జాబిల్లిపై పచ్చదనం!

14 May, 2022 06:22 IST|Sakshi

చంద్ర మృత్తికలో మొలకెత్తిన విత్తనాలు

ఫ్లోరిడా శాస్త్రవేత్తల ప్రయోగాల్లో అరుదైన పురోగతి 

చందురిడిపై ఏరువాక సాగే రోజులు దగ్గరపడుతున్నాయి. పోషకాలు లేని చందమామ మృత్తికలో మొక్కలు పెరగవన్న అంచనాలను పటాపంచలు చేసే ప్రయోగాన్ని అమెరికా సైంటిస్టులు నిర్వహించారు. దీంతో భవిష్యత్‌లో చంద్రునిపై నివాసానికి ప్రధాన అడ్డంకి తొలగినట్లేనని భావిస్తున్నారు.

వాషింగ్టన్‌: జాబిల్లిపై ప్రయోగాల్లో అమెరికా శాస్త్రవేత్తలు కీలక ముందడుగు వేశారు. 50 ఏళ్ల క్రితం చంద్రుడిపై నుంచి తీసుకువచ్చిన మట్టిలో మొదటిసారిగా ఫ్లోరిడా యూనివర్సిటీకి చెందిన శాస్త్రవేత్తలు మొక్కలు పెంచి చూపించారు. దీంతో  చంద్రుడిపై వ్యవసాయం చేయడం సాధ్యమేనన్న విశ్వాసం కలిగిందని అంతరిక్ష పరిశోధనా సంస్థ (నాసా) వెల్లడించింది. మొదటిసారి ప్రయోగాత్మకంగా ఆఫ్రికా, యురేషియాల్లో లభించే ఆవాలు, కాలీఫ్లవర్‌ జాతికి చెందిన అరబిడోప్సిస్‌ థాలియానా మొక్కల్ని చంద్ర మృత్తికలో పెంచారు. ఈ మొక్కలకి సహజంగా చాలా త్వరగా పెరిగే గుణం ఉంటుందని వాటిని ఎంపిక చేసుకున్నట్టుగా నాసా అడ్మినిస్ట్రేటర్‌ బిల్‌ నెల్సన్‌ చెప్పారు. వీరి అధ్యయనం వివరాలను జర్నల్‌ కమ్యూనికషన్స్‌ బయాలజీ ప్రచురించింది.  

మొక్కల్ని ఇలా పెంచారు..  
మొక్కలు పెంచాలంటే పోషకాలతో కూడిన మట్టి, సూర్యరశ్మి, నీళ్లు, బ్యాక్టీరియా వంటివెన్నో ఉండాలి.చంద్రుడి నుంచి అపోలో మిషన్‌ 11, 12, 17 సమయంలో మట్టిని తీసుకువచ్చి 50 ఏళ్లకుపైగా అయింది. ఈ మట్టిలో మొక్కల్ని పెంచాలంటే అత్యంత కష్టమైన విషయమే. చంద్రుడిపై మట్టికి, భూమిపై లభించే మట్టి మధ్య చాలా తేడాలుంటాయి. ముఖ్యంగా చంద్రుడి నుంచి తెచ్చిన మట్టిలో పోషక విలువలు కాగడా వేసి చూసినా కనిపించవు.

సహజసిద్ధంగా మట్టిలో ఎరువులుగా పని చేసే కీటకాలు, బ్యాక్టీరియా, తేమ ఉండవు. అందుకే ఇందులో మొక్కలు పెంచడాన్ని ఒక సవాల్‌ తీసుకున్నారు. అతి చిన్న కుండీలను తీసుకొని చంద్రుడి మట్టి ఒక్కో గ్రాము వేశారు. అందులో నీళ్లు పోసి విత్తనాలు నాటారు. వాటిని ఒక గదిలో టెర్రారియమ్‌ బాక్సుల్లో ఉంచారు. ప్రతీ రోజూ వాటిలో పోషకాలు వేస్తూ వచ్చారు. రెండు రోజుల్లోనే ఆ విత్తనాలు మొలకెత్తడంతో శాస్త్రవేత్తలు సంభ్రమాశ్చర్యాలకు లోనయ్యారు. ఆరు రోజుల్లో అవి ఎదిగి పచ్చగా కంటికి ఆహ్లాదాన్నిచ్చాయని హార్టీకల్చర్‌ శాస్త్రవేత్త అన్నా లిసా పాల్‌ చెప్పారు.  

ఎలా పెరిగాయి?  
చంద్రుడిపై వ్యవసాయానికి వీలు కుదురుతుందా ? భవిష్యత్‌లో చంద్రుడిపై పరిశోధనల కోసం మరిన్ని రోజులు వ్యోమగాములు గడపాలంటే వారికి కావల్సిన పంటలు అక్కడ పండించుకోవడం సాధ్యమేనా? అన్న దిశగా శాస్త్రవేత్తలు ప్రయోగాలు చేశారు. ఇందులో చంద్రుడి మట్టిలో వ్యవసాయం సాధ్యమేనని తేలింది. అయితే ఈ మొక్కలు భూమిపై పెరిగినంత బలంగా, ఏపుగా పెరగలేదు.

విత్తనాలు వేసిన 20 రోజుల తర్వాత ఆ మొక్కల జన్యుక్రమాన్ని విశ్లేషించే ఆర్‌ఎన్‌ఏ పరీక్షలు చేశారు. ఆ మొక్కలు కాస్త ఒత్తిడి మధ్య పెరిగినట్టు ఆ పరీక్షల్లో తేలింది.  అలాగే ఎక్కువ వయసున్న చంద్ర మృత్తికలో కన్నా తక్కువ వయసున్న చంద్ర మృత్తికలో మొక్కలు తక్కువ ఒత్తిడి ఎదుర్కొన్నాయి. ఏదైతేనేం, చంద్రుడి మట్టిలో విత్తనాలు వేస్తే మొలకెత్తడం విశేషంగా చెప్పుకోవాలి. ఈ పరిశోధన భవిష్యత్‌లో మరిన్ని ప్రయోగాలు చేయడానికి బాటలు వేస్తుందని శాస్త్రవేత్తలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

మరిన్ని వార్తలు