అంతర్జాతీయ రాజకీయాలపై... చెరగని ముద్ర

9 Jul, 2022 05:59 IST|Sakshi

షింజో అబె. జీవితమంతా రాజకీయాల్లోనే గడిపిన నేత. అత్యంత ఎక్కువ కాలం పాలించిన ప్రధానిగా జపాన్‌కు సైనికంగా, ఆర్థికంగా నూతన దిశానిర్దేశం చేయడంతో పాటు ప్రపంచ రాజకీయాలపైనా చెరగని ముద్ర వేశారు. జపాన్‌లోని శక్తిమంతమైన రాజకీయ కుటుంబంలో పుట్టారాయన. అబె తాత నొబుసుకే కిషి జపాన్‌ ప్రధానిగా పని చేశారు. మరో తాత ఎయ్‌సాకు సాతో కూడా ఎనిమిదేళ్ల పాటు ప్రధానిగా ఉన్నారు. అనంతర కాలంలో జపాన్‌ను అత్యధిక కాలం పాలించిన ప్రధానిగా ఆయన రికార్డునే అబె అధిగమించడం విశేషం.

అబెనామిక్స్‌తో ఆర్థిక చికిత్స
అబె 1954 సెప్టెంబర్‌ 21న టోక్యోలో జన్మించారు. తండ్రి షింటారో అబె విదేశాంగ మంత్రిగా పని చేశారు. టోక్యోలోని సెయ్‌కీ యూనివర్సిటీ నుంచి పొలిటికల్‌ సైన్స్‌లో గ్రాడ్యుయేషన్‌ చేశాక అబె అమెరికా వెళ్లి సౌత్‌ కాలిఫోర్నియా వర్సిటీలో ఉన్నత విద్యాభ్యాసం చేశారు. కొంతకాలం కోబే స్టీల్‌లో పని చేసి 1982లో విదేశాంగ శాఖలో చేరారు. తర్వాత యమగూచి స్థానం నుంచి ఎల్డీపీ తరఫున పార్లమెంటుకు ఎన్నికై రాజకీయ అరంగేట్రం చేశారు. 2005లో జునిచిరో కొయిజుమి ప్రభుత్వంలో చీఫ్‌ కేబినెట్‌ సెక్రెటరీ అయ్యారు. 2006లో 52వ ఏట తొలిసారి ప్రధాని అయ్యారు.

ఆ పదవి చేపట్టిన అతి పిన్న వయస్కునిగా రికార్డు సృష్టించారు. కానీ అనారోగ్యం వేధించడంతో ఏడాదికే తప్పుకోవాల్సి వచ్చింది. దేశంలో ఐదేళ్ల రాజకీయ అస్థిరత అనంతరం 2012లో రెండోసారి ప్రధాని అయ్యారు. 2020 ఆగస్టు దాకా కొనసాగారు. పాలనలో తనదైన మార్కు చూపించారు. ఏకంగా ఆరుసార్లు ఎన్నికల్లో గెలిచారు. అబెనామిక్స్‌ పేరుతో పలు ఆర్థిక సంస్కరణలకు శ్రీకారం చుట్టారు. సమర్థ విధానాల ద్వారా ఆర్థిక కష్టాల నుంచి దేశాన్ని గట్టెక్కించారు. తిరుగులేని ఆర్థిక స్థిరత్వాన్ని సాధించిపెట్టారు. ఆగర్భ శత్రువైన చైనాతో సంబంధాలను మెరుగుపరిచేందుకు ప్రయత్నించారు.

ప్రపంచ దేశాధినేతలతో సన్నిహిత సంబంధాలు కొనసాగించారు. సైనికపరంగా కూడా జపాన్‌ను అత్యంత బలోపేతం చేయాలని చివరిదాకా తపించారు. జపాన్‌ జాతీయవాదానికి పోస్టర్‌ బోయ్‌గా నిలిచి యువతలో క్రేజ్‌ సంపాదించుకున్నారు. అత్యంత బలోపేతమైన సైన్యాన్ని కేవలం ఆత్మరక్షణకే పరిమితం చేస్తూ అంతర్జాతీయ సంఘర్షణల్లో జోక్యం చేసుకోవడాన్ని నిషేధిస్తున్న దేశ రాజ్యాంగాన్ని మార్చాలని ఎంతగానో ప్రయత్నించారు. దీన్ని చైనా, కొరియాలనే గాక స్వదేశంలోని సంప్రదాయవాదులు కూడా తీవ్రంగా వ్యతిరేకించినా పట్టించుకోలేదు.

రెండో ప్రపంచ యుద్ధంలో ఓడాక జపాన్‌పై అమెరికా తదితర దేశాలు విధించిన ఆంక్షలను, బలవంతపు ఒప్పందాలను పక్కన పెట్టేందుకూ ప్రయత్నించారు. అంతర్జాతీయ వేదికపై మరింత కీలక పాత్ర పోషించేలా జపాన్‌ను తీర్చిదిద్దాలని తపించారు. దేశంలో జాతీయవాద విద్యా విధానాన్ని బాగా ప్రోత్సహించారు. అందరు దేశాధినేతలతోనూ సన్నిహిత సంబంధాలు కొనసాగించినా, భారత్‌ అంటే మాత్రం అబెకు ప్రత్యేకమైన అభిమానం.

అది 1950ల్లో జపాన్‌ ప్రధానిగా చేసిన ఆయన తాత నుంచి ఒకరకంగా ఆయనకు వారసత్వంగా వచ్చిందని చెప్పడం అతిశయోక్తి కాబోదు. తనకు నెహ్రూ ఇచ్చిన ఆతిథ్యాన్ని తాత తనకు వర్ణించిన తీరును ఎప్పటికీ మర్చిపోలేనని పలుమార్లు అబె చెప్పారు. ప్రస్తుత ప్రధాని ఫుమియో కిషిడాపై అబె ప్రభావం చాలా ఉంది. అమెరికాతో జపాన్‌ బంధాన్ని పటిష్టంగా మార్చిన ప్రధానిగా ఆయన పేరు చరిత్రలో నిలిచిపోతుంది.

‘క్వాడ్‌’తో చైనాకు ముకుతాడు
రాజనీతిజ్ఞుడిగా అబె ముందుచూపు అత్యంత నిశితమైనది. ఇండో–పసిఫిక్‌ ప్రాంతంలో చైనాతో ఎప్పటికైనా పెను ముప్పేనని ముందే ఊహించారాయన. దాని ఫలితమే చైనాను ఇప్పుడు నిత్యం భయపెడుతున్న అమెరికా, ఆస్ట్రేలియా, జపాన్, భారత్‌ సంయుక్త కూటమి (క్వాడ్‌). దీని రూపకర్త అబెనే. భారత పార్లమెంటు ఉభయసభలను ఉద్దేశించి ప్రసంగిస్తూ చేసిన ప్రతిపాదనే క్వాడ్‌గా రూపుదాల్చింది. అది జపాన్‌తో పాటు భారత్‌నూ అమెరికాకు సన్నిహితం చేసింది. 

మరిన్ని వార్తలు