3 ఏళ్ల తర్వాత హక్కుల కార్యకర్త విడుదల.. కారణం అదేనా?

11 Feb, 2021 15:43 IST|Sakshi

దుబాయ్ ‌: దాదాపు మూడేళ్లు నిర్బంధంలో ఉన్న ప్రముఖ మహిళా హక్కుల కార్యకర్త  లౌజన్‌ అల్‌ హథ్‌లౌల్‌ (31)ను సౌదీ అధికారులు విడుదల చేశారు. మహిళా డ్రైవర్లపై నిషేధం ఎత్తివేయాలని కోరుతూ దీర్ఘకాలంగా పోరాడుతున్న లౌజస్‌ సహా మరో పన్నెండు మంది మహిళలను 2018 మేలో అరెస్ట్‌ చేసిన సంగతి తెలిసిందే. అయితే అనూహ్యంగా సౌదీలో మహిళా డ్రైవర్లపై నిషేధాన్ని ఎత్తివేస్తూ చారిత్రక నిర్ణయం వెలువడింది. ఉగ్రవాద నిరోధక చట్టం కింద అరెస్ట్ చేసిన లౌజన్‌కు కోర్టు దాదాపు ఆరేళ్ల జైలుశిక్ష విధించింది. అయితే ఆమె నిర్భంధంపై ఐక్యరాజ్యసమితి, ప్రపంచ మానవ హక్కుల సంఘాలు ఖండించాయి. ఆమెను వెంటనే విడుదల చేయాల్సిందిగా సౌదీ ప్రభుత్వాన్ని కోరాయి. ఈ నేపధ్యంలో రెండు సంవత్సరాల పది నెలల శిక్షాకాలన్ని తగ్గిస్తున్నట్లు 2020 మార్చిలో కోర్టు తీర్పునిచ్చింది. అప్పటి నుంచి ఆమె త్వరలోనే విడుదలవుతారంటూ పలు వార్తలు సోషల్‌ మీడియాలో చక్కర్లు కొట్టాయి. అయితే వెయ్యి రోజుల జైలు శిక్ష అనంతరం ఎట్టకేలకు లౌజన్‌ విడుదలయ్యింది.  (హక్కుల కార్యకర్తకు ఆరేళ్ల జైలు)

సౌదీలో మానవ హక్కుల పరిస్థితిపై అమెరికా ఒత్తిడి నేపథ్యంలో లౌజన్‌ విడుదల కావడం ప్రాధాన్యత సంతరించుకుంది. అమెరికా-సౌదీ దేశాలు మానవహక్కులు, ప్రజాస్వామ్య సూత్రాల కోసం నిలబడాలని అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ ప్రతిజ్ఞ చేస్తూ..మహిళా హక్కుల కార్యకర్తలతో సహా రాజకీయ ఖైదీలను విడుదల చేయాలని సౌదీ రాజ్యానికి పిలుపునిచ్చారు. బైడెన్‌ విజ్ఞప్తి మేరకే లౌజన్‌ను సౌదీ ప్రభుత్వం విడుదల చేసినట్లు తెలుస్తోంది. లౌజస్‌ను విడుదల చేయడం చాలా సంతోషకరమని బైడెన్‌ పేర్కొన్నారు. ఇక ఫ్రెంచ్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మాక్రాన్ సైతం లౌజన్‌ విడుదలను స్వాగతిస్తూ..ఎట్టకేలకు ఆమె కుటుంబానికి  ఉపశమనం కలిగినందుకు సంతోషంగా ఉందని ట్వీట్‌ చేశారు. (ట్రంప్‌ అభిశంసనపై విచారణ మొదలు)

Read latest International News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు