కేన్సర్‌ను చంపే రోబోలు!

7 Dec, 2021 02:16 IST|Sakshi

త్వరలోనే మనిషి శరీరంలో రోబోలు అటూఇటూ తిరిగేస్తాయి..! 

మొండి వ్యాధులకు తమదైన రీతిలో ‘చికిత్స’చేసేస్తాయి!! 

రోబోలను తయారుచేసిన అమెరికన్‌ కెమికల్‌ సొసైటీ శాస్త్రవేత్తలు

4డీ ప్రింటింగ్‌తో మొదలు...: కేన్సర్‌ చికిత్సకు ప్రస్తుతం ఉపయోగిస్తున్న కీమోథెరపీతో ఫలితాలు మెరుగ్గానే ఉన్నా దుష్ప్రభావాలు మాత్రం చాలా ఎక్కువ. వేలికి గాయమైతే చేయి తీసేయాలనేలా ఉంటుంది కీమో చికిత్స. కాకపోతే మరో ప్రత్యామ్నాయం లేని నేపథ్యంలో కీమోథెరపీని కొనసాగిస్తున్నారు. ఈ సమస్యను అధిగమించేందుకు అమెరికన్‌ కెమికల్‌ సొసైటీ శాస్త్రవేత్తలు 4డీ ప్రింటింగ్‌ టెక్నాలజీ సాయంతో బుల్లి రోబోలను తయారు చేశారు.

వాటి ద్వారా కేన్సర్‌ కణితులకు నేరుగా కీమో మందులు అందించే చేయగలిగారు. రక్త నాళాల్లో ఇమిడిపోగల ఈ మైక్రో రోబోలను అయస్కాంతాల సాయంతో మనకు కావాల్సిన అవయవం వద్దకు తీసుకెళ్లవచ్చు. కేన్సర్‌ కణితుల పరిసరాల్లోని ఆమ్లయుత వాతావరణానికి స్పందించి ఈ రోబోలు తమలోని కీమో మందులను అక్కడ కక్కేస్తాయి! 

కృత్రిమ రక్తనాళాల్లో పరీక్షలు...: అమెరికన్‌ కెమికల్‌ సొసైటీ సిద్ధం చేసిన మైక్రో రోబోలను రక్తనాళాల్లాంటి నిర్మాణాల్లో పరీక్షించారు. నిర్దేశిత లక్ష్యం వద్దకు ఇవి వెళ్లేలా చేసేందుకు బయటి నుంచి అయస్కాంతాలను ఉపయోగించారు. కేన్సర్‌ కణాలు ఎక్కువగా ఉన్న ప్రాంతంలోకి చేరిన వెంటనే ఆమ్లతకు అనుగుణంగా మైక్రో రోబోల్లోని మందు విడుదలైంది.

ఆ వెంటనే అక్కడి కేన్సర్‌ కణాలు మరణించాయి. ఇప్పుడు తయారు చేసిన వాటి కంటే తక్కువ సైజులో ఉండే మైక్రోబోట్లను తయారు చేయడం ద్వారా త్వరలోనే వీటిని మానవ ప్రయోగాలకు సిద్ధం చేసే అవకాశం ఉంది. ఇవి శరీరంలో తిరిగేటప్పుడు ఫొటోలు తీసేందుకు, ప్రయాణాన్ని పరిశీలించేందుకు మార్గాలను సిద్ధం చేయాల్సి ఉందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. 
– సాక్షి, హైదరాబాద్‌ 

మత్స్యావతారం .. 
ఫొటోలో చూశారుగా.. అమెరికన్‌ కెమికల్‌ సొసైటీ శాస్త్రవేత్తలు తయారు చేసిన మైక్రోరోబో అలా చేప ఆకారంలో ఉంటుంది. హైడ్రోజెల్‌తో తయారయ్యే వాటిని మనకు నచ్చిన ఆకారంలోనూ తయారు చేసుకోవచ్చు. శాస్త్రవేత్తలు తమ ప్రయోగాల కోసం చేపలు, పీతలు, సీతాకోక చిలుకల వంటి భిన్న ఆకారాల్లో మైక్రో రోబోలను సిద్ధం చేశారు. ఆయా ఆకారాల్లో మందులు నింపేందుకు వీలుగా అక్కడకక్కడా వాటిలో కొన్ని ఖాళీలలను ఏర్పాటు చేశారు.

పీతల చేతి కొక్కేల దగ్గర, చేప నోటి వద్ద హైడ్రోజెల్‌ మందాన్ని తగ్గించడం ద్వారా అవి ఆమ్లయుత వాతావరణానికి తగ్గట్టుగా స్పందించి తెరుచుకునేలా లేదా మూసుకునేలా తయారు చేశారు. చివరగా ఈ మైక్రో రోబోలను ఐరన్‌ ఆక్సైడ్‌ నానో కణాలు ఉన్న ద్రావణంలో ఉంచడం ద్వారా వాటికి అయస్కాంతానికి స్పందించే లక్షణాన్ని అందించారు.

మరిన్ని వార్తలు