మిసెస్‌ శ్రీలంకకు తీవ్ర అవమానం.. నీకు అర్హత లేదంటూ..

7 Apr, 2021 14:13 IST|Sakshi

కొలంబో: ‘‘మిసెస్‌ శ్రీలంక’’ పోటీ ఫైనల్‌లో అనూహ్య పరిణామం చోటుచేసుకుంది. విజేతగా ప్రకటించిన అనంతరం కిరీటం ధరించిన ఓ మహిళకు ఘోర అవమానం జరిగింది. భర్తతో విడాకులు తీసుకున్నందున ఆమె గెలుపునకు అర్హురాలు కాదంటూ మిసెస్‌ శ్రీలంక వరల్డ్‌, మాజీ మిసెస్‌ శ్రీలంక, ఆమె తలపైనున్న కిరీటాన్ని లాగిపడేశారు. ఈ క్రమంలో సదరు మహిళ అవమానభారంతో వేదిక మీది నుంచి వెళ్లిపోయారు. ఇక ఈ ఘటనపై తీవ్ర విచారం వ్యక్తం చేసిన మిసెస్‌ శ్రీలంక వరల్డ్‌ నేషనల్‌ డైరెక్టర్‌ చండీమాల్‌ జయసింఘే, తొలుత విజేతగా ప్రకటించిన మహిళకే కిరీటం దక్కుతుందని స్పష్టం చేయడంతో వివాదం సద్దుమణిగింది.


విజేత పుష్పిక డి సిల్వా(ఫొటో కర్టెసీ: ఫేస్‌బుక్‌)

స్థానిక మీడియా కథనం ప్రకారం..  ఆదివారం జరిగిన అందాల పోటీల్లో శ్రీమతి పుష్పిక డి సిల్వా విజేతగా నిలిచారు. దీంతో ఆమె తలపై కిరీటం అలంకరించగా, మరోసారి ర్యాంప్‌వాక్‌ చేసి ఆమె తన ఆనందాన్ని పంచుకున్నారు. ఇంతలో వడివడిగా అక్కడికి వచ్చిన మాజీ విన్నర్‌ కరోలిన్‌ జూరీ ఒక్కసారిగా సిల్వా కిరీటాన్ని లాగిపడేసి, పక్కనే నిల్చుని ఉన్న మొదటి రన్నరప్‌నకు అలకరించారు. ఈ క్రమంలో సిల్వా జుట్టు మొత్తం చెదిరిపోయింది. కరోలిన్‌ ప్రవర్తనతో కంగుతిన్న సిల్వా అక్కడి నుంచి వెళ్లిపోయారు. ఈ విషయం గురించి కరోలిన్‌ మాట్లాడుతూ.. ‘‘వివాహితలకు మాత్రమే విజేతగా నిలిచే హక్కు ఉంటుంది. విడాకులు తీసుకున్న వారికి కాదు’’ అని వ్యాఖ్యానించారు.

నేను విడాకులు తీసుకోలేదు
ఇక ఫేస్‌బుక్‌ వేదికగా ఈ విషయంపై స్పందించిన డి సిల్వా.. ‘‘నేను విడాకులు తీసుకోలేదు. ఒకవేళ నాపై నిందలు వేసిన వారు ఈ విషయాన్ని నిరూపించాలంటే నా విడాకుల పత్రాలు అందరికీ చూపించాలి’’ అని సవాల్‌ విసిరారు. అంతేగాక, తనను అవమానపరిచిన వారిపై చట్టపరమైన చర్యలకు ఉపక్రమిస్తున్నట్లు పేర్కొన్నారు. అదే విధంగా.. ‘‘ఒక మహిళ కిరీటం లాక్కునే మరో మహిళ ఎన్నటికీ నిజమైన రాణి అనిపించుకోదు’’అని కరోలిన్‌కు చురకలు అంటించారు.

ఈ విజయం వారికే అంకితం
ఈ పరిణామాలపై అందాల పోటీ నిర్వాహకులు స్పందిస్తూ.. డి సిల్వానే విజేత అని మరోసారి స్పష్టం చేశారు. ‘‘ఆమెకు కిరీటం తిరిగి ఇచ్చేస్తాం. కరోలిన్‌ ఎందుకిలా చేశారో అర్థం కావడం లేదు. ఈ ఘటనపై ఇప్పటికే విచారణ చేపట్టాం’’ అని బీబీసీతో వ్యాఖ్యానించారు. ఇక అందాల రాణి టైటిల్‌ను మంగళవారం తిరిగి పొందిన డి సిల్వా, ఈ గౌరవాన్ని ఒంటరి తల్లులకు అంకితం చేస్తున్నట్లు ప్రకటించడం విశేషం. కాగా ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్‌ మీడియాలో చక్కర్లు కొడుతోంది.

చదవండి: గదికి వెళ్లి పెద్దగా ఏడ్చేశాను.. రాత్రంతా ఏడుస్తూనే ఉన్నాను

మరిన్ని వార్తలు