Soumya Swaminathan: పాఠశాలలు ప్రారంభించాల్సిందే

12 Aug, 2021 06:24 IST|Sakshi

లేదంటే పిల్లల్లో మానసిక సమస్యలు తలెత్తే అవకాశం

డబ్ల్యూహెచ్‌ఓ చీఫ్‌ సైంటిస్ట్‌ సౌమ్య స్వామినాథన్‌  

జెనీవా: కరోనా వైరస్‌ ముప్పు ఉన్నప్పటికీ పాఠశాలలు ప్రారంభించడానికే ప్రపంచ దేశాలన్నీ ప్రాధాన్యం ఇవ్వాలని ప్రపంచ ఆరోగ్య సంస్థ చీఫ్‌ సైంటిస్ట్‌ డాక్టర్‌ సౌమ్య స్వామినాథన్‌ పిలుపునిచ్చారు. కరోనా వైరస్‌ ప్రభావం పరోక్షంగా విద్యారంగంపై తీవ్రస్థాయిలో ఉందని చెప్పారు. కోవిడ్‌–19 ఉందని పిల్లల్ని నాలుగ్గోడల మధ్య ఉంచితే దీర్ఘకాలంలో వారిలో మానసిక సమస్యలు తలెత్తే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు.

కోవిడ్‌–19 నిబంధనలన్నీ పాటిస్తూ, సకల జాగ్రత్తలు తీసుకుంటూ పాఠశాలలను పునఃప్రారంభించడమే మంచిదన్నారు. పాఠశాలల్లో ఉపాధ్యాయులతో పాటు సిబ్బంది అందరికీ వ్యాక్సిన్‌లు తప్పనిసరిగా ఇవ్వాలని, ఇండోర్‌ సమావేశాలకి దూరంగా ఉండాలని సూచిస్తూ సౌమ్య స్వామినాథన్‌ ట్వీట్‌ చేశారు. భారత్‌లో కోట్ల మంది పిల్లలు హఠాత్తుగా స్కూలుకి వెళ్లడం మానేశారని, దీంతో వారి చదువు బాగా దెబ్బతిందని ఆమె ఆందోళన వ్యక్తం చేశారు. పిల్లలపై మూడో వేవ్‌ ప్రభావం చూపిస్తుందని అనడానికి శాస్త్రీయ ఆధారాలు లేవన్నారు.  

ఆరునెలలు జాగ్రత్తలు పాటించాలి
‘నాకు తెలుసు అందరూ అలిసిపోయారు. ప్రతీ ఒక్కరూ బంధుమిత్రుల్ని కలుసుకోవాలని, విందు వినోదాలు ఏర్పాటు చేసుకోవాలని తహతహలాడుతున్నారు. కాస్త ఓపిక వహించాలి. మరో ఆరు నెలలు చాలా జాగ్రత్తగా ఉండాలి. అప్పటికి వ్యాక్సినేషన్‌ ఎక్కువ మందికి ఇవ్వడం పూర్తయితే నెమ్మదిగా పరిస్థితులు సాధారణ స్థితికి చేరుకుంటాయి’ అని అన్నారు. 

మరిన్ని వార్తలు