వైరస్‌ కణాల చిత్రాలు విడుదల

13 Sep, 2020 19:46 IST|Sakshi
ఫోటో కర్టసీ : న్యూ ఇంగ్లండ్‌ జర్నల్‌ ఆఫ్‌ మెడిసిన్‌

మాస్క్‌ ప్రాధాన్యం వెల్లడించిన శాస్త్రవేత్తలు

న్యూయార్క్‌ : కరోనా వైరస్‌ సోకిన శ్వాసకోశ కణాల ఫోటోలను శాస్త్రవేత్తలు ప్రచురించారు. ఊపిరితిత్తుల లోపల కణాల్లోకి వైరస్‌ కణాలు ఏ మేరకు చొచ్చుకుపోయి వ్యాధి కారక కణాలను ప్రేరేపించిందీ ఈ చిత్రాల్లో గుర్తించారు. శ్వాసకోశ మార్గంలో ఎంతటి తీవ్రతతో సార్స్‌-కోవ్‌-2 ఇన్ఫెక్షన్‌ వ్యాప్తిస్తుందనేది సులభంగా అర్ధమయ్యేలా పరిశోధకులు ఈ చిత్రాలను విడుదల చేశారు. మావన శ్వాసనాళాల్లో పెద్దసంఖ్యలో వైరస్‌ కణాలు శరీరమంతటా వ్యాపించడంతో పాటు ఇతరులకూ సంక్రమించేందుకు సిద్ధంగా ఉన్న పరిస్థితి ఈ చిత్రాల్లో పరిశోధకులు కళ్లకు కట్టారు. ఈ పరిశోధనలో శాస్త్రవేత్తలు మానవ శ్వాసనాళాల్లో కరోనా వైరస్‌ను ప్రవేశపెట్టి 96 గంటల తర్వాత అత్యంత శక్తివంతమైన స్కానింగ్‌ ఎలక్ర్టాన్‌ మైక్రోస్కోపీ ద్వారా పరిశీలించారు.

న్యూ ఇంగ్లండ్‌ జర్నల్‌ ఆఫ్‌ మెడిసిన్‌లో ఈ చిత్రాలు ప్రచురితమయ్యాయి. తిరిగి రంగులద్దిన ఈ చిత్రాలు శ్వాసకోశ నాళాల్లో వైరస్‌కు గురైన వెంట్రుకల మాదిరి ఉన్న కణాలను చూపుతున్నాయి. ఈ కణాలు శ్లేష్మంతో పాటు వైరస్‌లను ఊపిరితిత్తుల నుంచి ఇతర భాగాలకు వ్యాపింపచేస్తాయని శాస్త్రవేత్తలు వివరించారు. అధిక శక్తితో కూడిన మాగ్నిఫికేషన్‌ వాడుతూ మానవ శ్వాసకోశంలో తయారైన కోవిడ్‌-19 నిర్మాణం, తీవ్రతను పరిశోధకులు వెల్లడించారు. అతిథేయ కణాల్లో శ్వాసకోశ ఉపరితలాలపై పూర్తిగా గూడుకట్టుకుని ఉన్న వైరస్‌ కణాలివని పరిశోధకులు పేర్కొన్నారు. కోవిడ్‌-19 సంక్రమణను అడ్డుకునేందుకు మాస్క్‌లు తప్పనిసరిగా వాడాలని ఈ చిత్రాల ద్వారా విస్పష్టంగా వెల్లడవుతోందని పరిశోధకులు స్పష్టం చేశారు.

మరిన్ని వార్తలు