వేడి, ఒత్తిళ్లను గుర్తించే సెన్సర్లు.. ఆవిష్కరణకు వైద్యశాస్త్ర నోబెల్‌ 

5 Oct, 2021 03:28 IST|Sakshi
వైద్యశాస్త్రంలో నోబెల్‌ విజేతల పేర్లు ప్రకటిస్తున్న నోబెట్‌ కమిటీ సెక్రటరీ థామస్‌ పెర్ల్‌మన్‌ 

గదిలో మాంచి నిద్రలో ఉన్నారు... అకస్మాత్తుగా వర్షం పడటం మొదలైంది... వాతావరణం చల్లబడింది... కళ్లు కూడా తెరవకుండా.. చేతులు దుప్పటిని వెతుకుతున్నాయి.. ముసుగేసుకోగానే... చుట్టేసిన వెచ్చదనంతో తెల్లవారి పోయింది! కాళ్లకు చెప్పుల్లేకుండా ఆరు బయట పచ్చిక బయల్లో నడుస్తున్నారు... కాళ్ల కింద నలిగిపోతున్న చిన్న గడ్డిపోచ కూడా మీకు స్పష్టంగా తెలుస్తూ ఉంటుంది... చర్మాన్ని తాక్కుంటూ వెళ్లిపోతున్న పిల్లగాలిని ఆస్వాదిస్తూంటారు... రాత్రి అయితే చల్లదనాన్ని.. పగలైతే ఎండ వేడి.. తెలిసిపోతూంటాయి! 

మామూలుగానైతే వీటి గురించి మనం అసలు ఆలోచించం. కానీ... వేడి, ఒత్తిడి వంటి స్పర్శానుభూతులను మనం ఎలా పొందుతామన్న విషయంపై యుగాలుగా శాస్త్రవేత్తలు ఆలోచనలు చేస్తున్నారు. కొత్త కొత్త విషయాలను తెలుసుకుంటున్నారు కూడా. ఇదే క్రమంలో మన నాడి కొసళ్లలో ఉండే అతిసూక్ష్మమైన సెన్సర్లు వేడిని... శరీరంలోని ప్రత్యేకమైన సెన్సర్లు ఒత్తిడిని గుర్తిస్తాయని ప్రపంచానికి తెలిపిన శాస్త్రవేత్తలు డేవిడ్‌ జూలియస్, ఆర్డెమ్‌ పటాపౌటేయిన్‌లు ఈ ఏడాది ప్రతిష్టాత్మక వైద్యశాస్త్ర నోబెల్‌ అవార్డు దక్కించుకున్నారు.

స్వీడన్‌లోని కారోలిన్‌స్కా ఇన్‌స్టిట్యూట్‌లో సోమవారం నోబెల్‌ అవార్డు కమిటీ ఈ విషయాన్ని ప్రకటించింది. త్వరలో ఒక ప్రత్యేక ఉత్సవంలో వీరికి ఈ అవార్డును అందజేయనున్నారు. వేడి, ఒత్తిడిలను శరీరం ఎలా పసిగడుతోందో తెలుసుకోవడం వల్ల వైద్యశాస్త్రంలో ఎన్నో ప్రయోజనాలు ఏర్పడ్డాయన్నది కొత్తగా చెప్పాల్సిన అవసరం లేని అంశం. 

మన చుట్టూ ఉన్న ప్రపంచాన్ని ఇంద్రియాల ద్వారా ఎలా అర్థం చేసుకోగలగుతున్నామన్న ప్రశ్న ఈ నాటిది కాదు. యుగాలనాటిదన్నా ఆశ్చర్యం లేదు. మిరపకాయలోని కాప్‌సేసన్‌ను ఉపయోగించడం ద్వారా ఈ ఏడాది వైద్యశాస్త్ర నోబెల్‌ అవార్డు గ్రహీతల్లో ఒకరైన డేవిడ్‌ జూలియస్‌ మన నాడుల చివర్లలో కొన్ని సెన్సర్ల వంటివి ఉంటాయని, ఇవి వేడి, మంట వంటి అనుభూతులను మెదడుకు చేరవేస్తాయని తెలుసుకోగలిగారు. ఆర్డెమ్‌ పటాపౌటేయిన్‌ ఒత్తిడిని గుర్తించే ప్రత్యేక కణాలను వాడి చర్మం, శరీరం లోపలి భాగాల్లోని ప్రత్యేక సెన్సర్లు యాంత్రిక ప్రేరణను ఎలా గుర్తిస్తాయో తెలుసుకున్నారు.  

17వ శతాబ్దపు తత్వవేత్త రెన్‌ డెకాట్‌ శరీరంలోని వివిధ భాగాలకు, మెదడుకు మధ్య పోగుల్లాంటివి ఉంటాయని.. వీటిద్వారానే వేడి వంటి అనుభూతులు మెదడుకు చేరతాయని ప్రతిపాదించారు.అయితే తరువాతి కాలంలో జరిగిన పరిశోధనలు మన చుట్టూ ఉన్న వాతావరణంలో వచ్చే మార్పులను పసిగట్టేందుకు ప్రత్యేకమైన ఇంద్రియ సంబంధిత న్యూరాన్ల ఉనికిని వెల్లడి చేశాయి. ఇలాంటి వేర్వేరు న్యూరాన్లను గుర్తించినందుకు జోసెఫ్‌ ఎర్లాంగర్, హెర్బెర్ట్‌ గాసెర్‌లకు 1944లో వైద్యశాస్త్ర నోబెల్‌ అవార్డు కూడా దక్కింది.

అప్పటి నుంచి ఇప్పటివరకూ వేర్వేరు ప్రేరణలను గుర్తించగల నాడీ కణాల గుర్తింపు.. వాటి ద్వారా మన పరిసరాలను అర్థం చేసుకునే విధానాలపై అనేక పరిశోధనలు కూడా జరిగాయి. మనం ముట్టుకునే వస్తువు నున్నగా లేదా గరుకుగా ఉందా తెలుసుకోగలగడం, నొప్పి పుట్టించే వేడి లేదా వెచ్చటి అనుభూతినిచ్చే ఉష్ణోగ్రతల మధ్య అంతరం ఈ ప్రత్యేక నాడీ కణాల ద్వారానే తెలుస్తాయన్నది అంచనా. అయితే వేడి, ఒత్తిడిలాంటి యాంత్రిక ప్రేరణ నాడీ వ్యవస్థలో ఏ విధంగా విద్యుత్‌ ప్రచోదనాలుగా మారతాయన్న ప్రశ్నకు మాత్రం ఇటీవలి కాలం వరకూ సమాధానం లభించలేదు. డేవిడ్‌ జూలియస్, ఆర్డెమ్‌ పటాపౌటేయిన్‌లు ఈ లోటును భర్తీ చేశారు. 

సెన్సర్ల గుట్టు తెలిసిందిలా.... 
1990ల చివరి ఏళ్లలో కాలిఫోర్నియా యూనివర్శిటీ శాస్త్రవేత్తగా డేవిడ్‌ జూలియస్‌ కాప్‌సేసన్‌ అనే రసాయనంపై పరిశోధనలు చేపట్టారు. ఇది నాడీ కణాలను చైతన్యవంతం చేస్తున్నట్లు అప్పటికే తెలుసు. కానీ ఎలా అన్నది మాత్రం అస్పష్టం. డేవిడ్‌ తన సహచరులతో కలిసి కాప్‌సేసన్‌ తాలూకూ డీఎన్‌ఏ పోగులను లక్షల సంఖ్యలో సిద్ధం చేశారు. ఇవన్నీ నొప్పి, వేడి, స్పర్శ వంటి వాటికి మన సెన్సరీ న్యూరాన్లలోని జన్యువులను ఉత్తేజపరిచేవే.

తాము సిద్ధం చేసిన డీఎన్‌ఏ పోగుల్లో కొన్ని కాప్‌సేసన్‌కు స్పందించగల ప్రొటీన్‌ను ఉత్పత్తి చేస్తూండవచ్చునని డేవిడ్‌ అంచనా వేశారు. మానవ కణాలపై ప్రయోగాలు చేసి కాప్‌సేసన్‌కు స్పందించని జన్యువును గుర్తించగలిగారు. మరిన్ని పరిశోధనలు చేపట్టిప్పుడు ఈ జన్యువు ఒక వినూత్నమైన ఐయాన్‌ ఛానల్‌ ప్రొటీన్‌ తయారీకి  కారణమవుతున్నట్లు తెలిసింది. దీనికి టీఆర్‌పీవీ1 అని పేరు పెట్టారు.

ఈ ప్రొటీన్‌ వేడికి బాగా స్పందిస్తూ చైతన్యవంతం అవుతున్నట్లు తెలియడంతో వేడి తదితరాలను గుర్తించేందుకు శరీరంలో ప్రత్యేకమైన సెన్సర్ల వంటివి ఉన్నట్లు స్పష్టమైంది. ఈ ఆవిష్కరణ కాస్తా శరీరంలో ఇలాంటి సెన్సర్లు మరిన్ని ఉన్నాయన్న విషయాన్ని తెలుసుకునేందుకు ఉపయోగపడింది. మెంథాల్‌ ద్వారా టీఆర్‌పీఎం8ను గుర్తించారు. ఈ రెండింటికి సంబంధించిన అదనపు అయాన్‌ ఛానళ్లు ఉష్ణోగ్రతల్లో తేడాలకు అనుగుణంగా చైతన్యవంతం అవుతున్నట్లు తెలిసింది.  
– నేషనల్‌ డెస్క్, సాక్షి

మరిన్ని వార్తలు