ గార్డ్‌ కోర్‌కు మతార్‌ సానుభూతిపరుడని తెలుస్తోందని దర్యాప్తులో భాగంగా ఉన్న ఒక ఉన్నతాధికారి ఎన్‌బీసీ న్యూస్‌తో చెప్పారు. మతార్‌ వాడుతున్న సెల్‌ఫోన్‌ మెసేజింగ్‌ యాప్‌లో ఇరాన్‌ కమాండర్‌ ఖాసిమ్‌ సులేమానీ ఫొటోను దర్యాప్తు అధికారులు కనుగొన్నారు. సులేమానీ ఇరాన్‌లో ఇస్లామిక్‌ రెవల్యూషనరీ గార్డ్స్‌ కోర్‌కు సైన్యాధికారిగా ఉన్నాడు. రష్దీ రాసిన రచనను ఇరాన్‌ 1988లో నిషేధించిన విషయం తెల్సిందే.

ఇంత భద్రత అవసరమా? గతంలో రష్దీ వ్యాఖ్య
హత్యా బెదిరింపుల నేపథ్యంలో ఆయనకు కల్పించిన అత్యంత కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లపై ఒకానొక దశలో అసహనం వ్యక్తంచేశారని న్యూయార్క్‌ పోస్ట్‌ ఒక కథనం ప్రచురించింది. చెక్‌ రిపబ్లిక్‌లోని ప్రేగ్‌లో ఒక సారి రచయితల సదస్సు జరిగింది. ఆ కార్యక్రమానికి వచ్చిన రష్దీ మాట్లాడారు. ‘ఇంత మందితో నాకు భద్రత కల్పించడం నిజంగా అవసరమా? నాకైతే చాలా ఇబ్బందికరంగా అనిపిస్తోంది. నాకు ఇంతగా అదనపు భద్రత అవసరమని నేనెప్పుడూ అడగలేదు. గతంలో ఎలాంటి భద్రతా లేకుండానే ఇక్కడొకొచ్చాను. ఇప్పుడు ఇదంతా వృథా ప్రయాస. అయినా, భద్రత అవసరమైన రోజులను నేనెప్పుడో దాటేశాను’ అని ఆనాటి సభలో అన్నారు.

మరిన్ని వార్తలు