Shanghai Cooperation Organisation: అనుసంధానమే బలం

17 Sep, 2022 05:12 IST|Sakshi
ఎస్‌సీఓ సదస్సు సందర్భంగా జిన్‌పింగ్, పుతిన్‌ తదితర దేశాధినేతలతో మోదీ

ఎస్సీఓ సభ్యదేశాలకు మోదీ పిలుపు 

‘తయారీ’లో గ్లోబల్‌ హబ్‌గా భారత్‌

నవీన ఆవిష్కరణలకు ఊతం

70,000కు పైగా స్టార్టప్‌లు

మా అనుభవాలను వాడుకోండి

సప్లై చైన్లను అభివృద్ధి చేసుకుందాం

సమర్‌ఖండ్‌: షాంఘై కో–ఆపరేషన్‌ ఆర్గనైజేషన్‌ సభ్యదేశాల నడుమ అనుసంధానం మరింత పెరగాలని ప్రధాని నరేంద్ర మోదీ అభిలషించారు. లక్ష్యాల సాకారానికి మెరుగైన అనుసంధానం, రవాణా సదుపాయాల విషయంలో పరస్పరం పూర్తి హక్కులు కల్పించడం ముఖ్యమన్నారు. ఉజ్బెకిస్తాన్‌లోని సమర్‌ఖండ్‌లో శుక్రవారం ఎస్సీఓ శిఖరాగ్ర సదస్సులో మోదీ మాట్లాడారు.

కరోనా, ఉక్రెయిన్‌–రష్యా యుద్ధం దేశాలతో మధ్య రవాణా వ్యవస్థలు దెబ్బతిన్నాయని, ప్రపంచవ్యాప్తంగా ఇంధన, ఆహార కొరత ఏర్పడిందని గుర్తుచేశారు. అందుకే విశ్వసనీయమైన, ప్రభావవంతమైన, వైవిధ్యభరితమైన సప్లై చైన్లను అభివృద్ధికి సభ్యదేశాలన్నీ కృషి చేయాలన్నారు. ఈ ఏడాది భారత ఆర్థిక వ్యవస్థ ప్రపంచంలోనే అత్యధికంగా 7.5 శాతం వృద్ధి సాధించనున్నట్లు చెప్పారు. ఎస్సీఓ సభ్యదేశాల మధ్య మరింత సహకారం, పరస్పర విశ్వాసానికి భారత్‌ మద్దతు ఇస్తున్నట్లు తెలిపారు.  

తృణధాన్యాల సాగును ప్రోత్సహించాలి   
ప్రపంచదేశాల్లో ఆహార భద్రత సంక్షోభంలో పడిందని మోదీ ఆందోళన వ్యక్తం చేశారు. ‘‘దీనికి ఆచరణీయ పరిష్కారముంది. తృణధాన్యాల సాగును, వినియోగాన్ని భారీగా ప్రోత్సహించాలి. తృణధాన్యాల సాగు వేల ఏళ్లుగా ఉన్నదే. ఇవి చౌకైన సంప్రదాయ పోషకాహారం. మిల్లెట్‌ ఫుడ్‌ ఫెస్టివల్‌ నిర్వహించే అంశాన్ని పరిశీలించాలి’’ అన్నారు.

ప్రజలే కేంద్రంగా అభివృద్ధి మోడల్‌   
‘‘కరోనాతో ప్రపంచమంతటా ఆర్థిక వ్యవస్థలు కుదేలయ్యాయి. అవి తిరిగి కోలుకోవడంలో ఎస్సీఓ పాత్ర కీలకం’’ అని మోదీ అభిప్రాయపడ్డారు. ‘‘ప్రపంచ జీడీపీలో ఎస్సీఓ వాటా 30 శాతం. జనాభాలో 40 శాతం’’ అన్నారు. తయారీ రంగంలో భారత్‌ను గ్లోబల్‌ హబ్‌గా మార్చేందుకు కృషి చేస్తున్నామని చెప్పారు. ప్రతిభావంతులైన యువత వల్ల ఇండియా సహజంగానే ప్రపంచదేశాలకు పోటీదారుగా ఎదుగుతోందని హర్షం వ్యక్తం చేశారు. ఈ ఏడాది 7.5 శాతం వృద్ధితో ప్రపంచంలో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థల్లో అగ్రగామిగా ఎదగబోతున్నామని వివరించారు.

టెక్నాలజీని సక్రమంగా ఉపయోగించుకుంటున్నామని, తమ అభివృద్ధి మోడల్‌కు ప్రజలే కేంద్రమని తెలిపారు. ప్రతి రంగంలో నవీన ఆవిష్కరణలకు ఊతం ఇస్తున్నామని, ఇండియాలో ప్రస్తుతం 70,000కు పైగా స్టార్టప్‌లు పని చేస్తున్నాయని వెల్లడించారు. ఇందులో 100కు పైగా యూనికార్న్‌ కంపెనీలు ఉన్నాయన్నారు. ఇండియా సంపాదించిన అనుభవం ఎస్సీఓలోని ఇతర దేశాలు సైతం ఉపయోగించుకోవచ్చని అభిప్రాయపడ్డారు. స్టార్టప్‌లు, ఇన్నోవేషన్‌పై ప్రత్యేక వర్కింగ్‌ గ్రూప్‌ ఏర్పాటు చేయడం ద్వారా తమ అనుభవాన్ని ఇతర దేశాలతో పంచుకుంటామని చెప్పారు.

ప్రపంచానికి భారత్‌ గమ్యస్థానం  
మెడికల్, వెల్‌నెస్‌ టూరిజంలో ప్రపంచానికి భారత్‌ గమ్యస్థానంగా మారిందని మోదీ అన్నారు. తక్కువ ఖర్చుతో అత్యాధునిక వైద్యం తమదేశంలో పొందవచ్చని తెలిపారు.

ఇక భారత్‌ సారథ్యం
రొటేషన్‌ విధానంలో భాగంగా ఎనిమిది మంది సభ్యుల ఎస్‌సీఓ సారథ్యం ఉజ్బెకిస్తాన్‌ నుంచి భారత్‌ చేతికి వచ్చింది. 2023లో ఎన్‌సీఓ శిఖరాగ్రానికి భారత్‌ ఆతిథ్యమివ్వనుంది. ఈ విషయంలో భారత్‌కు అన్నివిధాలా సహకరిస్తామని ఉజ్బెక్‌ అధ్యక్షుడు షౌకట్‌ మిర్జియోయెవ్‌ చెప్పారు. ఆయనతో కూడా మోదీ భేటీ అయ్యారు.

పలకరింపుల్లేవ్‌.. కరచాలనాల్లేవ్‌
న్యూఢిల్లీ: ఉజ్బెకిస్తాన్‌లోని సమర్‌ఖండ్‌లో ఎస్‌సీవో సదస్సుకు హాజరైన భారత్‌ ప్రధాని మోదీ, చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్‌ ఎడమొహం పెడమొహంగా ఉన్నారు. శుక్రవారం ఒకే వేదికపైన ఫొటోల కోసం మిగతా నేతలతో కలిసి పక్కపక్కనే నిలబడిన సమయంలోనూ ఒకరినొకరు పట్టనట్లుగా వ్యవహరించారు. చిరునవ్వుతో పలకరించుకోలేదు. కరచాలనం చేసుకోలేదు. గల్వాన్‌ ఘటన అనంతరం ఇరుదేశాల మధ్య ఉద్రిక్తతలు కొనసాగుతుండటం తెలిసిందే. అప్పటినుంచి వారు ఒకే వేదికపైకి రావడం ఇదే మొదటిసారి.

అమెరికాపై జిన్‌పింగ్‌ విమర్శలు
‘‘కొన్ని శక్తులు ఇంకా ప్రచ్ఛన్న యుద్ధ భావజాలం, ఏకపక్ష పోకడలు ప్రదర్శిస్తున్నాయి. ఇండో–పసిఫిక్‌ ప్రాంతంలో సుస్థిరతను విచ్ఛిన్నం చేయజూస్తున్నాయి’’ అని అమెరికానుద్దేశించి చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్‌ విమర్శలు గుప్పించారు. వాటిపట్ల ఎస్‌సీఓ సభ్యదేశాలు జాగ్రత్తగా ఉండాలన్నారు. రక్షణ సహా అన్ని రంగాల్లో సహకారాన్ని మరింతగా పెంపొందించుకోవాలని పిలుపునిచ్చారు. ‘‘ఉగ్రవాద వ్యతిరేక ఆపరేషన్ల కోసం సభ్య దేశాలకు చెందిన 2,000 మంది సైనిక సిబ్బందికి చైనాలో శిక్షణ ఇస్తాం. ఉమ్మడి అభివృద్ధి బ్యాంకు ఏర్పాటు చేసుకుందాం’’ అంటూ ప్రతిపాదించారు. అత్యవసర పరిస్థితుల్లో ఆహార ధాన్యాలు తదితరాల కోసం వర్ధమాన దేశాలకు 105 కోట్ల డాలర్ల మేరకు సాయం అందిస్తామని ప్రకటించారు.

మరిన్ని వార్తలు