చావు నుంచి మళ్లీ పుట్టుకకు.. 

16 Sep, 2022 04:23 IST|Sakshi

ప్రస్తుతం భూమ్మీద 10 లక్షల జంతు/వృక్ష జాతులు అంతరించిపోయే దశలో ఉన్నట్టు అంచనా 

గంటకు ఆరు, రోజుకు 150 చొప్పున ఏటా 55 వేల జీవజాతులు అంతరించిపోతున్నట్టు శాస్త్రవేత్తలు చెబుతున్నారు

ఇప్పుడున్న పరిస్థితే కొనసాగితే.. 2050 నాటికి 50 శాతం జీవజాతులు అంతరిస్తాయని స్పష్టం చేస్తున్నారు

భూమ్మీద మనుషుల విస్తృతి పెరుగుతున్న కొద్దీ అడవులు తరిగిపోతున్నాయి. దీనికి ఇతర కారణాలూ తోడై పలు రకాల జీవరాశులు అంతరిస్తున్నాయి. ఒకప్పుడు తమకే ప్రత్యేకమంటూ గొప్పగా చెప్పుకున్న జీవజాతులూ కనిపించకుండా పోతున్నాయి. అలా విలుప్తమైన జీవులను తిరిగి సృష్టించేందుకు శాస్త్రవేత్తలు ప్రయత్నాలు చేస్తున్నారు.

మన దేశంలోనూ అంతరించిపోయిన చీతాలను మళ్లీ పుట్టించేందుకు ప్రయత్నిస్తున్న విషయమూ తెలిసిందే. ఈ క్రమంలో ఆయా జాతులకు చెందిన ఒక్క జీవి కూడా బతికిలేకున్నా తిరిగి పుట్టించడం ఎలా సాధ్యమనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. అదెలా, ఏం చేస్తారనే వివరాలు తెలుసుకుందామా..
సాక్షి సెంట్రల్‌ డెస్క్‌

పులి కాని పులి..
ఆస్ట్రేలియాలో పరిశోధకులు ఇటీవలే కోట్ల రూపాయలతో టాస్మానియన్‌ టైగర్లను తిరిగి పుట్టించే ఓ ప్రాజెక్టు చేపట్టారు. ఆస్ట్రేలియాకే ప్రత్యేకమైన వీటిని థైలసిన్లుగా కూడా పిలుస్తారు. కొంచెం శునకంలా, మరికొంచెం పులిలా చారలతో ఉండే టాస్మానియన్‌ టైగర్లు.. వేట, అడవుల విధ్వంసం కారణంగా 1930లోనే అంతరించిపోయాయి. 

 అతి భారీ ఏనుగు
వేల ఏళ్ల కింద భూమ్మీద తిరుగాడిన అతి భారీ ఏనుగుల (వూలీ మమ్మోత్‌)ను తిరిగి పుట్టించేందుకు అమెరికాకు చెందిన కలోస్సల్‌ బయో సైన్సెస్‌ శాస్త్రవేత్తలు ప్రయత్నాలు చేస్తున్నారు. వూలీ మమ్మోత్‌లు నాలుగు వేల ఏళ్ల కిందే అంతరించిపోయాయి. 

3 విధానాల్లో పునరుత్థానం
ఎప్పుడో అంతరించిపోయిన, ప్రస్తుతం అంతరించిపోయే దశలో ఉన్న జీవజాతులను తిరిగి పునరుత్థానం చెందించేందుకు మూడు రకాల పద్ధతులు ఉన్నాయని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. క్లోనింగ్, బ్యాక్‌ బ్రీడింగ్, జీనోమ్‌ ఎడిటింగ్‌ ద్వారా ఆయా జీవులను పుట్టించవచ్చని అంటున్నారు. 

► క్లోనింగ్‌ ద్వారా జీవులను పుట్టించడం చాలా మందికి తెలిసినదే. ఏదైనా జీవి కణాలను సేకరించి, వాటి నుంచి పిండాన్ని రూపొందించడం ద్వారా.. అచ్చం అదే జీవిని పుట్టించగలుగుతారు. అయితే ఈ విధానంలో ఆ జాతికి చెందిన జీవులు కొన్ని అయినా ఉండాల్సి ఉంటుంది. పూర్తిగా అంతరించిపోయిన వాటి విషయంలో ఈ విధానం పనికిరాదు. 

► అంతరించిపోయిన జీవులకు అత్యంత దగ్గరి జాతి జీవులేవైనా ఉంటే.. వాటి ఆధారంగా పూర్వపు జాతిని పుట్టించడమే ‘బ్యాక్‌ బ్రీడింగ్‌’. ఉదాహరణకు.. జీబ్రాలకు బాగా దగ్గరి జాతి అయిన ‘క్వాగ్గాస్‌’ రకం జంతువులు 1883లోనే అంతరించిపోయాయి. దీనితో శాస్త్రవేత్తలు జీబ్రాల డీఎన్‌ఏ, బ్యాక్‌ బ్రీడింగ్‌ పద్ధతి సాయంతో దాదాపు ‘క్వాగ్గా’తో సరిపోలిన జంతువును పుట్టించే ప్రయత్నం చేస్తున్నారు. 

► ఎప్పుడో అంతరించిపోయిన జాతితో సరిపోలిన ఇప్పటి జంతువుల డీఎన్‌ఏను సేకరించి.. దాన్ని మార్చి నాటి జాతిని సృష్టించడం మూడో పద్ధతి. ప్రస్తుతం సేకరించిన డీఎన్‌ఏలో విలుప్తమైన జాతి లక్షణాలకు సంబంధించిన జన్యువులను చేర్చడం, అవసరం లేని వాటిని తొలగించడం, రీప్లేస్‌ చేయడం వంటివి చేస్తారు. ఉదాహరణకు ప్రస్తుతమున్న ఏనుగుల డీఎన్‌ఏలో మార్పులు చేసి ఒకనాటి ‘మమ్మోత్‌’లను తిరిగి పుట్టించేందుకు హార్వార్డ్‌ మెడికల్‌ స్కూల్‌కు చెందిన ప్రొఫెసర్‌ జార్జ్‌ చర్చ్‌ ప్రయత్నిస్తున్నారు. 

మరి డైనోసార్లనూ పుట్టించొచ్చా? 
అంతరించిపోయిన జీవులను తిరిగి పుట్టించాలంటే వాటికి సంబంధించి కనీస స్థాయిలో డీఎన్‌ఏ లభించడం తప్పనిసరి. సాధారణంగా ఎంత అనుకూల పరిస్థితులున్నా కూడా డీఎన్‌ఏ 521 సంవత్సరాల్లో పూర్తిగా దెబ్బతింటుంది. మరి డైనోసార్లు ఎప్పుడో ఆరున్నర కోట్ల ఏళ్ల కిందే విలుప్తమైపోయాయి. వాటికి అతి సమీప జీవులేవీ కూడా ప్రస్తుతం మనుగడలో లేవు. కాబట్టి వాటిని తిరిగి పుట్టించడం సాధ్యం కాదని శాస్త్రవేత్తలు స్పష్టం చేస్తున్నారు. 

ఇప్పుడున్న పరిస్థితి ఏమిటి? 
ప్రపంచవ్యాప్తంగా ఎన్నో ప్రయత్నాలు జరుగుతున్నా.. ఇప్పటివరకు అంతరించిపోయిన ఒక్కజీవిని కూడా తిరిగి పుట్టించలేదు. కొందరు శాస్త్రవేత్తలు మాత్రం ఆ దిశగా ముందడుగు వేస్తున్నట్టు చెబుతున్నారు. 

మరిన్ని వార్తలు