Multicoloured Fish: హరివిల్లు.. చేప బ్యూటీఫుల్లు

16 Mar, 2022 04:25 IST|Sakshi

చేపల్లో ఇప్పటికే మనకు చాలా రకాలు తెలుసు. వండుకొని తినే కొర్రమీను, పులస, జెల్ల, పాపెరల లాంటి చేపలతో పాటు అక్వేరియంలో పెంచుకునే రకరకాల రంగుల చేపలను చూసే ఉంటాం. శాస్త్రవేత్తలు కూడా ఇప్పటికే ఎన్నో రకాల చేపలను కనుగొన్నారు. తాజాగా ఇంకో రకం చేపను కూడా గుర్తించారు. అచ్చం హరివిల్లు రంగులో ఉండే ఈ కొత్తరకం చేపను మాల్దీవుల్లోని సముద్రంలో కనుగొన్నారు.

వ్రాస్సె జాతికి చెందిన ఈ సముద్ర చేపకు సిర్రిలాబ్రస్‌ ఫినిఫెన్మా అని మాల్దీవుల జాతీయ పువ్వు పేరును కలిపి పెట్టారు. ముఖానికి గులాబీ రంగు ముసుగు వేసుకుందా అన్నట్టుండే ఈ చేపను సముద్రంలో 40 నుంచి 70 మీటర్ల లోతులో ట్విలైట్‌ జోన్‌లో గుర్తించారు. ఇంతకుముందు 30 ఏళ్ల కిందటే ఈ చేపను చూశామని, అయితే అప్పుడు ఇంకోరకం చేప అనుకున్నామని సైంటిస్టులు తెలిపారు. తాజా పరిశీలనలో అసలు విషయం తెలిసిందన్నారు. 

పెరుగుతూ.. రంగు మారుతూ.. 
చాలా రకాల చేపలు యుక్త వయసులో ఉన్నప్పుడు ఒకేలా అనిపిస్తాయి. పెద్ద వయసుకు వచ్చాక వాటి పూర్తి రూపును సంతరించుకుంటాయి. అలాగే వ్రాస్సె జాతికి చెందిన చేపలు కూడా వయసు పెరుగుతున్నాకొద్దీ రంగు మారుతుంటాయి. ఆ ప్రకారమే పెద్ద వయసుకు వచ్చాక ఈ రెయిన్‌బో చేపలు.. మెజెంటా, నారింజ, గులాబీ, ముదురు ఉదా, ఎరుపు రంగులతో అద్భుతంగా కనిపిస్తుంటాయి. 

ట్విలైట్‌ జోన్‌ అంటే? 
సముద్రంలో సూర్యకాంతి కొద్దికొద్దిగా చొచ్చుకెళ్లే ప్రాంతం ట్విలైట్‌ జోన్‌. సముద్ర ఉపరితలానికి 35 నుంచి 70 మీటర్ల మధ్య ఉంటుంది. ఈ ప్రాంతంలో కిరణజన్యసంయోగ క్రియ జరిగేంత స్థాయిలో సూర్యరశ్మి ఉండదు. కాబట్టి ఇక్కడ మొక్కలు పెరగవు. ఈ జోన్‌లో ఉండే జంతువులు అధిక పీడనం, చల్లని ఉష్ణోగ్రతలు, చీకటి వాతావరణానికి అలవాటు పడి జీవిస్తుంటాయి. ఈ నీటిలో ఉండే జంతువులు స్పష్టంగా చూసేందుకు కళ్లు పెద్దగా ఉంటాయి. అలాగే పెద్ద దంతాలు, దవడలు కూడా ఉంటాయి. 
– సాక్షి సెంట్రల్‌డెస్క్‌  

మరిన్ని వార్తలు