-

హిజాబ్ వివాదం: ఇరాన్‌ పోలీసుల దాడిలో 15 ఏళ్ల బాలిక మృతి

20 Oct, 2022 14:47 IST|Sakshi

టెహ్రాన్: ఇరాన్‌లో హిజాబ్‌ వివాదం కొనసాగుతూనే ఉంది. 22 ఏళ్ల మహ్‌సా అమిని అనే యువతి పోలీసు కస్టడీలో కన్నుమూయడంతో ఇరాన్‌ అంతటా నిరసన జ్వాలలు చెలరేగిన విషయం తెలిసిందే. మహిళలు జట్టు కత్తిరించి.. హిజాబ్‌లు తగలబెట్టి తమ నిరసనలను కొనసాగిస్తున్నారు. మరోవైపు.. హిజాబ్‌ ఆందోళనకారులను అణచివేసేందుకు భద్రతా దళాలు ఉక్కుపాదం మోపుతున్నాయి. ఈ క్రమంలో మరో బాలిక పోలీసుల చేతిలో బలైపోయింది. పాఠశాలలో తనిఖీలు చేపట్టిన పోలీసులు విద్యార్థినులను తీవ్రంగా కొట్టటం వల్ల మృతి చెందినట్లు ద గార్డియన్‌ మీడియా వెల్లడించింది. దీంతో ఇరాన్‌లో పెద్ద ఎత్తున ఆందోళనలు కొనసాగుతున్నాయి. విద్యార్థినులు రోడ్లపైకి వచ్చి హిజాబ్‌లు తొలగించి నిరసనలు చేపట్టారు.

అక్టోబర్‌ 13న అర్దాబిల్‌లోని షహేద్‌ గర్ల్స్‌ హైస్కూల్‌లో భద్రతా దళాలు తనిఖీలు చేశాయి. ఈ సందర్భంగా ప్రభుత్వ అనుకూల గీతం ఆలపించాలని కోరగా అందుకు నిరాకరించారు విద్యార్థులు. దీంతో స్కూల్‌ విద్యార్థులపై విచక్షణారహితంగా పోలీసులు దాడి చేశారని, ఈ దాడిలో చాలా మంది విద్యార్థులు తీవ్రంగా గాయపడినట్లు ద గార్డియన్‌ పేర్కొంది. ఈ దాడిలోనే గాయపడిన 15 ఏళ్ల అస్రా పనాహి అనే విద్యార్థిని ప్రాణాలు కోల్పోయినట్లు వెల్లడించింది. అయితే, భద్రతా దళాలు కొట్టటం వల్లే బాలిక మృతి చెందిందన్న వార్తలను ఇరాన్‌ అధికారులు ఖండించారు.  ఈ క్రమంలోనే పుట్టుకతో వచ్చే గుండె జబ్బుతోనే మరణించినట్లు బాలిక బంధువు ఒకరు తెలపటం గమనార్హం. 

గత శుక్రవారం పనాహి మృతి చెందిన క్రమంలో టీచర్స్‌ యూనియన్‌.. సెక్యూరిటీ బలగాల అమానవీయ, క్రూరమైన దాడులను ఖండించింది. ఇరాన్‌ విద్యాశాఖ మంత్రి యూసఫ్‌ నౌరీ రాజీనామా చేయాలని డిమాండ్‌ చేసింది. పోలీసుల దాడిలో మొత్తం ఏడుగురు తీవ్రంగా గాయపడినట్లు తెలుస్తోంది. మరోవైపు.. దేశవ్యాప్తంగా బలగాల దాడుల్లో 23 మంది పిల్లలు ప్రాణాలు కోల్పోయినట్లు మానవ హక్కుల కార్యాలయం ఆందోళన వ్యక్తం చేసింది. 

ఇదీ చదవండి: హిజాబ్‌ నిరసనలకు కారణమైన ‘యువతి’ మరణంలో ట్విస్ట్‌!

మరిన్ని వార్తలు