గట్టెక్కిన ట్రంప్‌

15 Feb, 2021 05:04 IST|Sakshi
గతంలో అభిశంశన నుంచి బయటపడిన సమయంలో మాజీ అధ్యక్షుడు ట్రంప్‌

అభిశంసన నుంచి విముక్తి

సెనేట్‌లో వీగిపోయిన తీర్మానం

తీర్మానం నెగ్గడానికి తగ్గిన 10 ఓట్లు

ఏడుగురు రిపబ్లికన్లు అభిశంసనకు మద్దతు

వాషింగ్టన్‌: అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ రెండోసారి కూడా అభిశంసన నుంచి గట్టెక్కారు. జనవరి 6న క్యాపిటల్‌ భవనంపై దాడికి ప్రేరేపించారని అభియోగాలు ఎదుర్కొన్న ట్రంప్‌ సెనేట్‌లో శనివారం జరిగిన ఓటింగ్‌లో  57–43 ఓట్ల తేడాతో బయటపడ్డారు. అమెరికా చరిత్రలో మాయని మచ్చగా నిలిచిపోయి, అయిదుగురు ప్రాణాలను బలితీసుకున్న క్యాపిటల్‌ భవనం ముట్టడి హింసాత్మకంగా మారిన  ఘటనలో ట్రంప్‌ని దోషిగా నిలబెట్టడంలో డెమొక్రాట్లు విఫలమయ్యారు.

గద్దె దిగిపోయిన తర్వాత కూడా అభిశంసన ఎదుర్కొన్న మొదటి వ్యక్తి ట్రంప్, అంతే కాకుండా  రెండు సార్లు అభిశంసన ఎదుర్కొన్న అధ్యక్షుడు కూడా ట్రంప్‌ ఒక్కరే.  అధ్యక్షుడిగా ఆయన తన అధికారాలన్నీ దుర్వినియోగం చేస్తున్నారన్న అభియోగాలపై గత ఏడాది ప్రవేశపెట్టిన అభిశంసన నుంచి కూడా ట్రంప్‌ బయటపడ్డారు. ఒకవేళ ట్రంప్‌ అభిశంసనకు గురైతే ఆ తర్వాత ఆయనను భవిష్యత్‌ ఎన్నికల్లో ఎప్పుడూ పోటీ చేయడానికి వీల్లేకుండా తీర్మానం ఆమోదించాలని సెనేట్‌లో డెమొక్రాట్లు భావించారు. కానీ రిపబ్లికన్‌ పార్టీ వారికి సహకరించలేదు. అధ్యక్ష పదవి నుంచి ట్రంప్‌ దిగిపోయాక ఆయనపై అభిశంసన మోపడమే సరికాదని వాదించింది.

మొత్తం 100 మంది సభ్యులున్న సెనేట్‌లో రెండింట మూడో వంతు మెజారిటీ అంటే 67 ఓట్లు వస్తే ట్రంప్‌ అభిశంసనకు గురవుతారు. ఈ సారి సెనేట్‌లో రెండు పార్టీలకు చెరి సమానంగా 50 సీట్లు ఉన్నాయి. మరో ఏడుగురు రిపబ్లికన్‌ పార్టీ సభ్యులు అభిశంసనకి మద్దతునిచ్చారు. దీంతో అభిశంసనకు అనుకూలంగా 57 మంది, వ్యతిరేకంగా 43 మంది ఓటు వేశారు. 10 ఓట్లు తక్కువ రావడంతో ట్రంప్‌పై అభియోగాలన్నీ వీగిపోయాయి. సెనేట్‌లో విచారణ కేవలం అయిదు రోజుల్లోనే ముగిసిపోయింది. అభిశంసన విచారణకే రిపబ్లికన్‌ పార్టీ పెద్దగా సుముఖత వ్యక్తం చేయలేదు. క్యాపిటల్‌ భవనంపై దాడిని ఖండించినప్పటికీ, అధికారాన్ని వీడిన తర్వాత ట్రంప్‌పై విచారణ అక్కర్లేదని మొదట్నుంచి చెప్పిన ఆ పార్టీ వాదనలకి పెద్దగా ఆస్కారం లేకుండానే విచారణని ముగించింది.

ఇప్పుడే రాజకీయ ఉద్యమం మొదలైంది
సెనేట్‌లో అభిశంసన నుంచి బయటపడిన వెంటనే డొనాల్డ్‌ ట్రంప్‌ ఒక ప్రకటన విడుదల చేశారు. దేశంలో తనపై నిందలు మోపినట్టుగా మరే ఇతర అధ్యక్షుడిపైన జరగలేదని పేర్కొన్నారు. ఒక మంత్రగాడిని వేటాడినట్టుగా తన వెంట బడ్డారని దుయ్యబట్టారు. నిజం వైపు నిలబడి, న్యాయాన్ని కాపాడిన తన లాయర్లకు ధన్యవాదాలు తెలిపారు. తనను రాజకీయంగా కూడా సమాధి చెయ్యాలని డెమొక్రాట్లు భావించినప్పటికీ కుదరలేదని, అసలు ఇప్పుడే తన రాజకీయ ఉద్యమం  ప్రారంభమైందని ట్రంప్‌ అన్నారు. మేక్‌ అమెరికా గ్రేట్‌ అగైన్‌గా నిలబెట్టడమే తన ముందున్న కర్తవ్యమని స్పష్టం చేశారు.

రాజ్యాంగాన్ని ధిక్కరించారు
ట్రంప్‌పై అభిశంసన తీర్మానానికి వ్యతిరేకంగా ఓటు వేసిన రిపబ్లికన్‌ సభ్యులపై డెమొక్రాట్లు మండిపడ్డారు. అమెరికా ప్రజాస్వామ్యాన్ని దెబ్బ తీసిన వ్యక్తిని కాపాడడం వల్ల ఇప్పుడు సెనేట్‌ కూడా అపఖ్యాతి పాలైందని అన్నారు. ట్రంప్‌ని ద్రోహిగా నిలబెట్టలేకపోవడం ప్రజాస్వామ్య వ్యవస్థ నుంచి పారిపోవడమేనని స్పీకర్‌ నాన్సీ పెలోసి వ్యాఖ్యానించారు.

ప్రజాస్వామ్యానికే బీటలు
అమెరికాలో ప్రజాస్వామ్యం బీటలు వారిందని మరోసారి రుజువైందని అధ్యక్షుడు జో బైడెన్‌ అన్నారు. ప్రతీ అమెరికా పౌరుడికి నిజం వైపు నిలబడాల్సిన బాధ్యత ఉందని అన్నారు. అభిశంసన నుంచి ట్రంప్‌కి విముక్తి లభించిన వెంటనే బైడెన్‌ ఒక ప్రకటన విడుదల చేశారు. ‘అమెరికా చరిత్రలో ఇలాంటి విషాదకరమైన పరిస్థితి ఎప్పుడూ రాలేదు. మన దేశంలో హింసకి, తీవ్రవాదానికి స్థానం లేదు. అమెరికా పౌరులు, ముఖ్యంగా నాయకులందరూ నిజంవైపు నిలబడి అబద్ధాన్ని ఓడించాలి. అలా జరగకపోవడం వల్ల ప్రజాస్వామ్యం చెదిరిపోయిందని అర్థం అవుతోంది’’ అని బైడెన్‌ పేర్కొన్నారు.

మరిన్ని వార్తలు