జర్మనీలో షోల్జ్‌ నేతృత్వంలో సంకీర్ణ కూటమి

8 Dec, 2021 05:30 IST|Sakshi

బెర్లిన్‌: ఎంజెలా మెర్కెల్‌ తర్వాత జర్మనీ చాన్సెలర్‌గా బాధ్యతలు ఎవరు చేపట్టనున్నారనే విషయంలో సందిగ్ధం వీడింది. ఒలాఫ్‌ షోల్జ్‌ నేతృత్వంలోని సంకీర్ణ ‘ప్రోగ్రెసివ్‌’కూటమి అధికారపగ్గాలు చేపట్టనుంది. ఇందుకు సంబంధించిన ఒప్పందంపై షోల్జ్‌కు చెందిన సోషల్‌ డెమోక్రాట్‌ పార్టీ, భాగస్వాములైన గ్రీన్‌ పార్టీ, ఫ్రీ డెమోక్రాట్‌ నేతలు మంగళవారం సంతకాలు చేశారు. దీంతో, పార్లమెంట్‌లో స్పష్టమైన మెజారిటీ ఉన్న ప్రోగ్రెసివ్‌ కూటమి నేతగా బుధవారం షోల్జ్‌ ఎన్నికకు మార్గం సుగమమైంది. 

జర్మనీ తదుపరి చాన్సెలర్‌గా షోల్జ్‌ బాధ్యతలు చేపట్టనున్నారు. ‘ప్రభుత్వం ఏర్పాటు చేయడంలో చూపిన సహకారం భాగస్వామ్య పక్షాల మధ్య మున్ముందు కూడా కొనసాగితే, మాముందున్న లక్ష్యాలను సాధించడం చాలా తేలికవుతుంది. కరోనా మహమ్మారిని నిలువరించడం మా శక్తిసామర్థ్యాలకు పరీక్ష కానుంది’షోల్జ్‌ మీడియాతో అన్నారు.  వాతావరణ మార్పులను అడ్డుకోవడమే కొత్త ప్రభుత్వ ప్రథమ ప్రాథాన్యం కానుంది. దేశ ఆర్థిక వ్యవస్థ ఆధునీకరణ, మరిన్ని ఉదారవాద సామాజిక విధానాలను ప్రవేశపెట్టడం కూడా షోల్జ్‌ ప్రభుత్వ లక్ష్యాలుగా ఉన్నాయి.

కాగా, ఇప్పటికే నాలుగు పర్యాయాలు, 16 ఏళ్లపాటు ప్రభుత్వాధినేతగా కొనసాగి చరిత్ర సృష్టించిన ఎంజెలా మెర్కెల్‌ ఐదో దఫా చాన్సెలర్‌ ఎన్నిక బరి నుంచి స్వచ్ఛందంగా వైదొలిగారు. ఆమెకు చెందిన యూనియన్‌ బ్లాక్‌ సెప్టెంబర్‌లో జరిగిన ఓటమి పాలైంది.  

మరిన్ని వార్తలు