Nuclear Fusion Energy: అతి చేరువలో అంతులేని శక్తి

11 Feb, 2022 04:57 IST|Sakshi

అణు సంయోగంలో రికార్డు శక్తి ఉత్పాదన  

అణు సంయోగంలో దాగున్న అంతులేని శక్తిని సరిగా వినియోగించుకుంటే మానవాళి ఇంధనావసరాలన్నీ ఇట్టే తీరిపోతాయి. కానీ న్యూక్లియర్‌ ఫ్యూజన్‌ (అణు సంయోగం) క్లిష్టమైన, ఖర్చుతో కూడిన ప్రక్రియ. అందువల్లే ఇంతవరకు దీన్ని ప్రత్యామ్నాయ ఇంధన వనరుగా ఉపయోగించేందుకు భారీ యత్నాలు జరగలేదు. తాజాగా యూరప్‌ శాస్త్రవేత్తలు చేసిన ఒక ప్రయోగం ఫ్యూజన్‌పై ఆశలు రేకెత్తిస్తోంది.

త్వరలో శిలాజ ఇంధనాల స్థానంలో ఫ్యూజన్‌తో ఉత్పత్తిచేసే ఇంధనాన్ని విరివిగా వాడుకోవచ్చని సైంటిస్టులు అభిప్రాయపడుతున్నారు. గతేడాది చివరలో జరిపిన నూతన ప్రయోగ ఫలితాలను యూకే అణు ఇంధన శాఖ బుధవారం ప్రకటించింది. జేఈటీ (జాయింట్‌ యూరోపియన్‌ టోరస్‌)లోని అణురియాక్టర్‌లో ఫ్యూజన్‌ ద్వారా ఐదు సెకండ్ల కాలంలో 59 మెగా జౌల్స్‌ ఉష్ణ శక్తి విడుదలైందని తెలిపింది. ఇది ప్రపంచ రికార్డు.

1997లో ఇలాంటి ప్రయోగంలో విడుదలైన ఉష్ణ శక్తి కన్నా ఇది చాలా అధికం. ఐదు సెకన్ల కాలపరిమితిని క్రమంగా పెంచుకోగలిగితే ప్రపంచ ఇంధన కష్టాలు గట్టెక్కుతాయని సైంటిస్టు టోనీ డన్‌ చెప్పారు. ఈ ప్రయోగంలో ఎలాంటి శిలాజ ఇంధనాల వాడకం, ఉత్పత్తి జరగలేదన్నారు. దీంతో ఇది అత్యంత పర్యావరణ హితమైన ఇంధన మార్గంగా ఉపయోగపడనుంది. నక్షత్రాల్లో శక్తికి ఈ అణు సంయోగమే కారణం. హైడ్రోజన్‌ బాంబ్‌ కూడా ఈ సంయోగంపై ఆధారపడి పనిచేస్తుంది.

అణు విచ్ఛిత్తికి వ్యతిరేకంగా ఫ్యూజన్‌లో పరమాణువులు (ఆటమ్స్‌)ను సంయోగపరుస్తారు. దీంతో శక్తి విడుదలవుతుంది. ఇలా విడుదలైన శక్తిని నిల్వ చేయడం, ఉపయోగించుకోవడం అతిపెద్ద సవాలు. సంయోగ ప్రక్రియ జరిపే రియాక్టర్‌ మధ్య భాగంలో దాదాపు సూర్యుడి వద్ద ఉన్నంత వేడి ఉంటుంది. ఈ సవాలును అధిగమించేందుకు సైంటిస్టులు యత్నిస్తున్నారు. వచ్చే కొన్ని సంవత్సరాల్లో ఫ్యూజన్‌ ఎనర్జీ మానవాళికి అందుబాటులోకి వస్తుందని అంచనా.  

– నేషనల్‌ డెస్క్, సాక్షి 

మరిన్ని వార్తలు