కంటికి కనిపించే... జంబో బ్యాక్టీరియా 

29 Jun, 2022 02:35 IST|Sakshi

ఏకంగా సెంటీమీటర్‌ పొడవుంది! 

కరీబియన్‌ దీవుల్లో కంటపడింది 

బ్యాక్టీరియా. సూక్ష్మజీవి. కంటికి కనిపించదు. శక్తిమంతమైన మైక్రోస్కోప్‌కు మాత్రమే చిక్కుతుంది. దాని పరిమాణానికి ఏ ఐదారు వేల రెట్లో పెద్దగా ఉంటే తప్ప చూడలేం. అలాంటి ఏక కణ సూక్ష్మజీవి కంటికి కనిపిస్తే? గమ్మత్తుగా ఉంటుంది కదా! సరిగ్గా అలాంటి కంటికి కనిపించే జంబో బ్యాక్టీరియా ఒకటుందని శాస్త్రవేత్తలు కనిపెట్టారు. దాని పేరు థియోమార్గరిటా మ్యాగ్నిఫికా. తెల్లగా సేమ్యా పోగులా కన్పించే ఇది ఏకంగా ఓ సెంటీమీటర్‌ సైజులో ఉంటుందట. కరీబియన్‌ దీవుల్లో ఉన్న లెసర్‌ ఆంటిలిస్‌లోని మడ తడి అడవుల్లో నీటి అడుగున ఇది కనిపించింది. సల్ఫర్‌ (గంధకం) కణాలతో స్వచ్ఛమైన ధవళ వర్ణంలో ఉండే ఈ బ్యాక్టీరియా కాంతిని వెదజల్లుతూ ముత్యంలా మెరుస్తూ ఉంటుంది. ఒకవిధంగా బ్యాక్టీరియాల్లో ఇది డైనోసార్‌ టైపన్నమాట. బ్యాక్టీరియా అంటే అతి సూక్ష్మజీవి అనే వాదనను ఇప్పుడిది పటాపంచలు చేసింది. కొత్త పరిశోధనల దిశగా శాస్త్రవేత్తలు చూపు సారించేట్టు చేసింది. 

మొక్కల్ని పోలిన జీవక్రియ 
కాలిఫోర్నియాలోని లారెన్స్‌ బర్కిలీ నేషనల్‌ లేబొరేటరీకి చెందిన సముద్రజీవ శాస్త్రవేత్త జీన్‌ మేరి వోలాండ్‌ మరికొంత ముందుకు వెళ్లి శక్తిమంతమైన మైక్రోస్కోప్‌ ద్వారా ఎక్స్‌రే టొమోగ్రపీ పద్ధతి ద్వారా ఈ బ్యాక్టీరియా పొడవును కచ్చితంగా నిర్ధారించారు. ఇది దాదాపు ఒక సెంటీమీటర్‌ (9.66 మిల్లీమీటర్ల) పొడవున్నట్టు గుర్తించారు. మ్యాగ్నిఫికా సైజును సాధారణ బ్యాక్టీరియాతో ఆయన పోల్చిన తీరు చూస్తే అది ఎంత పెద్దదో అర్థమవుతుంది. మామూలు బ్యాక్టీరియాకూ దీనికీ హిమాలయాలంత ఎత్తున్న మనిషికి, మామూలు మనిషికి ఉన్నంత తేడా ఉందంటారు వోలాండ్‌! దీని జీవక్రియ మొక్కల జీవక్రియను పోలి ఉంటుంది. జడ సమ్మేళనాల నుంచి కార్పోహైడ్రేట్ల నిర్మాణం ద్వారా మ్యాగ్నిఫికా జీవక్రియ సాగుతుందని వోలాండ్‌ విశ్లేషించారు.

తనలోని గంధకాన్ని మండించడం ద్వారా శక్తిని పొందుతుందని వివరించారు. ఈ బ్యాక్టీరియాను చాలా విశిష్టమైనదిగా గుర్తించి ఆశ్చర్యపోవడం తమ వంతయిందంటారు ఆంటిలిస్‌ యూనివర్సిటీకి చెందిన మాలిక్యులార్‌ బయాలజీ అసోసియేట్‌ ప్రొఫెసర్‌ సిల్వినా గొంజాలెస్‌ రిజ్జో. ‘‘మ్యాగ్నస్‌ అంటే లాటిన్‌లో భారీ అని అర్థం. అందుకే దీనికి మ్యాగ్నిఫికా అని పేరు పెట్టాం. పైగా అందమైన ఫ్రెంచ్‌ పదం ‘మ్యాగ్నిఫిక్‌’కు కూడా ఈ పేరు దగ్గరగా ఉంటుంది’’ అన్నారాయన. దీనికంటే ముందు వరకూ అతి పెద్ద బ్యాక్టీరియా అన్న రికార్డు ‘థియోమార్గరిటా నమీబియెన్సిస్‌’ పేరిట ఉండేది. దాన్ని నమీబియా దగ్గర్లోని సముద్ర జలాల్లో గుర్తించారు. దాని పొడవు 0.75 మిల్లీమీటర్లని రిజ్జో చెప్పారు. 

బ్యాక్టీరియాల్లోకెల్లా ఈ బ్యాక్టీరియా వేరయా అన్నట్టు మ్యాగ్నిఫికా ఎందుకంత జంబో సైజులో ఉందో శాస్త్రవేత్తలు ఇతమిద్ధంగా చెప్పలేకపోతున్నారు. బహుశా భారీ బ్యాక్టీరియాల ఉనికికి ఇదో సూచన కావచ్చని వారంటున్నారు. ఇంతకన్నా పెద్ద బ్యాక్టీరియాలు కూడా ఎక్కడో ఉండే ఉంటాయని కూడా వాదిస్తున్నారు. ప్రయోగశాలలో మ్యాగ్నిఫికాను పునరుత్పత్తి చేస్తే మరిన్ని కొత్త విషయాలు తెలుస్తాయని వాషింగ్టన్‌ యూనివర్సిటీ (సెయింట్‌ లూయీ)కి చెందిన శాస్త్రవేత్త పెటా ఆన్నె లెవిన్‌ భావిస్తున్నారు. 
– సాక్షి, నేషనల్‌ డెస్క్‌

బ్యాక్టీరియా అంటే... 
►ఇది కేంద్రకం ఉండని ఏక కణ సూక్ష్మజీవి 
►భూమిపై సర్వత్రా వ్యాపించి ఉంటుంది. పర్యావరణ వ్యవస్థలో దీనిది కీలక పాత్ర. 
►కొన్నిరకాల బ్యాక్టీరియా అత్యల్ప, అత్యుగ్ర ఉష్ణోగ్రతలు, పీడనాల వద్ద కూడా మనగలుగుతుంది. 
►ఒకరకంగా మానవ శరీరం పూర్తిగా బ్యాక్టీరియామయమే అని చెప్పాలి. అసలు మన ఒంట్లో మానవ జీవ కణాల కంటే కూడా బ్యాక్టీరియా కణాల సంఖ్యే ఎక్కువంటే అతిశయోక్తి కాదు! 
►అయితే మన ఒంట్లో ఉండే బ్యాక్టీరియాలో చాలావరకు అపాయరహితమైనవి, 
►మనకు ఉపయుక్తమైనవే. చాలా తక్కువ బ్యాక్టీరియా జాతులు మాత్రమే రోగ కారకాలు.     

2009లోనే గుర్తించినా... 
నిజానికి ఈ జీవిని 2009లోనే గుర్తించారు. ఫ్రెంచ్‌ ఆంటిలెస్‌ యూనివర్సిటీకి చెందిన ఒలివర్‌ గ్రాస్‌ అప్పట్లో దీన్ని గుర్తించారు. కానీ దీన్ని ఫంగస్‌గా పొరబడ్డారు. నిజానికది జంబో బ్యాక్టీరియా అని మరో ఐదేళ్ల పరిశోధన తర్వాత గాని ఆయన గుర్తించలేకపోయారు. ‘‘మొదట్లో ఏదో గమ్మత్తయిన జీవి అనుకున్నాను. తెల్లటి ఫిలమెంట్‌లా ఉన్న ఈ జీవి అబ్బురంగా తోచింది’’ అని గ్రాస్‌ తన అనుభవాన్ని ఓ జర్నల్లో పంచుకున్నారు. ఈ పరిశోధన ఫలితాన్ని ఓ మామూలు జర్నల్లో ప్రచురించినప్పుడు చాలామంది శాస్త్రవేత్తలు నమ్మలేదు. కానీ ఈ పరిశోధనా క్రమాన్ని, ఫలితాన్ని తాజాగా సైన్స్‌ జర్నల్లో ప్రచురించడంతో అందరికీ నమ్మకం కుదిరింది.

మరిన్ని వార్తలు