భారత్‌ మాకు నిజమైన మిత్రదేశం: బంగ్లాదేశ్‌

17 Dec, 2020 15:34 IST|Sakshi

న్యూఢిల్లీ: భారత్‌ తమకు నిజమైన మిత్ర దేశమని బంగ్లాదేశ్‌ ప్రధాని షేక్‌ హసీనా అన్నారు. స్వాతంత్ర్య పోరాటంలో తమకు అండగా నిలిచిన భారత ప్రజలకు ధన్యవాదాలు తెలిపారు. తూర్పు పాకిస్తాన్‌ నుంచి విడిపోయి సొంతంగా దేశాన్ని ఏర్పాటు చేసుకునే క్రమంలో బంగ్లాదేశ్‌కు భారత్‌ పూర్తి మద్దతు తెలిపిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో 1971లో ఇండో- పాక్‌ యుద్ధం మొదలైంది. ఇందులో భారత్‌ విజయం సాధించడంతో బంగ్లాదేశ్‌ స్వతంత్ర్య దేశంగా అవతరించింది. ఈ చారిత్రాత్మక ఘటన జరిగి బుధవారానికి 50 ఏళ్లు పూర్తయ్యాయి. 

ఈ నేపథ్యంలో భారత ప్రధాని నరేంద్ర మోదీ, బంగ్లా ప్రధాన మంత్రి షేక్‌ హసీనా గురువారం వర్చువల్‌ సమావేశంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా షేక్‌ హసీనా మాట్లాడుతూ.. స్వాత్రంత్య పోరాటంలో ప్రాణాలు అర్పించిన అమరులకు నివాళులు అర్పించారు. అదే విధంగా తమకు అండగా నిలబడిన భారత జవాన్లు, వారి కుటుంబాలకు ధన్యవాదాలు తెలిపారు. తమ జాతి స్వేచ్ఛా పోరాటంలో సహకరించిన భారత ప్రభుత్వం, ప్రజల పట్ల కృతజ్ఞతా భావం చాటుకున్నారు. (చదవండి: ఆ 54 మంది సైనికులు ఏమయ్యారు?)

ఇక ఇందుకు ప్రధాని మోదీ బదులిస్తూ.. బంగ్లాదేశ్‌ వ్యతిరేక శక్తులపై గెలుపొందిన సందర్భాన్ని గుర్తు చేసుకుంటూ విజయ్‌ దివస్‌ జరుపుకోవడం తమకు గర్వకారణమని పేర్కొన్నారు. భారత విదేశాంగ విధానానికి సంబంధించి బంగ్లా కీలక పొరుగు దేశం అని వ్యాఖ్యానించారు. వచ్చే ఏడాది తన బంగ్లాదేశ్‌ పర్యటనను ఉద్దేశించి తనకు ఆహ్వానం పలికినందుకు ధన్యవాదాలు చెప్పారు. ఇది తనకు దక్కిన గౌరవం అన్నారు. కాగా ఈ వర్చువల్‌ సమావేశంలో భాగంగా భారత్‌- బంగ్లాదేశ్‌ ఏడు అంశాలపై ఒప్పందం కుదుర్చుకున్నాయి.  

మరిన్ని వార్తలు