ప్రవక్త వివాదం: పాక్‌కు శాంసంగ్‌ కంపెనీ క్షమాపణలు

2 Jul, 2022 09:39 IST|Sakshi

ఇస్లామాబాద్‌: దక్షిణ కొరియా టెక్‌ దిగ్గజం శాంసంగ్‌ చేష్టలతో పాకిస్థాన్‌పై అట్టుడికి పోయింది. నిరసలు హింసాత్మకంగా మారడంతో దెబ్బకు శాంసంగ్‌ కంపెనీ దిగొచ్చింది. ఇస్లాంను, మొహమ్మద్‌ ప్రవక్తను కించపరిచిందన్న ఆరోపణలపై ఎట్టకేలకు పాకిస్థాన్‌కు క్షమాపణలు తెలియజేసింది శాంసంగ్‌. 

బ్లాస్‌ఫెమీ(దైవదూషణ)కి పాల్పడడంతో శాంసంగ్‌ కంపెనీపై పాక్‌ ప్రజలు మండిపడుతున్నారు. పైగా హింసాత్మక ఘటనలు చోటు చేసుకోవడంతో.. అంతర్గత దర్యాప్తునకు ఆదేశిస్తున్నట్లు కొరియన్‌ కంపెనీ ఒక ప్రకటనలో పేర్కొంది. అంతేకాదు మతపరమైన భావాలపై తటస్థతను కొనసాగిస్తుందని ట్విటర్‌లో ఒక ప్రకటన ద్వారా పేర్కొంది. 

శుక్రవారం కరాచీలోని స్టార్‌ సిటీ మాల్‌లో ఇన్‌స్టాల్‌ చేసిన ఓ వైఫై డివైజ్‌ మూలంగా ఈ రచ్చ షురూ అయ్యింది. ఈ వార్త దావానంలా వ్యాపించడంతో.. మాల్‌ దగ్గరికి చేరుకుని కొందరు నిరసనలకు దిగారు. అదే సమయంలో శాంసంగ్‌ తీసుకొచ్చిన ఓ క్యూఆర్‌ కోడ్‌ ప్రవక్తను కించపరిచేదిగా ఉందంటూ గొడవ మరింత ముదిరింది. శాంసంగ్‌ వ్యతిరేక నినాదాలు చేస్తూ.. రెచ్చిపోయి మాల్‌ బయట విధ్వంసం సృష్టించారు. ఈ ఘటనలో కొందరికి గాయాలైనట్లు తెలుస్తోంది. 

విషయం తెలిసి మాల్‌కు చేరుకున్న పోలీసులు.. 27 మంది శాంసంగ్‌ ఉద్యోగులను అదుపులోకి తీసుకున్నారు. దాడికి పాల్పడింది తెహ్రీక్‌-ఈ-లబ్బాయిక్‌ పాకిస్థాన్‌ గ్రూప్‌ సభ్యులని నిర్ధారించిన పోలీసులు.. వాళ్లను అరెస్ట్‌ మాత్రం చేయలేదు. పాక్‌లో దైవదూషణను అక్కడి చట్టం తీవ్ర నేరంగా భావిస్తుంది. కఠిన శిక్షలతో పాటు భారీ జరిమానా.. ఒక్కోసారి మరణ శిక్ష కూడా అమలు చేస్తారు. కిందటి ఏడాది డిసెంబర్‌లో ఇస్లాంను కించపరిచిన నేరానికి.. శ్రీలంకకు చెందిన ఓ వ్యక్తి సియాల్‌కోట్‌లో మూక హత్యకు గురయ్యాడు.

చదవండి: నూపుర్‌శర్మ దేశానికి క్షమాపణ చెప్పాల్సిందే!

మరిన్ని వార్తలు