kidney transplantation: సంచలనం

20 Oct, 2021 14:19 IST|Sakshi

పరిశోధకులు ఎన్నాళ్లుగానో ఎదురుచూస్తున్న ప్రయోగం ఫలించింది. ఒక రోగికి తాత్కాలికంగా పంది కిడ్నీని విజయవంతంగా అమర్చారు. ప్రపంచంలోనే తొలిసారిగా న్యూయార్క్ యూనివర్సిటీ లాంగోన్‌లో ఆసుపత్రిలో ఈ ట్రాన్స్‎ప్లాంటేషన్ నిర్వహించారు. వైద్యులు ఈ కొత్త ప్రయోగం విశేషంగా నిలుస్తోంది. ఈ సక్సెస్‌తో పంది గుండెను మనిషికి అమర్చే తరుణం కూడా దగ్గరలోనే ఉందనే ఆశాభావం వ్యక్తమవుతోంది.

కోతినుంచి ఆవిర్భవించిన మనిషి మిగిలిన జంతువులతో కూడా చాలా దగ్గర పోలికలున్నట్టు కనిపిస్తోంది. తాజాగ ప్రపంచంలో తొలిసారిగా పంది మూత్రపిండాన్ని మనిషికి మార్పిడి చేశారు. అవయవాల కొరతతో ఇబ్బందులుపడుతున్న తరుణంలో ఇది పెద్ద ముందడుగని నిపుణులు వ్యాఖ్యానిస్తున్నారు. 

బ్రెయిన్ డెడ్ అయిన మహిళా రోగికి కిడ్నీలు పూర్తిగా చెడిపోయాయి. కానీ ఆమెకు మూత్ర పిండాన్ని దానం చేయడానికి ఎవరు ముందుకు రాలేదు. దీంతో ఆమె కుటుంబ సభ్యుల ఆమోదంతో వైద్యులు  ఒక కొత్త ప్రయోగాన్ని చేపట్టారు. గత కొన్ని దశాబ్దాల పరిశోధనల నేపథ్యంలో ఆమెకు పంది కిడ్నీని అమర్చేందుకు నిర్ణయించారు. మూడు రోజుల పాటు, కొత్త కిడ్నీని ఆమె రక్తనాళాలకు జతచేశారు. మార్పిడి చేసిన మూత్ర పిండాల పనితీరు, పరీక్షఫలితాలు చాలా మెరుగ్గా కనిపించాయని దీనికి నాయకత్వం వహించిన వైద్యుడు డాక్టర్ రాబర్ట్ మోంట్‌ గోమేరీ తెలిపారు. 

ఈ ప్రయోగ ఫలితంగా అవయవ మార్పిపై కొత్త ఆశలు చిగురించాయి. జెనోట్రాన్స్‌ప్లాంటేషన్ కల సాకారంలో ఇదొక కీలక అడుగు అని యునైటెడ్ థెరప్యూటిక్స్ సీఈవో మార్టిన్ రోత్‌బ్లాట్ ఒక ప్రకటనలో తెలిపారు. అంతేకాదు భవిష్యత్తులో ప్రతి  ఏడాది వేలాదిమంది ప్రాణాలను కాపాడే సమయం ఎంతో దూరంలో లేదని  వ్యాఖ్యానించారు.

జన్యుపరంగా మార్పు చెందిన పందిని గాల్‌సేఫ్ అని పిలుస్తారు. దీనిని యునైటెడ్ థెరప్యూటిక్స్ కార్పొరేషన్‌కు చెందిన రివైవికర్ యూనిట్ అభివృద్ధి చేసింది. మాంసం అలెర్జీ ఉన్నవారికి ఆహారంగా, మానవ చికిత్సా సంభావ్య వనరుగా ఉపయోగించడం కోసం దీనిని డిసెంబర్ 2020లో యూఎస్‌ ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ ఆమోదించింది. మానవ రోగులకు గుండె కవాటాల నుండి చర్మ అంటుకట్టుట వరకు గాల్‌సేఫ్పందులు అన్నింటికి పరిష్కరంగా ఉంటాయని అందుకు పరిశోధకులు పరిశోధన చేస్తున్నారు. ఈ మూత్రపిండ మార్పిడి ప్రయోగం ఎండ్-స్టేజ్ కిడ్నీఫెయిల్యూర్ ఉన్న రోగులలో, వచ్చే ఏడాది లేదా రెండేళ్లలో ట్రయల్స్‌కు మార్గం సుగమం చేయాలని, స్వయంగా గుండె మార్పిడి గ్రహీత అయిన మోంట్‌గోమేరీ అన్నారు. 

జంతువుల అవయవాలను మార్పిడి అవకాశంపై దశాబ్దాలుగా కృషి జరుగుతోంది. పంది గుండె ఆకారంలోనూ, నిర్మాణంలోనూ మనిషి గుండెను పోలి ఉంటుందని ఇప్పటికే పరిశోధకులు తేల్చారు. ఈ నేపథ్యంలోనే 2022 కల్లా వరాహం గుండెను మనిషికి అమర్చే ప్రయోగాలు సక్సెస్ అవుతాయని  ప్రఖ్యాత వైద్యుడు సర్ టెరెన్స్  గతంలోనే ఆశాభావం వ్యక్తం చేశారు. అలాగే పంది మూత్రపిండం మనిషికి మార్చే అవకాశంపై కూడా ఈయన చర్చించారు. ఒకవేళ మనిషికి పంది మూత్రపిండం మార్చడం సాధ్యపడితే గుండెను కూడా మార్చటం సాధ్యమేనని ఆయన స్పష్టం చేశారు.  యూకేలో గుండె మార్పిడి చికిత్సలకు పేరుగాంచిన టెరెన్స్ 40 ఏళ్ల క్రితమే మొట్టమొదటి గుండె మార్పిడి చికిత్స చేయడం విశేషం.

కాగా భారతదేశంలో మొట్టమొదటి మానవ మూత్రపిండ మార్పిడి 1965లో బొంబాయిలోని కింగ్ ఎడ్వర్డ్ మెమోరియల్ హాస్పిటల్‌లో జరిగింది. అయితే విజయవంతమైన తొలి మూత్రపిండ మార్పిడి శస్త్రచికిత్స వెల్లూరులోని క్రిస్టియన్ మెడికల్ కాలేజీలో  జరిగిందని చాలా కొద్ది మందికి మాత్రమే తెలుసు. 1971 ఫిబ్రవరి 2న షణ్ముగం అనే రోగికి ట్రాన్స్‌ప్లాంటేషన్‌ చేసి  వైద్యులు  తొలి విజయాన్ని నమోదు చేశారు.

అమెరికాలో దాదాపు 1,07,000 మంది ప్రస్తుతం అవయవ మార్పిడి కోసం వేచి చూస్తున్నారని ఒక నివేదిక తెలిపింది. ఇందులో 90వేలకు పైగా రోగులు కిడ్నీ కోసం ఎదురుచూస్తుండగా, రోజుకు 12 మంది చని పోతున్నారు. భారతదేశంలో కిడ్నీ సంబధిత వ్యాధులతో బాధపడుతున్న వారి సంఖ్య రోజురోజుకు పెరుగుతోంది.  ముఖ్యంగా అవయవాల మార్పిడికి ఆర్గాన్స్ అందుబాటులో లేక దాదాపు 5 లక్షల మంది ప్రాణాలు కోల్పోతున్నారు. ఏటా 2 లక్షల మందికి పైగా రోగులు కిడ్నీ మార్పిడి చేయించు కుంటున్నారు. అలాగే లక్షా యాభై వేల మంది  కిడ్నీ ట్రాన్స్ ప్లాంటేషన్‌కు ఎదురు చూస్తున్నారట. ముఖ్యంగా అవయవ దానంపై అవగాహన లేక పోవడం, సన్నిహితులు, కుటుంబ సభ్యులు ఈ ఆర్గాన్‌ డొనేషన్‌కి ముందుకు రాకపోవడం ప్రధాన కారణంగా  భావిస్తున్నారు. 

మరిన్ని వార్తలు