Reindeer: దుప్పి పాలు రుచి చూస్తారా!

1 Apr, 2021 18:32 IST|Sakshi

పాలు అంటే మనకు సాధారణంగా గుర్తుకు వచ్చేది అవులు, గేదెలు ఇంకా కొన్ని ప్రాంతాల్లో మేకపాలు, గొర్రె పాలు కూడా తాగుతారన్న విషయం మనకు తెలిసిందే. అయితే కొన్ని ప్రాంతాల్లో పాల కోసం దుప్పి (రైన్డీర్‌)ని పెంచుతారన్న విషయం మీకు తెలుసా? స్కాండినేవియా ప్రాంతంలో ఈ రైన్డీర్‌ పాలు వినియోగిస్తారు. అతి తక్కువ పరిమాణంలో లభించే ఈ పాలను పోషకాల ఘనిగా చెప్పవచ్చు. ఈ పాలలో 20 శాతం కొవ్వు 10 శాతం ప్రొటీన్లు ఉంటాయి. అయితే ఒక్కో  రైన్డీర్‌ రోజుకి ఒకటి నుంచి రెండు కప్పుల పాలు మాత్రమే ఇస్తుంది. భౌగోళిక, వాతావరణ పరిస్థితుల నేపథ్యంలో ఆయా ప్రాంతాల్లో ఏఏ జంతువుల పాలు వినియోగిస్తారో చూద్దాం..  


ఒంటె 
(సోమాలియా, కెన్యా)

ఎడారి ప్రాంతాల్లో ఎక్కువగా కనిపించే పాడి జంతువు ఒంటె. ఇవి సుమారు వారం రోజుల పాటు నీరు తాగకుండా జీవించగలవు. సోమాలియా, కెన్యాలు ప్రపంచంలో అత్యధికంగా ఒంటె పాలను ఉత్పత్తి చేస్తున్న దేశాలు. ఒంటెలు రోజుకు 5 నుండి 20 లీటర్ల పాలు ఇస్తాయి. ఆవు పాలతో పోల్చితే ఒంటె పాలు చిక్కగానూ, రుచిలో కాస్త ఉప్పగానూ ఉంటాయి.

గేదె
(ఇండియా, పాకిస్తాన్‌)

ఇండియా, పాకిస్తాన్‌లలో పాల ఉత్పత్తికి ప్రధాన ఆధారం పాడి గేదెలు. ప్రపంచంలో ఉత్పత్తి అవుతున్న మొత్తం పరిమాణంలో 80 శాతానికిపైగా గేదె పాలు ఈ రెండు దేశాల్లోనే ఉత్పత్తి అవుతున్నాయి. గేదెలు ఆవుల కన్నా ఎక్కువ పాల దిగుబడిని ఇస్తాయి. భారత్‌లో గుజరాత్‌లోని సూరత్‌ చుట్టు పక్కల ప్రాంతాల్లో గేదె పాలతో తయారుచేసే ‘సూర్తి పనీర్‌’ అనే మృదువైన జున్ను (చీజ్‌)కు విశేషమైన గుర్తింపుఉంది.

సాహివాల్‌ 
(ఇండియా, పాకిస్తాన్‌)

ఇండియా, పాకిస్తాన్‌లలో ప్రధానంగా కనిపించే మరో పాడి ఆవు సాహివాల్‌. ఇది పాకిస్తాన్‌లోని పంజాబ్‌ రాష్ట్రం సాహివాల్‌ జిల్లా పరిసర ప్రాంతాల్లో వృద్ధి చెందిన దేశవాళీ ఆవు. మన దేశంలో ఉత్తర ప్రదేశ్, పంజాబ్‌ రాష్ట్రాల్లో ఈ దేశీ జాతి ఆవులు కనిపిస్తాయి. వీటిలో రోజుకు 10 నుంచి 15 లీటర్ల పాల దిగుబడి సామర్థ్యం ఉంది. పాలలో వెన్న 5 నుంచి 10 శాతం వరకు ఉంటుంది.

గుర్రం  
(మంగోలియా)

గుర్రాలను ఎందుకు వినియోగిస్తారో అందరికీ తెలుసు. కానీ గుర్రం పాల గురించి చాలా మందికి తెలీదు.  మంగోలియాలో గుర్రాలను వ్యవసాయంతోపాటు పాల ఉత్పత్తికి వాడుతున్నారు. ఇక్కడ గుర్రపు పాలను 24 నుంచి 48 గంటలపాటు పులియబెట్టి, చిలకడం ద్వారా కౌమిస్‌ (లేదా ఐరాగ్‌) అనే పానీయాన్ని తయారు చేస్తారు. పుల్లగా ఉండే ఈ పానీయంలో 2 శాతం ఆల్కహాల్‌ ఉండటం విశేషం. 

యాక్‌ 
(జడల బర్రె) / (టిబెట్‌) 

యాక్‌ (జడల బర్రె) హిమాలయ ప్రాంతానికి చెందిన పాడి జంతువు. వీటి నుండి పాలతోపాటు ఉన్ని, మాంసం ఉత్పత్తి చేస్తున్నారు. చలికాలంలో కంటే వేసవిలో ఎక్కువ పాల దిగుబడి సామర్థ్యం కలిగి ఉండటం వీటి ప్రత్యేకత. ఆవు పాలతో పోల్చితే జడల బర్రె పాలలో కొవ్వులు, ప్రొటీన్లు అధికంగా ఉంటాయి. వీటి పాలతో వెన్న, వివిధ రకాల చీజ్‌లను తయారు చేస్తారు.

మేక 
(ఫ్రాన్స్‌)

ఫ్రాన్స్‌లో మేక పాలు విరివిగా వినియోగిస్తున్నారు. ఇక్కడ మేక పాలను రకరకాల చీజ్‌ల తయారీలో ఉపయోగిస్తారు. సహజసిద్ధంగా ఎన్నో ఔషధ గుణాలను కలిగి ఉండటం వల్ల మేక పాలను చర్మ సంరక్షణకు, సౌందర్య సాధనాల (కాస్మొటిక్స్‌) తయారీకి వినియోగిస్తున్నారు. మేక పాలలో కంటి చూపుకు మేలు చేసే ఎ–విటమిన్‌ సమృద్ధిగా లభిస్తుంది.

రైన్డీర్‌ 
(పలవల దుప్పి)/ (ఫిన్‌ల్యాండ్‌)

రైన్డీర్‌ పాలు చాలా అరుదుగా లభిస్తాయి. స్కాండినేవియా భూభాగంలోని కొన్ని ప్రాంతాల్లో మాత్రమే రైన్డీర్‌లు సంచరిస్తున్నాయి. ఇవి రోజుకు ఒకటి నుంచి రెండు కప్పుల పాలు మాత్రమే ఇస్తాయి. ఈ పాలలో 20 శాతం కొవ్వు పదార్థం ఉండటంతో చిక్కదనంతో పాటు రుచిగా ఉంటాయి. ఫిన్‌ల్యాండ్‌లో రైన్డీర్‌ పాలను  ‘లేపజువస్టో’ అనే జున్ను తయారీకి వాడతారు.

గొర్రె 
(గ్రీస్‌)

గొర్రె పాలకు గ్రీస్‌ ప్రసిద్ధి చెందింది. ఆవు పాలతో పోల్చితే గొర్రె పాలలో కొవ్వు శాతం ఎక్కువ. అందువల్ల ఇవి చీజ్‌ తయారీకి అత్యుత్తమైనవి. గ్రీస్‌లో గొర్రె పాలతో ఎన్నో వెరైటీల చీజ్‌లను తయారు చేస్తున్నప్పటికీ ‘ఫెటా చీజ్‌’ అనే వెరైటీని ఇక్కడ ఎక్కువ మంది ఇష్టపడతారు. గొర్రె పాలలో అధికంగా ఉండే కాల్షియం మన దంతాలను, ఎముకలను ఆరోగ్యంగా ఉంచుతుంది.

మూస్‌ 
(రష్యా, స్వీడన్‌)

ప్రపంచ వ్యాప్తంగా చాలా అరుదుగా లభిస్తున్న మూస్‌ పాలను రష్యా, స్వీడన్‌ దేశాలలో ఎక్కువగా ఉత్పత్తి చేస్తున్నారు. మూస్‌ రోజుకు 1 నుండి 6 లీటర్ల పాలను ఇస్తుంది. మూస్‌ పాలతో తయారయ్యే చీజ్‌ (మూస్‌ చీజ్‌) ప్రపంచంలో అత్యంత ఖరీదైన చీజ్‌గా గుర్తింపు పొందింది. ప్రపంచంలో మూస్‌ చీజ్‌ను తయారు చేస్తున్న ఏకైక కేంద్రం (మూస్‌ హౌస్‌) స్వీడన్‌లోని బ్జుర్హోమ్‌ ప్రాంతంలో ఉంది. ఇక్కడ మూడు వెరైటీలతో మూస్‌ చీజ్‌లను తయారు చేస్తున్నారు.

గాడిద పాలు
గాడిద పాలు మంచి న్యూట్రిషనల్‌ బెనిఫిట్స్‌ కలిగిఉన్నట్లు ఐక్యరాజ్య సమితిలోని ఫుడ్‌ అండ్‌ అగ్రికల్చర్‌ ఆర్గనైజేషన్‌ (ఎఫ్‌ఏవో) ప్రకటించింది. రోగ నిరోధక శక్తిని పెంచే మెడిసినల్‌ వ్యాల్యూస్‌ కూడా గాడిద పాలలో ఉన్నాయి. విటమిన్లు, ఎసెన్షియల్‌ ఫ్యాటీ యాసిడ్లు, యాంటీ ఆక్సిడెండ్లు పుష్కలంగా ఉంటాయి. గాడిద పాలు స్నానానికి ఉపయోగిస్తే చర్మం మృదువుగా మారుతుందని, చర్మ సంరక్షణ కలుగుతుందని శాస్త్రీయంగా నిరూపించడం జరిగింది. క్రీస్తు పూర్వం ఈజిప్టు రాణి క్లియో పాత్ర తన బ్యూటీని కాపాడుకోవడానికి గాడిద పాలతోనే స్నానం చేసేదట. ఇప్పటికీ అందానికి కేరాఫ్‌ అడ్రస్‌గా ఆమెనే చెబుతారు.  

మరిన్ని వార్తలు