Lockdown In Shanghai: అసహనం.. ఆగ్రహం.. చివరకు​.. చంపేయంటూ షాంగై ప్రజల ఆర్తనాదాలు

11 Apr, 2022 14:34 IST|Sakshi

లాక్‌డౌన్‌ను భరించడానికి ప్రజలకు ఓ ఓపిక అంటూ ఉంటుంది. కరోనా తొలినాళ్లలో లాక్‌డౌన్‌తో భారత్‌ ఎలాంటి పరిస్థితి ఎదుర్కుందో చూశాం. అయితే కరోనా పుట్టినిల్లు చైనాలో మాత్రం ప్రజలు పట్టుమని పది, పదిహేను రోజులు కూడా భరించలేకపోతున్నారు. ​కారణం.. అత్యంత కఠినమైన లాక్‌డౌన్‌ అక్కడ అమలు అవుతోంది కాబట్టి. 

జీరో టోలరెన్స్‌ పేరిట చైనా అనుసరిస్తున్న వైఖరిపై తొలి నుంచి విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఆ మధ్య పేషెంట్లను కంటెయినర్‌లలో ఉంచి మానవ హక్కుల సంఘాల నుంచి సైతం విమర్శలు ఎదుర్కొంది డ్రాగన్‌ క్రంటీ. ఇప్పుడు దేశంలోనే..  ఆ మాటకొస్తే ప్రపంచంలోనే అతిపెద్ద నగరాల్లో ఒకటైన షాంగైను లాక్‌డౌన్‌తో దిగ్భంధించి.. జనజీవనాన్ని అగమ్య గోచరంగా తయారు చేస్తోంది అక్కడి ప్రభుత్వం. ఈ తీరుపైనా తీవ్రస్థాయిలో విమర్శలు వస్తున్నాయి.

దాదాపు మూడు కోట్ల దాకా జనాభా ఉన్న షాంగై నగరం లాక్‌డౌన్‌ కట్టడిలో ఉండిపోయింది. ఇంటికే పరిమితమైన జనాలు.. పిచ్చెక్కిపోయి కిటికీలు, బాల్కనీల గుండా ఆర్తనాదాలు పెడుతున్నారు.  ట్విటర్‌, ఇన్‌స్టా, ఇతర సోషల్‌ మీడియా నెట్‌వర్క్‌లలో ఇందుకు సంబంధించిన వీడియోలు వైరల్‌ అవుతున్నాయి. పరిస్థితి ఇలాగే కొనసాగితే.. చివరకు ఆకలి చావులు, ఆత్మహత్యల లాంటి విషాదాలే మిగులుతాయని నిపుణులు వాపోతున్నారు. 

యావో మింగ్‌ లె, యావో సీ(చావు బతుకుల) మధ్య ఉన్నమంటూ అపార్ట్‌మెంట్‌ల నుంచి కేకలు పెడుతున్నారు కొందరు. నిత్యావసరాలు దొరక్క.. ఆకలితో అలమటించిపోతున్నారు. ఇందుకు సంబంధించిన వీడియోలు ఇంటర్నెట్‌లో వైరల్‌ అవుతున్నాయి. అయితే 2019లో తొలి కరోనా కేసు వుహాన్‌ నుంచి వెలుగు చూశాక.. ఈ స్థాయిలో చైనా కరోనా కేసుల్ని ఎదుర్కొవడం ఇదే ప్రథమం. కరోనా వైరస్‌ ఒమిక్రాన్‌ వేరియెంట్‌ (బీఏ.2) బ్రేకింగ్‌పాయింట్‌ను దాటేయడంతోనే కరోనా కేసులు వెల్లువెత్తుతున్నాయి అక్కడ.

ఒక్క ఆదివారమే ఇక్కడ 25 వేల కేసులు నమోదు అయ్యాయట!. రికార్డు స్థాయిలో టెస్టుల వల్లే  ఈ ఫలితం కనిపిస్తోంది. ఈ తరుణంలో.. మరింత కఠినంగా లాక్‌డౌన్‌ను ముందుకు తీసుకెళ్లాలని అక్కడి అధికారులు భావిస్తున్నారు.  మరోవైపు సాయంలో కాస్త ఆలస్యమైనప్పటికీ.. సాయం మాత్రం అందుతూనే ఉందని అధికారులు అంటున్నారు. 

నిత్యం జనాలతో సందడిగా ఉండే షాంగై నగరం.. ఇప్పుడు ఎడారి వాతావరణంను తలపిస్తోంది. ఆరోగ్య సిబ్బంది, వలంటీర్లు, డెలివరీ బాయ్స్‌, ఆరోగ్యానికి సంబంధించిన సమస్యలు(అదీ అత్యవసరం అయితే తప్ప) ఇతరులకు బయట తిరిగేందుకు అనుమతి ఇవ్వడం లేదు. వైరస్‌ కట్టడికి జనాలు సహకరించాలని, ఏదైనా తేడా జరిగితే అమెరికా, ఇటలీ, బ్రిటన్‌ లాంటి పరిస్థితులు తప్పవని, కాబట్టి కష్టమైన కొంచెం సహకరించాలని ప్రజలను కోరుతున్నారు అక్కడి వైద్యాధికారులు. అయితే కేసులు ఎక్కువగా వస్తున్నా.. ప్రజావ్యతిరేక నిరసనల దృష్ట్యా మంగళవారం నుంచి కొన్ని ప్రాంతాల్లో సడలింపులు ఇవ్వాలని అధికారులు నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది.

సంబంధిత వార్త: కరోనా కోరల్లో చైనా.. ప్రపంచాన్ని నివ్వెరపరుస్తున్న దృశ్యాలు

మరిన్ని వార్తలు