ట్రంప్‌ అభిశంసనపై విచారణ మొదలు

11 Feb, 2021 03:55 IST|Sakshi

మద్దతునిచ్చిన ఆరుగురు రిపబ్లికన్‌ సెనేటర్లు  

వాషింగ్టన్‌:  అమెరికా చరిత్రలోనే తొలిసారిగా ఒక మాజీ అధ్యక్షుడి అభిశంసనపై సెనేట్‌లో విచారణ మొదలైంది. ట్రంప్‌పై విచారణ అర్ధరహితం అంటూ రిపబ్లికన్‌ పార్టీ చేసిన వాదన ఓటింగ్‌లో వీగిపోయింది. ట్రంప్‌పై అభిశంసన విచారణ రాజ్యాంగబద్ధమేనంటూ సెనేట్‌ 56–44 ఓట్ల తేడాతో విచారణకు ఓకే చెప్పింది. రిపబ్లికన్‌ పార్టీకి చెందిన ఆరుగురు సభ్యులు విచారణకు మద్దతు పలికారు. క్యాపిటల్‌ భవనంపై జరిగిన దాడి ఘటనలో ట్రంప్‌ని ముద్దాయిగా తేల్చడం, అలాంటి వ్యక్తికి రిపబ్లికన్లు కొమ్ము కాస్తున్నారని ప్రజల్లోకి తీసుకువెళ్లడం కోసమే డెమొక్రాట్లు అభిశంసన తీర్మానంపై విచారణకు పట్టుపట్టారు.

దీంతో రెండోసారి అభిశంసన ఎదుర్కొన్న అధ్యక్షుడిగా, పదవి నుంచి దిగిపోయాక అభిశంసన ఎదుర్కొన్న వ్యక్తిగా ట్రంప్‌ చరిత్రలో నిలిచిపోతారు. అభిశంసన తీర్మానం సెనేట్‌లో నెగ్గే అవకాశం లేదు. సెనేట్‌లో రెండింట మూడు వంతుల మెజార్టీ సభ్యులు అనుకూలంగా ఓటు వేస్తేనే తీర్మానం పాస్‌ అవుతుంది. అంటే 100 మంది సభ్యులున్న సభలో 67 మంది ఓట్లు వెయ్యాలి. రెండు పార్టీలకూ చెరి 50 మంది సభ్యుల బలం ఉంది. మరో ఆరుగురు రిపబ్లికన్లు అభిశంసనకు అనుకూలంగా ఉండడంతో 56 మంది అవుతారు. ప్రత్యేకమైన పరిస్థితుల్లో మాత్రమే సభ చైర్మన్‌ కమలా హ్యారిస్‌ తన ఓటు వినియోగించుకుంటారు. ఏది ఏమైనా 67 మంది సభ్యుల మద్దతు లభించే అవకాశాలైతే లేవు.  

క్యాపిటల్‌ భవనం దాడి వీడియోలే ఆయుధం
క్యాపిటల్‌పై దాడిని ట్రంప్‌ ప్రోత్సహించారన్న అభియోగాలపైనే అభిశంసన ప్రక్రియ కొనసాగుతుంది. సంబంధిత వీడియోలను వినియోగించాలని డెమొక్రాట్లు వ్యూహరచన చేస్తున్నారు. ఈ విచారణ సందర్భంగా ట్రంప్‌ ఆందోళనకారుల్ని ఎలా రెచ్చగొట్టారో వీడియోల ద్వారా సభ సాక్షిగా నిరూపించడానికి సభ్యులు కసరత్తు చేస్తున్నారు. ఈ దాడికి సంబంధించి ట్రంప్‌ని బోనులు పెట్టడమే లక్ష్యంగా తాము ముందుకు వెళతామని సెనేట్‌లో ఇంపీచ్‌మెంట్‌ మేనేజర్‌ జామీ రాస్కిన్‌ చెప్పారు. అభిశంసనపై వాదనలు వినిపించుకోవడానికి ఇరుపక్షాలకు 16 గంటల చొప్పున సమయం కేటాయిస్తారు. అనంతరం సెనేట్‌ సభ్యులకు ఇరుపక్షాల్ని ప్రశ్నించడానికి నాలుగు గంటల సమయం కేటాయిస్తారు. అది పూర్తయి చర్చలు జరిగాక అభిశంసనపై ఓటింగ్‌ ప్రక్రియ ఉంటుంది.

ట్రంప్‌ అభిశంసనపై మాట్లాడుతున్న హౌజ్‌ ఇంపీచ్‌మెంట్‌ మేనేజర్‌ జేమీ రస్కిన్‌

మరిన్ని వార్తలు