కరోనా టీకా కోసం రూ.15,725 కోట్లు

1 Aug, 2020 06:46 IST|Sakshi

జీఎస్‌కే, సనోఫీ సంస్థలతో అమెరికా సర్కారు ఒప్పందం  

లండన్‌: కరోనా వైరస్‌ను అంతం చేసే వ్యాక్సిన్‌ కోసం ఎంతైనా ఖర్చు చేయడానికి అమెరికా ప్రభుత్వం సిద్ధపడుతోంది. సాధ్యమైనంత త్వరగా ప్రజలకు వ్యాక్సిన్‌ను అందుబాటులోకి తీసుకురావాలని సంకల్పించింది. ఇందులో భాగంగా వ్యాక్సిన్‌ అభివృద్ధి, క్లినికల్‌ ట్రయల్స్, ఉత్పత్తి, సరఫరా కోసం 2.1 బిలియన్‌ డాలర్లు(రూ.15,725 కోట్లు) వెచ్చించాలని నిర్ణయించింది.

ఈ మేరకు ప్రముఖ ఫార్మా సంస్థలు గ్లాక్సోస్మిత్‌క్లైన్‌(జీఎస్‌కే), సనోఫీ పేశ్చర్‌లతో ఒప్పందం చేసుకుంది. ఆయా సంస్థలు అభివృద్ధి చేస్తున్న వ్యాక్సిన్‌ ఈ ఏడాది చివరలో అందుబాటులోకి వచ్చే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. అమెరికాకు 10 కోట్ల వ్యాక్సిన్‌ డోసులు సరఫరా చేస్తామని జీఎస్‌కే, సనోఫీ ప్రకటించాయి. దీర్ఘకాలంలో మరో 50 కోట్ల డోసులు సిద్ధంగా ఉంచుకోవాలని అమెరికా సర్కారు యోచిస్తోంది.

బ్రిటన్‌కు చెందిన జీఎస్‌కే, ఫ్రాన్స్‌కు చెందిన సనోఫీ సంస్థలు కరోనా వ్యాక్సిన్‌ అభివృద్ధి విషయంలో తీవ్రంగా కృషి చేస్తున్నాయి. 6 కోట్ల కరోనా డోసుల కోసం బ్రిటిష్‌ ప్రభుత్వం గత వారం ఫార్మా కంపెనీలతో ఒప్పందం కుదుర్చుకున్న విషయం తెలిసిందే. కరోనా వ్యాక్సిన్‌కు ప్రపంచవ్యాప్తంగా డిమాండ్‌ అధికంగా ఉందని, ఒక్క సంస్థ మాత్రమే ఈ డిమాండ్‌ను తీర్చలేదని సనోఫీ కంపెనీ ప్రతినిధి థామస్‌ ట్రియోంఫ్‌ చెప్పారు. చాలా కంపెనీలు వ్యాక్సిన్‌ ఉత్పత్తిలోకి అడుగుపెట్టాల్సిన అవసరం ఎంతైనా ఉందని ఆయన తెలిపారు.

కరోనా సోకిన తొలి శునకం మృతి
అగ్రరాజ్యం అమెరికాలో కరోనా వైరస్‌ బారినపడ్డ మొదటి శునకం ‘బడ్డీ’ శుక్రవారం చనిపోయింది. జర్మన్‌ షెఫర్డ్‌ డాగ్‌ అయిన బడ్డీకి కరోనా సోకినట్లు జూన్‌లో ప్రభుత్వ అధికారులు నిర్ధారించారు. దేశంలో కరోనా బాధిత తొలి శునకం ఇదేనని ప్రకటించారు. అంతకంటే ముందు దాని యజమాని రాబర్ట్‌ మహనీకి కరోనా సోకింది. ఈ వైరస్‌ వ్యాప్తికి జంతువులు వాహకాలుగా మారుతాయనడానికి ప్రస్తుతం ఎలాంటి ఆధారాలు లేవని అధికారులు చెప్పారు. అయితే, మనుషుల నుంచి జంతువులకు కరోనా సోకే అవకాశాలు అధికంగా ఉన్నాయని తెలిపారు.

వియత్నాంలో ‘తొలి’ కరోనా మరణం
హనోయ్‌: వియత్నాంలో తొలిసారిగా ఓ వృద్ధుడు(70) కరోనాతో మరణించాడు. అతడికి కరోనా సోకడంతోపాటు కిడ్నీవ్యాధితో కూడా బాధపడుతున్నట్లు వైద్యులు తెలిపారు. డా నాంగ్‌ ఆసుపత్రిలో  శుక్రవారం కన్నుమూశాడని మీడియా ప్రకటించింది. అయితే, ఈ మరణాన్ని వియత్నాం అధికారికంగా గుర్తించలేదు. వరుసగా 99 రోజులుపాటు కొత్తగా ఒక్క పాజిటివ్‌ కేసు కూడా నమోదు కాని దేశంగా వియత్నాం రికార్డ్‌ సృష్టించింది. కరోనాపై పోరాటంలో ఈ దేశం ప్రపంచవ్యాప్తంగా ప్రశంసలు అందుకుంది. వియత్నాంలో గత వారం రోజుల్లో 90కిపైగా పాజిటివ్‌ కేసులు బయటపడినట్లు సమాచారం. ప్రస్తుతం ఆరుగురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్య శాఖ అధికారి  తెలిపారు.  
 

మరిన్ని వార్తలు