చైనాలో కరోనా ఉధృతి...మళ్లీ అమలవుతున్న జీరో కోవిడ్‌ పాలసీ

24 Apr, 2022 18:43 IST|Sakshi

గత కొన్ని రోజులుగా చైనాలో కరోనా కేసులు అనూహ్యంగా నమోదవుతున్నాయి. కరోనా పుట్టినిల్లు అయినా చైనాని ఈ కొత్త కేసుల ఉధృతితో అతలాకుతులం చేస్తోంది. దీంతో చైనా కూడా కరోనా కట్టడి దిశగా కఠినమైన ఆంక్షలు అమలు చేస్తున్నప్పటికీ చైనా ఆర్థిక నగరమైన షాంఘైలో ఊహించని విధంగా కేసులు పెరిగిపోతున్నాయి.

ఒక్క శనివారమే సుమారు 21,796 కేసులు నమోదవ్వగా, 39 మరణాలు సంభవించాయి. అంతేకాదు చైనాలో పరిస్థితి చాలా భయనకంగా ఉందని, చైనాలో కొన్ని ప్రాంతాల్లో కరోనాకి సంబంధించిన కొత్త కేసులు వెలుగు చూశాయని బీజింగ్ సెంటర్ ఫర్ డిసీజ్ ప్రివెన్షన్ అండ్ కంట్రోల్ డిప్యూటీ డైరెక్టర్ పాంగ్ జింగ్‌హువో తెలిపారు. పైగా చైనాలో దేశవ్యాప్తంగా 29,531 మంది కరోనాకి సంబంధించిన చికిత్స పొందుతున్నారని నివేదిక పేర్కొంది.

ఓమిక్రాన్ వైరస్ ఆవిర్భావం తర్వాత గత నెల చివరిలో లాక్‌డౌన్‌ తదనంతరం నుంచి నగరంలో ఇప్పటివరకు మరణించిన వారి సంఖ్య 87కి చేరుకుంది. దీంతో 2019 డిసెంబర్‌లో వుహాన్‌లో మొదటిసారిగా కరోనా ఉద్భవించినప్పటి నుంచి చైనాలో సంభవించిన మొత్తం మరణాల సంఖ్య 4,725కు పెరిగింది.

కరోనా కట్టడిలో భాగంగా మెటల్‌ కంచెలు
చైనా స్థానిక ప్రభుత్వాలు ఈ కరోనా కట్టడిలో భాగంగా కేసులు ఎక్కువుగా నమోదవుతున్న ప్రాంతాల్లోని వీధుల్లో మెటల్‌ కంచెలు ఏర్పాటు చేశారు. చిన్న చిన్న వీధులు, అపార్ట్‌మెంట్ కాప్లెక్స్‌లో ప్రజలు బయటకు రాకుండా బారికేడ్‌లు ఏర్పాటు చేశారు. కేసులు ఎక్కువుగా ఉన్న ప్రాంతాల్లోని ప్రధాన రహదారుల్లో కూడా ఈ మెటల్‌ కంచెలు ఏర్పాటు చేశారు.

మరోవైపు ప్రజలు లాక్‌డౌన్‌ ఆంక్షలతో విసిగిపోయి ఆగ్రహంతో వీటిని ధ్వంసం చేస్తున్నారు. చైనా అ‍మలు చేస్తున్న ఈ కఠినమైన ఆంక్షల కారణంగా ప్రజలు నిత్వావసర వస్తువులు కొనుగోలు చేయడంలో ఇబ్బందులు ఎదుర్కొవడమే కాకుండా సకాలంలో తగిన వైద్యం పొందలేక నానా అవస్థలు పడుతున్నారు. అంతేకాదు చైనా వాసులు కొంతమంది ఈ చర్యలపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ.. సోషల్‌ మీడియాలో పోస్ట్‌లు పెడుతున్నారు.

షాంఘైలో అమలవుతున్న సరికొత్త జీరో కోవిడ్‌ పాలసీ
షాంఘై ఒక సరికొత్త జీరో కోవిడ్‌ పాలసీ విధానాన్ని అమలు చేస్తోంది. నమోదవుతున్న కరోనా కేసుల ప్రమాద తీవ్రత ఆధారంగా మూడు వర్గాలుగా విభజించింది. మొదటి వర్గం వారు కఠినతరమైన కోవిడ్‌ ఆంక్షలు ఎదుర్కొనక తప్పదు. రెండో వర్గం వారు కొద్దిపాటి ఆంక్షలను ఎదుర్కొంటారు. మూడో వర్గం వారికి ఆంక్షలు వర్తించవు, పైగా బహిరంగ ప్రదేశాల్లో తిరిగేందుకు అనుమతి కూడా ఉంటుంది.

చైనా అధికారులుకే కాకుండా ప్రజలకు కూడా ఈ లాక్‌డౌన్‌ ఆంక్షలు పాటించడం ఒక సవాలుగా మారింది.  మాకు ఆహారం పంపండి అంటూ నిర్బంధంలో ఉన్నవారి ఆకలి కేకలతో హోరెత్తిపోతుంటే మరొకవైపు అధికారులు కరోనా కట్టడికై లాక్‌డౌన్‌కి సంబంధించిన సరికొత్త విధానాన్ని అమలు చేసేందుకు తలమునకలవుతున్నారు.

(చదవండి: చైనాకు గట్టి షాకిచ్చిన భారత్‌)

మరిన్ని వార్తలు