రోబో ఎలుక

25 Apr, 2022 05:03 IST|Sakshi

ఇటీవలి సంవత్సరాల్లో శాస్త్రవేత్తలు రోబోటిక్‌ చేపల నుంచి రోబోటిక్‌ శునకాల దాకా అనేక జంతువులను అభివృద్ధి చేశారు. అయితే ఇటీవల శాస్తవేత్తలు రోబోటిక్‌ ఎలుకను రూపొందించారు. దాన్ని ఎక్కడ, ఎవరు తయారుచేశారు? అదేం పనులు చేస్తుందనే విశేషాలేంటో చూద్దాం.      
–సాక్షి, సెంట్రల్‌ డెస్క్‌ 

చైనాలోని బీజింగ్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీకి చెందిన శాస్త్రవేత్తలు ఇటీవల ‘రోబో ర్యాట్‌’ను ఆవిష్కరించారు. ‘స్కురో (స్మాల్‌సైజ్‌ క్వాడ్రుపెడ్‌ రోబొటిక్‌ ర్యాట్‌)’అని పిలిచే ఈ నాలుగు కాళ్ల రోబో ఎలుక.. నిజమైన ఎలుక మాదిరే నడవగలదు, మోకాళ్లు వంచి వెళ్లగలదు, నెమ్మదిగా పాకుతున్నట్లు కూడా పోగలదు. దాని శరీర బరువులో 91 శాతం బరువును మోసుకెళ్లగలదు. ఇది తన శరీరాన్ని ముడుచుకుని చాలాచిన్నపాటి గ్యాప్‌లలో కూడా వేగంగా పరిగెత్తే సామర్థ్యం కలిగిఉంటుంది. కిందపడినా కూడా మళ్లీ నిలబడగలదు కూడా. 

విజయవంతంగా పరీక్షలు 
పరిశోధకులు ఈ రోబో ఎలుకను ఇటీవల క్షేత్రస్థాయిలో పలు రకాలుగా పరీక్షించారు. ‘చక్కగా లేకుండా ఎగుడుదిగుడుగా వంపులతో ఉన్న 3.5 అంగుళాల వెడల్పున్న చిన్న మార్గంలో ఇది విజయవంతంగా తన పనిని నిర్వర్తించింది. 1.1 అంగుళాల ఎత్తున్న అడ్డంకులను సులువుగా అధిగమించడంతోపాటు 15 డిగ్రీలు వాలుగా ఉన్న చోట కూడా ఇబ్బంది పడకుండా ముందుకువెళ్లింది.

దాని శరీర బరువులో 91 శాతం బరువున్న పేలోడ్‌ను కూడా మోసుకుంటూ వెళ్లింది’అని దాని రూపకర్తలు చెప్పారు. ఈ రోబో ఎలుక దానికి అప్పగించిన అన్ని పనులను చురుగ్గా చేసిందంటూ వారు హర్షం వ్యక్తంచేశారు. 220 గ్రాముల బరువున్న ఈ ఎలుక దాదాపు 200 గ్రాముల బరువును మోసుకెళ్లిందన్నారు. 

మనుషులు వెళ్లలేని చోటికి... 
దీని సాంకేతికతను మరింత అభివృద్ధి చేసి విపత్తులు సంభవించిన చోట శిథిలాల్లో చిక్కుకున్న వారిని గుర్తించేందుకు, మనుషులు వెళ్లేందుకు క్లిష్టంగా ఉన్న ప్రాంతాల్లో గాలింపుచర్యలు చేపట్టడానికి దోహదపడుతుందని పరిశోధకులు చెబుతున్నారు. అలాగే పరిశోధనల కోసం కూ డా దీన్ని వాడొచ్చని అంటున్నారు. తొలుత చ క్రాలతో దీన్ని రూపొందించగా, తర్వాత మరిం త చురుగ్గా కదిలేందుకు కాళ్లు అమర్చారు.   

మరిన్ని వార్తలు