మతిమరుపు బైడెన్‌పై స్పూఫ్‌ వీడియో.. నెట్టింట వైరల్‌

14 Apr, 2022 18:37 IST|Sakshi
(ఫైల్‌ ఫొటో)

ఉక్రెయిన్‌-రష్యా మధ్య యుద్ధం కొనసాగుతున్న తరుణంలో దీనిపై స్పందిస్తున్న అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌ ప్రవర్తన వింతగా ఉంటోంది. వయస్సులో పెద్దవాడు కావడం వల్ల జరుగుతోందో.. ఏమో కానీ ఆయన తీరుపై సోషల్‌ మీడియాలో నెటిజన్లు సెటైర్లు పేల్చుతున్నారు. మీడియాతో మాట్లాడే క్రమంలో రష్యా దేశం, ఆ దేశ అధ్యక్షుడు పుతిన్‌ పేరు సైతం మర్చిపోవడం, తనతోపాటు పక్కనే ఉన్న ఆమెరికా ఉపాధ్యక్షురాలను ప్రథమ మహిళ అని సంబోధించి చాలా గందరగోళానికి గురయ్యారు. అప్పుడే నిద్ర నుంచి లేచి మీడియా ముందుకు వచ్చినట్లు కనిపించడం పట్ల పలువురు తీవ్ర విమర్శలు గుప్పిస్తున్నారు.   

అయితే తాజాగా అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌, ఉపాధ్యక్షురాలు కమలా హారిస్‌కు సంబంధించిన ఓ స్పూఫ్‌ వీడియో నెట్టింట చక్కర్లు కొడుతోంది. ఉక్రెయిన్‌-రష్యా యుద్ధం కొనసాగుతున్న ప్రస్తుతం సమయంలో అంతర్జాతీయంగా నెలకొన్న పరిస్థితులపై అధ్యక్షుడు బైడెన్, ఉపాధ్యక్షురాలు కమలా హారిస్‌లు మీడియాతో మాట్లాడుతూ గందరగోళానికి గురైనట్లు చాలా వ్యంగ్యంగా ఓ ఫన్నీ స్కిట్‌ను సౌదీలోని ప్రభుత్వానికి అనుకూల టీవీ టెలివిజన్ ఛానెల్‌ ప్రసారం చేసింది. 

ఈ వీడియోలో రెండు పాత్రలు.. జో బైడెన్‌, కమలా హారిస్‌లు వేదికపై నడుస్తూ వచ్చినట్లు వ్యంగ్యంగా చూపుతారు. వారిద్దరూ మీడియతో మాట్లాడుతూ కనిపిస్తారు. ముందుగా.. బైడెన్‌ పాత్ర మాట్లాడుతూ.. ఈ రోజు మనం స్పెయిన్ సంక్షోభం గురించి మాట్లాడబోతున్నామని వ్యాఖ్యానిస్తాడు. పక్కనే ఉన్న ఉపాధ్యక్షురాలు కమలా హారిస్‌ పాత్రదారి కాదు.. కాదు.. అన్నట్లు చెవిలో చెబుతుంది. అయినా కూడా వినని బైడెన్‌ పాత్రదారి.. ఆఫ్రికాలో సంక్షోభం అంటూ మొదలుపెడతాడు. అది కూడా తప్పు కావడంతో చివరకు రష్యా అని అంటాడు.

అక్కడితో ఆగకుండా.. రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ పేరును మర్చిపోయి గుర్తు చేసుకోవడానికి సహాయం తీసుకుంటాడు. ‘పుతిన్, నా మాట వినండి. మీ కోసం నా దగ్గర చాలా ముఖ్యమైన సందేశం ఉంది. ఆ సందేశం ఏమిటంటే..’ అని నిల్చొన్న చోటే ఓ కునుకు తీస్తాడు. వెంటనే నిద్ర లేవగానే పుతిన్ గురించి పూర్తిగా మర్చిపోయి ‘చైనా ప్రెసిడెంట్' తో మాట్లాడుతున్నట్లు ప్రసంగం మొదలుపెట్టాడు. ఉపాధ్యక్షురాలు కమలా హారిస్‌ను పట్టుకొని.. తాను మాట్లాడున్న సమయంలో తనను సరిదిద్దినందుకు ధన్యవాదాలు, ఆమెరికా ప్రథమ మహిళా’ అని నవ్వుతూ మాట్లాడుతాడు.

ఇటీవల రష్యా-ఉక్రెయిన్ యుద్ధం నేపథ్యంలో చమురు సంక్షోభం గురించి స్పందించాలన్న అమెరికా అభ్యర్థనను సౌదీ రాజు మహ్మద్ బిన్ సల్మాన్ తిరస్కరించిన విషయం తెలిసిందే. ఇక అమెరికా అధ్యక్షుడిగా జో బైడెన్‌ పదవి స్వీకరించిన తర్వాత సౌదీ రాజు మహ్మద్ బిన్ సల్మాన్ ఒక్కసారిగా కూడా మాట్లాడిన దాఖలు లేకపోవడం గమనార్హం. తాజాగా ప్రసారమైన ఈ ఫన్నీ స్కిట్‌తో ఇరుదేశాల మధ్య సత్సంబంధాలు ఎలా ఉన్నావో తెలుసుకోవచ్చని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.

మరిన్ని వార్తలు