మట్టే బంగారమాయెనే.. 700 టన్నుల బంగారు నిక్షేపాలు

6 Dec, 2021 13:35 IST|Sakshi

థాయిలాండ్‌లో ప్రధాన వృత్తిగా మారిన బంగారు అన్వేషణ

పర్యాటకం తగ్గడంతో జీవనోపాధి కోసం కొత్త మార్గం

పూర్వీకుల బాటలో సాంప్రదాయ పద్ధతుల్లో తవ్వకాలు

Gold Become a Major Occupation In Thailand:  పర్యాటకానికి థాయిలాండ్‌ పెట్టింది పేరు. అందమైన నీలి మహాసముద్రాలు, వెచ్చని ఇసుక బీచ్‌లు, ఆసక్తికరమైన సంస్కృతి, ఆహ్లాదకరమైన వాతావరణం, స్పా సెంటర్లు, విదేశీయుల సాహస క్రీడలు, సినిమా షూటింగ్‌లు, పచ్చని ప్రకృతి అందాలతో కళకళలాడే థాయిలాండ్‌ కరోనా దెబ్బకి ఆ వైభవాన్ని కోల్పోయింది. నిత్యం విదేశీ పర్యాటకుల సేవలో తరించే స్థానిక ప్రజలు.. ఉపాధి కరువై నదులు, కాలువలు, చెలమల్లో నీటిలోని అవక్షేపాలను వడపోస్తూ కనిపిస్తున్నారు. తమ పూర్వీకుల బాటలో సాంప్రదాయ పద్ధతుల్లో బంగారు అన్వేషణను ఆదాయ వనరుగా మలుచుకుంటున్నారు.

గోల్డ్‌ మౌంటెన్‌.. 
థాయి దక్షిణ ప్రావిన్స్‌లో మలేసియా సరిహద్దులోని సుఖిరిన్‌ ప్రాంతాన్ని గోల్డ్‌ మౌంటెన్‌ (బంగారు పర్వతం)గా పిలుస్తారు. ఇక్కడి సై బురి నది పరీవాహక ప్రాంతం అపార బంగారు నిక్షేపాలతో మెరుస్తోంది. ఇంతకు ముందు టూరిస్ట్‌ గైడులుగా, పర్యాటకులకు స్థానిక వంటకాలను రూచి చూపిస్తూ ఆదాయాన్ని ఆర్జించిన స్థానికులు ఇప్పుడు గోల్డ్‌ ప్యానర్‌లుగా (బంగారు అన్వేషకులు) మారిపోతున్నారు. ఇందులో అధికంగా మహిళలు ఉండటం గమనార్హం. ఒకప్పుడు విదేశీ పర్యాటకుల రద్దీతో కయకింగ్‌ చేసే నదుల్లో ఇప్పుడు రోజుకు 300 మంది వరకు స్థానికులు బంగారాన్ని వెతుకుతున్నారు. చాలా ఏళ్లుగా బ్యాంగ్‌ సఫాన్‌ జిల్లా టాంబోన్‌ రాన్‌ థాంగ్‌ ప్రాంతం అత్యుత్తమ నాణ్యమైన బంగారాన్ని ఉత్పత్తి చేస్తుంది. అక్కడ బంగారం కోసం పాన్‌ చేసే విధానాన్ని చూడటానికి వచ్చిన పర్యాటకులు బంగారు ఆభరణాలను కొనుగోలు చేయడంతో భారీగా ఆదాయం వచ్చేది.

సగటున గ్రాము బంగారం సేకరణ..
రోజుకి ఒక కుటుంబం గంటల కొద్దీ నీటిలో అన్వేషణ చేస్తే ఒక గ్రాము బంగారు దొరుకుతుంది. ఒక గ్రాము బంగారాన్ని 1,500 బాత్‌లకు (ఒక బాత్‌ భారత కరెన్సీలో రూ.2.23) స్థానిక వ్యాపారులకు విక్రయిస్తున్నారు. ఈ దక్షిణ గ్రామాల నుంచి సేకరించిన బంగారాన్ని బ్యాంకాక్‌లో ఆభరణాల తయారీకి వినియోగిస్తారు. చాలా మంది పానింగ్‌పై ఆధారపడి తమ పిల్లల వివాహాలు, చదువులు, ఇళ్లు, ఆదాయాన్ని కూడబెట్టుకున్నారు. సై బూరి నదిలో బంగారం కోసం పడిగాపులు కాసేవారిలో రైతులు కూడా ఉన్నారు.

700 టన్నుల బంగారం..
థాయిలోని 31 ప్రావిన్స్‌ల్లో 76 చోట్ల 700 టన్నుల బంగారు నిక్షేపాలను కనుగొన్నారు. వీటి విలువ 900 బిలియన్ల నుంచి ఒక ట్రిలియన్‌ బాత్‌ ఉంటుంది. థాయిలాండ్‌ అంతటా ప్రవహించే అనేక నదులు, ప్రవాహాల్లో బంగారు నిక్షేపాలు పుష్కలంగా ఉన్నాయి.  బ్యాంగ్‌ సఫాన్‌ జిల్లాలో మే నుంచి డిసెంబర్, సుఖిరన్‌లో డిసెంబర్‌ నుంచి మార్చి వరకు ఈ అన్వేషణ ఎక్కువగా జరుగుతుంది. నదుల్లో నీటి మట్టం పెరిగినప్పుడు, తగ్గినప్పుడు ఎక్కువగా బంగారం దొరుకుతుంది. 

ఇప్పటికీ థాయిలాండ్‌లోని అనేక ప్రాంతాల నుంచి ప్రజలు బంగారం కోసం వాంగ్‌ నదికి తరలిరావడం గమనార్హం. ఇక్కడి బంగారు అన్వేషణకు నిర్ణీత రుసుముతో స్థానిక ప్రభుత్వం అనుమతులిస్తోంది. అపార నిధులను వెలికి తీసేందుకు భారీ వృక్ష సంపద అడ్డురావడంతో అక్కడి ప్రభుత్వం సాంప్రదాయ పద్ధతుల వైపే మొగ్గు చూపుతోంది.

పానింగ్‌ అంటే?
నదుల్లోని అడుగు భాగం నుంచి కంకర, ఇసుకతో కూడిన ఒండ్రు పదార్థాలను పైకి తీస్తారు. వాటిని ఒక గమేళ వంటి పాత్రలో వేసి రాళ్లు, ఇసుకను వేరు చేస్తారు. మిగిలిన దానిని పాత్రతో నీటిపై స్విర్లింగ్‌ మోషన్‌ (కుడి, ఎడమకు తిప్పుతూ)లో కడుగుతారు. ఈ క్రమంలో తేలికైన పదార్థం పాన్‌ పైభాగానికి తేలుతుంది. బరువైన బంగారు రేణువులు దిగువకు మునిగిపోతాయి. వీటిని గోల్డ్‌ డస్ట్‌ అని పిలుస్తారు. మరికొంతమంది నీటి అడుగు భాగంగా డైవింగ్‌ చేస్తూ భారీగా బంగారాన్ని సేకరిస్తారు.

మరిన్ని వార్తలు