ఈ రోజు వేలకొద్దీ గొర్రెలు పారిపోయాయి.. ఎందుకో తెలుసా?

6 Jun, 2021 08:20 IST|Sakshi

సాక్షి,సెంట్రల్‌ డెస్క్‌: అదంతా కొండలు, గుట్టలతో కూడిన ప్రాంతం.. ఓ రోజు అర్ధరాత్రి.. పక్కనే ఏముందో కూడా కానరానంతగా చిమ్మచీకటి కమ్ముకుంది.. అంతా నిశ్శబ్దం.. కానీ ఒక్కసారిగా ఏదో అలజడి. ఓ మందలోని గొర్రెలన్నీ కంచెను విరగ్గొట్టుకుని మరీ బయటికి పరుగెత్తడం మొదలుపెట్టాయి. కొంత దూరంలో ఉన్న మరో మందలోనూ ఇది మొదలైంది. కాసేపటికే చుట్టూ ఉన్న ఊర్లలోనూ అదే పరిస్థితి.. పదులు, వందలు కాదు.. వేలకొద్దీ గొర్రెలు.. ఒకే సమయంలో ఉన్నట్టుండి పిచ్చిపట్టినట్టు వగరుస్తూ పరుగెత్తాయి. మందలు ఉన్న కంచెలపై నుంచి దూకి, కొన్నిచోట్ల కంచెలను విరగ్గొట్టుకుని పారిపోయాయి.

మధ్యలో పంటలను, తోటలను అన్నింటినీ ధ్వంసం చేసేశాయి. గొర్రెల యజమానులు పొద్దున లేచిచూసే సరికి.. మందలన్నీ ఖాళీ. ఇదేమిటని వెతకడం మొదలుపెడితే.. కిలోమీటర్ల దూరంలో మైదానాలు, పొదల్లో చెల్లాచెదురుగా ఉన్నాయి. కొన్ని అప్పటికీ వగరుస్తూ, ఏదో భయం భయంగా ఉన్నట్టు కనిపించాయి. ఇంగ్లండ్‌లోని ఆక్స్‌ఫర్డ్‌షైర్‌ కౌంటీలో 1888 నవంబర్‌ 3న ఈ ఘటన జరిగింది. తర్వాత ఐదేళ్లకు 1893 డిసెంబర్‌ 4న మరోసారి ఇలాగే వేలకొద్దీ గొర్రెలు పారిపోయాయి. ఈ ఘటనలు జనంలో తీవ్ర భయాందోళన రేకెత్తించాయి. అసలు ఏం జరిగిందన్నది ఎవరికీ అర్థం కాలేదు.

ఇప్పటికీ తేలని మిస్టరీ.. 
నిజానికి గొర్రెలు చాలా పిరికి జంతువులు. ముందు ఏదైనా చిన్నగా అడ్డంగా ఉన్నా దాటకుండా ఆగిపోతాయి. అలాంటిది ఏకంగా కంచెలను విరగ్గొట్టి మరీ పరుగెత్తడం, ఒకేసారి వేలకొద్దీ గొర్రెలు పారిపోవడం పెద్ద మిస్టరీగా మారింది. ఆస్తులు, పంటలకు భారీగా నష్టం జరిగింది. చాలా మంది శాస్త్రవేత్తలు ఇదేమిటో తేల్చేద్దామని ప్రయత్నించారు. ఉరుములు, పిడుగులకు భయపడ్డాయని.. స్వల్ప స్థాయి భూకంపం వచ్చి ఉంటుందని.. అడవి జంతువులు దాడిచేసి ఉంటాయని.. ఎవరో కావాలని అలా చేసి ఉంటారని.. ఇలా ఒక్కొక్కరూ ఒక్కో కారణం చెప్తూ వచ్చారు. కానీ ఇవేవీ ఆ ఘటనను సరిగా తేల్చలేకపోయాయి. ఎందుకంటే.. గొర్రెలు పరుగెత్తింది ఒకటీ రెండు చోట్ల నుంచి కాదు.. పదుల సంఖ్యలో గ్రామాల నుంచి.. సుమారు 500 కిలోమీటర్ల వైశాల్యంలో ఒకే సమయంలో వేలకొద్దీ గొర్రెలు పారిపోయాయి. ఆ రోజు ఉరుములు, మెరుపులు, తుపాను వంటివేమీ రాలేదు కూడా. 

నల్లటి మేఘం కమ్మేసి.. 
ఈ ఘటన గుట్టు తేల్చేందుకు ఎంతో మంది శాస్త్రవేత్తలు ప్రయత్నించినా ఇప్పటికీ ఏమీ తేల్చలేకపోయారు. అయితే ఈ ఘటనపై స్థానిక అధికారులు ప్రభుత్వానికి రాసిన ఓ లెటర్‌లో కాస్త ఆసక్తికర అంశం ఒకటి ఉంది. ఈ రెండు ఘటనలు జరిగినప్పుడు కూడా.. ఆకాశంలో పెద్ద నల్లటి మేఘం కనిపించింది. మెల్లగా ఆ ప్రాంతమంతా ఆవరించింది.

పక్కనే ఎవరు ఉన్నారో కూడా తెలియనంతగా చిమ్మ చీకటి కమ్ముకుంది. కాసేపటికే గొర్రెలన్నీ పారిపోవడం మొదలైంది. దీన్ని ఆధారంగా చేసుకునీ శాస్త్రవేత్తలు ఓ ప్రతిపాదన చేశారు. అసలేమీ కనిపించని చీకటి కారణంగా.. తమనెవరో బంధించారని, ఏదో జరగబోతోందని గొర్రెలు భయపడ్డాయని, కొన్ని గొర్రెలు అటూఇటూ పరుగెత్తడంతో మిగతావీ బెదిరి పారిపోయి ఉంటాయని పేర్కొన్నారు. ఇదీ జస్ట్‌ ఓ అంచనా మాత్రమే. అసలేం జరిగిందన్నది ఇప్పటికీ మిస్టరీనే..
చదవండి: ఊపిరి ఉన్నంతవరకూ కేసీఆర్‌ వెంటే..

మరిన్ని వార్తలు