Omicron Antibodies: ఒమిక్రాన్‌ను అడ్డుకునే యాంటీబాడీల గుర్తింపు

30 Dec, 2021 04:34 IST|Sakshi

వైరస్‌ స్పైక్‌ప్రొటీన్‌పై దాడి చేసే సొట్రోవిమాబ్‌

వాషింగ్టన్‌: కరోనా ఒమిక్రాన్‌ వేరియంట్‌ను అడ్డుకునే యాంటీబాడీలను శాస్త్రవేత్తలు గుర్తించారు. వైరస్‌ శరీరంలో ఉత్పరివర్తనాలు చెందినా మారని భాగాలపై ఈ యాంటీబాడీలు పనిచేస్తాయని తెలిపారు. జర్నల్‌ నేచర్‌లో ఈ పరిశోధన వివరాలు ప్రచురితమయ్యాయి. ఈ వివరాలు భవిష్యత్‌లో వచ్చే వేరియంట్లను అడ్డుకునే టీకాల తయారీకి, చికిత్సకు ఉపయోగపడతాయని పరిశోధకులు భావిస్తున్నారు.

స్పైక్‌ ప్రోటీన్‌లో అత్యధిక రక్షణ మధ్య ఉండే ప్రాంతాలను ఈ యాంటీబాడీలు లక్ష్యంగా చేసుకుంటాయని, అందువల్ల వైరస్‌ ఎంత మ్యుటేషన్‌ చెందినా వీటి పనితీరును అడ్డుకోలేదని ప్రొఫెసర్‌ డేవిడ్‌ వీజ్లర్‌ వివరించారు. ప్రస్తుతం అందుబాటులో ఉన్న యాంటీబాడీ చికిత్సలో వాడే యాంటీబాడీలను పరిశోధకులు విశ్లేషించారు. వీటిలో సొట్రోవిమాబ్‌ అనే యాంటీబాడీ ఒమిక్రాన్‌ వేరియంట్‌ నుంచి రక్షణ కల్పిస్తుందని, ఒమిక్రాన్‌ వేరియంట్‌ ప్రభావాన్ని 3 రెట్లు అధికంగా తగ్గిస్తుందని  గుర్తించారు.

అదేవిధంగా గత వేరియంట్లకు వ్యతిరేకంగా ఉత్పత్తైన యాంటీబాడీల్లో నాలుగు తరగతులకు చెందిన యాంటీబాడీలు ఒమిక్రాన్‌ను అడ్డుకునే సామర్ధ్యంతో ఉన్నట్లు పరిశోధనలో తేలింది. ఈ యాంటీబాడీలు కేవలం కరోనా వేరస్‌ కాకుండా సార్బెకోవైరస్‌ జాతి వైరస్‌లన్నింటి స్పైక్‌ప్రొటీన్లపై ప్రభావం చూపుతున్నట్లు తెలిసింది. అలాగే ఇవి ప్రభావం చూపే ప్రాంతం స్పైక్‌ ప్రొటీన్‌లో సంరక్షిత ప్రాంతమని, ఇది మ్యుటేషన్లతో మారదని, అందువల్ల వైరస్‌ ఎన్ని మ్యుటేషన్లు చెందినా ఈ యాంటీ బాడీలు అడ్డుకుంటాయని వీజ్లర్‌ వివరించారు.

అలాగే ఒక్క డోసు టీకా తీసుకున్నవారి కన్నా రెండు డోసులు టీకా తీసుకున్నవారిలో ఒమిక్రాన్‌కు వ్యతిరేకంగా టీకా శక్తి తరుగుదల ఐదురెట్లు తక్కువని పరిశోధనలో గుర్తించారు. వీరితో పోలిస్తే బూస్టర్‌ డోసు తీసుకున్నవారిలో టీకాల సామర్ధ్యం తగ్గడం మరింత తక్కువని తెలిసింది. అందువల్ల బూస్టర్‌ డోసు ఒమిక్రాన్‌ నిరోధంలో కీలకపాత్ర పోషిస్తుందని వీజ్లర్‌ అభిప్రాయపడ్డారు.  

పరిశోధన ఇలా సాగింది...
తాజాగా ఉద్భవించిన ఒమిక్రాన్‌ వేరియంట్‌ స్పైక్‌ ప్రొటీన్‌లో 37 ఉత్పరివర్తనాలను గుర్తించారు. ఈ స్పైక్‌ ప్రొటీన్‌ ఆధారంగానే వైరస్‌ మానవ కణాల్లోకి వెళ్లగలుగుతుంది. అధిక మ్యుటేషన్ల కారణంగానే ఒమిక్రాన్‌ వేరియంట్‌ వేగంగా వ్యాపించడంతో పాటు రోగనిరోధకతను సైతం తట్టుకుంటోంది. స్పైక్‌ ప్రొటీన్‌లో వచ్చిన మార్పులు ఒమిక్రాన్‌కు ఇంత శక్తిని ఎలా ఇవ్వగలుగుతున్నాయనే అంశంపై పరిశోధన చేశామని వీజ్లర్‌ చెప్పారు. ఇందుకోసం కృత్తిమంగా స్పైక్‌ ప్రొటీన్లను ఉత్పత్తి చేసే సామర్ధ్యం గల ఒక ప్రభావ రహిత వైరస్‌(మిధ్యావైరస్‌)ను సృష్టించారు. ఈ సూడో వైరస్‌ స్పైక్‌ ప్రొటీన్లు ఏవిధంగా మానవ శరీర కణాలకు అతుకుంటున్నాయో, ఎలా కణాల్లోకి వెళ్లేందుకు ఉపయోగపడుతున్నాయో పరిశీలించారు.

మానవ శరీర కణాలపై ఉండే ఏసీఈ2 రిసెప్టార్‌ ప్రొటీన్‌కు ఈ స్పైక్‌ప్రొటీన్స్‌ అతుక్కోవడం ద్వారా వైరస్‌ను కణాల్లోకి పంపుతాయి. ఒమిక్రాన్‌ వేరియంట్‌ గత వేరియంట్ల కన్నా 2.4 రెట్లు అధిక సామర్ధ్యంతో ఏసీఈ2 ప్రోటీన్‌ రిసెప్టార్‌ను అతుక్కోగలదని పరిశోధనలో తేలింది. దీనివల్లనే ఒమిక్రాన్‌ వ్యాప్తి అంత వేగంగా ఉందని వీజ్లర్‌ తెలిపారు. ఒమిక్రాన్‌ వేరియంట్‌ స్పైక్‌ ప్రొటీన్‌కు కేవలం మానవ శరీర కణాలనే కాకుండా ఎలుక కణాల్లోని ఏసీఈ2 రిసెప్టార్‌తో అతుకునే సామర్ధ్యం ఉందని పరిశీలనలో గుర్తించారు. అంటే ఒమిక్రాన్‌ వేరియంట్‌ మనిషితో పాటు ఇతర క్షీరదాలకు కూడా సోకే ఛాన్సులున్నాయని తెలుసుకున్నారు.

మరిన్ని వార్తలు