పీరియడ్‌ పావర్టీ నిర్మూలన: శానిటరీ ప్యాడ్లు ఫ్రీగా అందిస్తున్న తొలి దేశం ఏదో తెలుసా?

15 Aug, 2022 12:57 IST|Sakshi

పీరియడ్ పావర్టీ.. చాలా దేశాలను పట్టి పీడిస్తున్న సమస్య. ఆర్థికంతో ముడిపడిన విషయం కావడంతో.. చాలామంది పీరియడ్స్‌ ప్రొడక్టులకు దూరంగా ఉంటూ వస్తున్నారు. అక్కడిదాకా ఎందుకు.. అసలు వాటి గురించి అవగాహన, మాట్లాడేందుకు మొహమాటం ప్రదర్శించే పరిస్థితులు ఇంకా కొనసాగుతున్నాయి. అయితే మహిళలకు నెలసరి విషయంలో పరిశుభ్రత పాటించకపోతే.. ఇబ్బందులు, అనారోగ్యాలు ఎదురవుతాయి. అంతేకాదు దీర్ఘకాలికంగా ఆరోగ్యంపై ప్రభావం కూడా చూపిస్తుంది. అందుకే రుతుక్రమ విషయంలో ఓ అడుగు ముందుకు వేసి.. పీరియడ్‌ ప్రొడక్టులను ఉచితంగా అందిస్తున్న​ తొలి ప్రపంచ దేశంగా నిలిచింది స్కాట్లాండ్‌.

ఎడిన్‌బర్గ్‌: అవును.. యూరోపియన్‌ దేశం స్కాట్లాండ్‌ ఇవాళ్టి(ఆగష్టు 15వ తేదీ) నుంచి దేశం మొత్తం పీరియడ్‌ ప్రొడక్టులను ఉచితంగా అందిస్తోంది. తద్వారా ప్రపంచంలోనే ఈ చర్యకు ఉపక్రమించిన తొలి దేశంగా నిలిచింది. ఈ మేరకు ముందస్తుగా ఆదివారమే ఓ ప్రకటన చేసింది స్కాట్లాండ్‌ ప్రభుత్వం. 

స్కాట్లాండ్‌ ఉచిత పీరియడ్‌ ప్రొడక్ట్స్‌ చట్టం 2020లోనే తెర మీదకు వచ్చింది. శానిటరీ ఉత్పత్తులతో పాటు టాంపన్స్‌, శానిటరీ ప్యాడ్స్‌ను సైతం బహిరంగ ప్రదేశాల్లో ఉచితంగా అందుబాటులో ఉంచాలని అక్కడి ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు నవంబర్‌ 2020లో స్కాటిష్‌ పార్లమెంట్‌ ఏకగ్రీవంగా చట్టానికి ఆమోదం కూడా వేసింది. అయితే.. 

విద్యార్థులు, ఉపాధ్యాయులకు రుసుము లేకుండా శానిటరీ ఉత్పత్తులు ఇప్పటికే అందించబడ్డాయి, అయితే ఇప్పుడు బిల్లు.. ప్రతి ఒక్కరికీ అందుబాటులో ఉండేలా చూసుకునే బాధ్యత మంత్రులకు ఇచ్చింది. తద్వారా దేశంలో శానిటరీ ఉత్పత్తులు ఇకపై అందరికీ ఉచితంగా అందుబాటులోకి వస్తాయన్నమాట. అయితే ఈ చట్టం అంత ఈజీగా ఆచరణలోకి రాలేదు. చాలా పోరాటాలే జరిగాయి.

ఉచిత పీరియడ్‌ ఉత్పత్తులకు ప్రాప్యతను అందించడం సమానత్వం,  గౌరవానికి సంబంధించింది. వాటిని మహిళలు అంగీకరించడం ఆర్థిక అడ్డంకులను తొలగిస్తుంది అని సామాజిక న్యాయ కార్యదర్శి షోనా రాబిసన్‌ చెప్తున్నారు. జీవన వ్యయ సంక్షోభం కారణంగా ప్రజలు కష్టతరమైన ఎంపికలు చేస్తున్న సమయంలో.. ఇది(ఈ సమస్య) గతంలో కంటే ఇప్పుడు చాలా ముఖ్యమైందని, ప్రస్తుతం ఉన్న పరిస్థితుల ఆధారంగా పీరియడ్ ఉత్పత్తులకు ఎవరూ దూరంగా ఉండకూడదనే తమ ప్రభుత్వం ఉందని ఆమె తెలిపారు. 

ఇదీ చదవండి: బుజ్జి బుల్లిపిట్ట.. కానీ, నిలువెల్లా విషమే!
 

మరిన్ని వార్తలు