సౌదీలో ప్రపంచ ఎనిమిదో వింత!

26 Jul, 2022 03:03 IST|Sakshi

మీకు స్కై స్క్రాపర్‌ అంటే తెలుసుగా.. అదేనండీ ఆకాశహర్మ్యం.. వందలాది అడుగుల ఎత్తైన భారీ భవనం. మరి సైడ్‌వే స్కైస్క్రాపర్‌ గురించి ఎప్పుడైనా విన్నారా? సౌదీ అరేబియాలో త్వరలో అత్యంత భారీ స్థాయిలో నిర్మాణం కానుంది. పేరుకు తగ్గట్లే ఇది ఎత్తుకన్నా పక్కలకు ఎక్కువగా విస్తరించి ఉంటుందన్నమాట.

ఆ ఇందులో పెద్ద విశేషం ఏముందిలే అనుకోకండి.. ఎందుకంటే ఈ నిర్మాణం ఏకంగా 120 కిలోమీటర్ల పొడవు ఉండనుంది మరి!! మరోలా చెప్పాలంటే దీని పొడవు దాదాపుగా అమెరికాలోని మసాచుసెట్స్‌ రాష్ట్రం అంత ఉండనుంది!! ప్రపంచంలోని ఎనిమిదో వింతగా అందరినీ అబ్బురపరచనుంది. ఈ భారీ ప్రాజెక్టులో మరిన్ని విశేషాలు కూడా ఉన్నాయి. అవి ఏమిటంటే.. 

ఎన్నెన్నో ప్రత్యేకతలు... 
సౌదీ యువరాజు, ఉప ప్రధాని మొహమ్మద్‌ బిన్‌ సల్మాన్‌ ఏకంగా 26,500 చదరపు కిలోమీటర్ల మేర నిర్మించేందుకు ప్రణాళికలు సిద్ధం చేసిన భవిష్యత్‌ నగరం ‘నియోమ్‌ సిటీ’లో భాగంగా 120 కి.మీ. పొడవైన రెండు సైడ్‌వే స్కైస్క్రాపర్లను నిర్మించనున్నారు. వాయవ్య సౌదీ అరేబియాలోని ఎర్ర సముద్రానికి చెందిన గల్ఫ్‌ ఆఫ్‌ అకాబా తీరం నుంచి ఎడారిలో ఉన్న కొండల మధ్య దాకా ఈ ప్రాజెక్టు విస్తరించనుంది.

ఈ రెండు భవనాలను అద్దాలతో అలంకరించనున్నందున దీనికి ‘మిర్రర్‌ లైన్‌’ అని పేరు పెట్టారు. ఎత్తులోనూ ఇవి ప్రపంచంలోని ఇతర ఆకాశహర్మ్యాల స్థాయిలో రూపుదిద్దుకోనున్నాయి. 490 మీటర్ల వరకు అంటే దాదాపుగా అర కిలోమీటర్‌ ఎత్తు వరకు ఈ భవనాలను కట్టనున్నారు. న్యూయార్క్‌లో ఉన్న 102 అంతస్తుల ప్రఖ్యాత ఎంపైర్‌ స్టేట్‌ బిల్డింగ్‌ చిట్టచివరి కొన వరకు ఉన్న ఎత్తు 443 మీటర్లకన్నా ఈ జంట భవనాలు మరెంతో ఎత్తు వరకు కనిపించనున్నాయన్నమాట.

ఇంత పొడవైన జంట భవనాల్లో కిలోమీటర్లకొద్దీ కట్టబోయే ఇళ్లలో ఏకంగా 50 లక్షల మంది నివసించవచ్చట! రోజుకు మూడపూటలా భోజనానికి ‘సబ్‌స్క్రైబ్‌’ చేసుకున్న వారికి అవసరమైన పంటలను సైతం ఈ విస్తీర్ణంలోనే పండిస్తారట. భవనాల ఒక చివరి నుంచి మరో చివరి వరకు 20 నిమిషాల్లో ప్రయాణించేందుకు ప్రత్యేకంగా భూగర్భంలో హైస్పీడ్‌ రైల్వే లైన్, పాదచారుల కోసం వాక్‌ వేస్, నేల నుంచి వెయ్యి అడుగుల ఎత్తులో భారీ స్టేడి­యం వంటి ఎన్నో హంగులు ఇందులో ఉండనున్నాయి. ఈ పే...ద్ద ప్రాజెక్టు నిర్మాణానికి ఖర్చు కూడా అత్యంత భారీగానే ఉండనుంది. సుమారు 50 ఏళ్లు పట్టే ఈ ప్రాజెక్టు పూర్తికి ఏకంగా రూ. 80 లక్షల కోట్లు ఖర్చవుతుందని అంచనా!  
సాక్షి సెంట్రల్‌ డెస్క్‌ 

మరిన్ని వార్తలు